వంగవీటి రాధాకి సీఎంవో నుంచి పిలుపు, ఎమ్మెల్సీ ఖాయమంటూ ప్రచారం
కాపు నాయకుడు వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధాకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.
By : The Federal
Update: 2024-12-12 08:55 GMT
ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధాకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చునని భావిస్తున్న తరుణంలో ఈ పిలుపు రావడం గమనార్హం. దీంతో ఆయన్ని కూడా రాష్ట్ర శాసనమండలి సభ్యుణ్ణి చేసి మంత్రి పదవి ఇవ్వొచ్చునన్న ఊహాగానాలు బయలు దేరాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరినపుడు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి లభించవచ్చునని అంచనా వేస్తున్నారు.
వంగవీటి రాధాకృష్ణ 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో వైఎస్సార్సీపీ లో చేరి ఎన్నికల్లో ఓడిపోయాడు. 2019లో తెలుగుదేశం పార్టీలో చేరాడు.
వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ఆరంగేట్రం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2008లో ప్రజా రాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయాడు.
వంగవీటి రాధాకృష్ణ 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయాడు. ఆయన 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పని చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశాడు. ఆయనకు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో క్రమంగా వైసీపీకి దూరం అవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 20 జనవరి 2019లో వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడు.
పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో 2023 సెప్టెంబర్ 3న వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల నిశ్చితార్థ వేడుక జరిగింది. పుష్పవల్లి నర్సాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాణీ, బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె. వంగవీటి రాధా వివాహం అక్టోబర్ 22న విజయవాడ సమీపంలో మురళి రిసార్ట్స్ లో జరిగింది.
రాధాకృష్ణ తల్లిదండ్రులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన వారే.