కృష్ణా,గోదావరి వరదలపై చంద్రబాబు సమీక్ష
ఢిల్లీ నుంచి సీఎస్, డీజీపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు.;
గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. రెండు నదులకు వస్తున్న వరద ప్రవాహాలు, పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, నివాస సముదాయాలకు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం నుంచి 5.20 లక్షలు, నాగార్జున సాగర్ నుంచి 4.32 లక్షలు, పులిచింతల నుంచి 4.07 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గోదావరి నదిలోనూ భారీగానే వరద ప్రవాహాలు వస్తున్నాయని ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 13,42,307 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోందని సీఎంకు వివరించారు.
గోదావరి వరదల కారణంగా పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికారం యంత్రాంగం సమస్య వచ్చిన తరువాత స్పందించటం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే సన్నద్ధతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. వరదలు, భారీ వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు నిరంతరం ఖచ్చితమైన సమాచారం ఇచ్చి..తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూడాలని సీఎం చెప్పారు.