సింగపూర్‌లో చంద్రబాబు రెండు గంటల కాలినడక
ఉత్తమ విధానాలతో ఏపీ భవిష్యత్ నగరం అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;
రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లారు. సోమవారం సింగపూర్‌లో 10 వేల కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్‌ను సీఎం బృందం సందర్శించింది. సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు కాలి నడకన సందర్శించారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ సింగపూర్–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.