‘‘ఇకనైనా నా నామస్మరణ మానుకో బాబు’.. సీఎం జగన్ సజెషన్

ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.

Update: 2024-09-13 16:02 GMT

‘‘అబద్దాలను మాన్యుఫ్యాక్చర్ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఆ అబద్దాలను సేల్ చేసే సత్తా కూడా ఈ భూమ్మీద ఆయనొక్కడికే సొంతం’’ ఏలేరు వరద ముంపు బాధితులను పరామర్శించిన సందర్భంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలివి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతుందని, ఇప్పటి వరకు వాళ్లు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఏమైనా చేసి ఉంటే.. ఇప్పటి వరకు ఏం చేశారో వాళ్లే సెలవియ్యాలంటూ చురకలంటించారు. రాష్ట్రంలో మంచి ఏం జరిగా తాము చేశామని, ఇంకేమైనా జరిగితే అంతా జగనే చేశారంటూ తనపై నెట్టడం కూటమి సర్కార్‌కు, చంద్రబాబుకు ఫ్యాషన్ అయిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేస్తున్న అబద్దపు ప్రచారాలతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని అన్నారు. అబద్దాల ప్రచారాల్లో చంద్రబాబు గోబెల్స్‌కి తమ్ముడి వరస అవుతారని, అబద్దాల ప్రచారం పోటీ అయితే అందులో వరల్డ్ రికార్డ్ కూడా సాధిస్తారంటూ సెటైర్లు పేల్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ, జగన్ టార్గెట్‌గా విమర్శలు చేయడం, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేయడం తప్ప వాళ్లు చేసిందేమీ లేదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి.

బాబు.. ఇకనైనా నా స్మరణ ఆపు

అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయాల్సిన పనిని ఒక్కటి కూడా చంద్రబాబు చేయలేదని, ఏకాడికి గత ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడమే తన పరమావధిగా ఆయన, ఆయన మంత్రివర్గం పనిచేసిందని ధ్వజమెత్తారు జగన్. ‘‘రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముందుగానే హెచ్చరికలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా లక్షల మంది ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుంది. పైగా అంతటికీ జగనే కారణమని విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం జగనే.. అని పాడిందే పాట పడుతున్నా అధికారంలో ఉన్న నేతలు. చంద్రబాబు.. ఇకనైనా జగన్నామస్మరణ ఆపు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచాయి. ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఇకనైనా చేయాల్సిన దాని గురించి ఆలోచించు. నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో. బాధితులకు ఇవ్వాల్సిన దాని గురించి ధర్మంగా ఆలోచించు’’ అని హితవు పలికారు జగన్.

వ్యవస్థలన్నీ అస్తవ్యవస్తం

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయ్యాయని మాజీ సీఎం జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే ఆర్బీకే వ్యవస్థ, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్లకు అధిక వేతనాలు ఇస్తామంటూ వాళ్లు చేసిన వాగ్దానాలు మాటలకే పరిమితం అయ్యాయి తప్ప ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదంటూ మండిపడ్డారు. ‘‘వ్యవసాయ సీజన్ వచ్చింది. రైతులకు పంటల బీమా ప్రీమియమ్ ఇంకా కట్టలేదు. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించలేదు. వారికి అందాల్సిన సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయో తెలియదు. రైతు భరోసా ఏమైందో?’’ అని ప్రశ్నించారు.

‘‘వైసీపీ హయాంలో ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటీ ప్రజలకు డోర్ డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఏం కావాలన్నా టీడీపీ నేతల డోర్లు తట్టాల్సి వస్తుంది. ఆ నాయకుల ఇళ్లలోనే సచివాలయ సిబ్బంది పింఛన్లను అందిస్తున్నారు. సచివాలయాలలో అందించాల్సిన పింఛన్లను నేతల ఇళ్లలో అందించడమేంటో అర్థం కావట్లేదు. ఎవరైనా నేతల ఇంటికి వెళ్లి పింఛన్ తీసుకోకపోతే వాళ్ల పెన్షన్‌ను కట్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ప్రజా పాలన గాలికి కొట్టుకుపోయింది. రాష్ట్రమంతా అతలాకుతలమవుతోంది’’ అని అన్నారు.

మోసాలవుతున్న అబద్దాలు

‘‘ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరూ బాధ్యతలు నిర్వర్తించరు. ఇలాంటి దారుణ పాలన పోవాలి. చంద్రబాబు చెప్పిన అబద్దాలు ఇప్పుడు మోసాలు అవుతున్నాయి. ప్రజలకు ఆగ్రహం వస్తోంది. వాళ్లు తిరగబడే రోజులు అతి త్వరలోనే వస్తాయి. అధికారంలోకి వచ్చిన ఉదయం నుంచే రెడ్‌బుక్ పాలన చేస్తున్నారు. ప్రజలకు ఇక భరించే పరిస్థితి లేదు. ప్రజల కష్టాలకు ప్రభుత్వం స్పందించడం లేదు. చంద్రబాబువన్నీ డ్రామాలే. పవన్ కల్యాణ్ సినిమా ఆర్టిస్ట్.. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్. కానీ పవన్ కన్నా చంద్రబాబే బాగా నటిస్తున్నారు’’ అంటూ చురకలంటించారు మాజీ ముఖ్యమంత్రి జగన్.

చంద్రబాబుది మార్క్ కాదు మరక

‘‘చంద్రన్న వస్తే రూ.20 వేలు ఇస్తామని, రూ.15 వేలు ఇస్తామని బడి పిల్లలను మోసం చేశారు. రూ.18వేలు ఇస్తామని అక్కాచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ.36వేల నిరుద్యోగ భృతి అని వాళ్లని కూడా మోసం చేశారు. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు మార్క్ పాలన కాదు. చంద్రబాబు మరక పాలన. ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు ఈ ప్రభుత్వం. విద్యాదేవెన గోరుముద్ద వంటి పథకాలను గాలికొదిలేశారు. వరద బాధితులకు కనీస పునరావాసం కూడా కల్పించడం లేదు. కానీ అన్నీ చేస్తున్నట్లు కలరింగ్‌లు ఇస్తున్నారు’’ అని మండిపడ్డారు.

Tags:    

Similar News