చంద్రబాబు మంత్రం.. పి4 విధానం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ 2027 నాటికి అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. సీఎం పెట్టే పి4 మంత్రం ఏమిటి?;

Update: 2025-02-28 06:48 GMT

పి4 ప్రస్తుతం అధికార, అనధికార వర్గాల్లో చర్చకు దారితీసిన అంశం. అసలు ఈ విధానం ఏమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధానం రూపకల్పనకు ఎందుకు పూనుకున్నారనేది చర్చగా మారింది. ప్రభుత్వం ఏదైనా తన అధీనంలో ఉండాలని కోరుకుంటుంది. అయితే కూటమి సర్కార్ మాత్రం ప్రైవేటీకరణ వైపు కాస్త మొగ్గు చూపిస్తోంది. ఈ పి4 విధానం అనేది పేదరిక నిర్మూలనలో భాగమని ప్రభుత్వం చెబుతోంది. అయితే డబ్బున్న వారు, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది.

ఉగాది నుంచి పీ4కు శ్రీకారం

అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ పీ4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభించ బోతోంది. పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు పీ4 విధానాన్ని ప్రవేశ పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ‘పీ4, ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ - బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌’ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో శాఖ పరమైన సమావేశాన్ని నిర్వహించారు.

సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు, మద్దతుగా నిలబడటమే పీ4 విధానం ముఖ్య ఉద్దేశం. ఇందుకు నిర్మాణాత్మక, స్థిరమైన విధానం ఉండాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పీ4 విధానం (public philanthropic people participation) ఈ ఉగాది నాటికి కార్యరూపం దాల్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పీ4 విధానాన్ని పైలెట్ ప్రాజెక్టు గా అధికారులు రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలకు లబ్ది పొందుతాయి.

పి4 కు 40 లక్షల కుటుంబాలు అర్హులు

ఈ విధానం ద్వారా లబ్ది పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను జీఎస్‌డబ్లుఎస్ డేటాబేస్, హౌస్‌హోల్డ్ సర్వే, గ్రామ సభ ధృవీకరణ ద్వారా గుర్తించడం జరుగుతోంది. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారిని, ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్లు కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు పీ4కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

కొనసాగుతున్న హౌస్ హోల్డ్ సర్వే

హౌస్ హోల్డ్ సర్వే మొదటి దశ కింద రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి జరుగుతోంది. ఇది మార్చి 2 నాటికి పూర్తవుతుంది. ఈ పది జిల్లాల్లో 52 లక్షల కుటుంబాలు ఉంటే 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యింది. రెండో దశ కింద రాష్ట్రంలో మిగిలిన 16 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే మార్చి 8 నుంచి మొదలు పెట్టి మార్చి 18 నాటికి పూర్తి చేస్తారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. పేద కుటుంబాలకు ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలకు అదనంగా వారి సాధికారత కోసం పి4 విధానం ద్వారా సాయం చేయనున్నారు. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప వీటి ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ది దారుల్లో ఎటువంటి మార్పులు చేయరు.

‘సమృద్ధి బంధనమ్’ లో కుటుంబ వివరాలు

లబ్దిదారుల ధృవీకరణ పూర్తి అయిన తర్వాత సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫామ్‌లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ది పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛంధంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.

ఆగస్ట్ కల్లా 5 లక్షల కుటుంబాలు ‘సమృద్ధి బంధనమ్’ కిందకు..

ఉగాదికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమల్లోకి రానున్న ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల అభిలాషి కుటుంబాలను ‘సమృద్ధి బంధనమ్’ కింద తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

'సమృద్ధి బంధనమ్' అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. ఇది వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఉద్దేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడం వంటివి చేస్తారు.

వ్యవసాయ ఉత్పత్తులను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు మంచి లాభాలు వచ్చేలా చేయనున్నారు. రైతులకు మార్కెట్ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహాయం అందించడం, గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, రవాణా సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి చేస్తారు.

ఉపయోగాలు ఎలా ఉంటాయి..

రైతులకు వారి ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. వ్యవసాయ రంగంలో ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల వృధా తగ్గుతుంది.

P4 విధానం అంటే...

P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే ఈ P4 ఉద్దేశం. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకోవడం సహా సాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


Tags:    

Similar News