చంద్రబాబూ.. లిక్కర్ కంటే యూరియా డేంజరా?

యూరియాపై నాలుక మడతేసింది మీరా? రైతులా? కలెక్టర్ల సమావేశంలో మీరు చెప్పిందేమిటీ? విరుచుకుపడిన కౌలు రైతు సంఘం;

Update: 2025-09-16 14:16 GMT
"పంటలు పండిస్తాం, యూరియా ఇమ్మంటుంటే" దాన్ని వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని, దానికి రైతులే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించడం, బెదిరించడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం విమర్శించింది. చంద్రబాబు తన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.కాటమయ్య, పి.జమలయ్య మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కూటమి సర్కారు అమ్ముతున్న లిక్కర్ కన్నా యూరియా ప్రమాదం కాదని ఎద్దేవా చేశారు.

సంవత్సరానికి సుమారు రూ.30 వేల కోట్ల పైచిలుకు విలువైన మద్యాన్ని టార్గెట్ పెట్టి తాపిస్తూ ప్రజల అనారోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్ కు గురిచేస్తున్నది ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి సర్కారుకు ప్రజల సంక్షేమ పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ముందుగా మద్యం లాంటి ప్రమాదకరమైన పదార్థాలను నిషేదించాలని తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని కాపాడాలని కోరారు.
నిన్నటి దాకా యూరియా అందించమంటే గత ఏడాది కంటే ఎక్కువ అందించామని, యూరియాను రైతులు అధికంగా వాడుతున్నారని, నిల్వ పెట్టుకుంటున్నారని, యూరియా అక్రమదారి పడుతుందని పచ్చి అబద్దాలు చెప్పిన కూటమి ప్రభుత్వం నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్లేట్ ఫిరాయించిందన్నారు.
యూరియాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షాత్తు ప్రకటించడం రైతులపై చేసిన ఆరోపణలు తప్పుని, రైతులకు క్షమాపణ చెప్పాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోదని ఆ మేరకు బస్తాకు రూ.800ల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామని ఇప్పుడు చెప్పడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన అక్రమ ఒప్పందం బయటపడిందని ద్వజమెత్తారు. పైగా యూరియా అందటం లేదని రైతులు, ప్రతిపక్షాలు, రైతులు, కౌలురైతు సంఘాలు వివిధ రూపాల్లో వాస్తవాలను వెలుగులో తీసుకొస్తే అబద్దాల ప్రచారం చేస్తున్నారని 'మీ మీద కేసులు పెడతామని' బెదిరించిన చంద్రబాబునాయుడు ఇప్పుడేమీ సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు సాయిల్ టెస్టులు (భూసార పరీక్షలు) చేయలేదు. ఒక్క కేజీ సూక్ష్మ పోషకాలు అందించలేదు. నామ మాత్రమే పచ్చిరొట్ట విత్తనాలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. సేంద్రియ ఎరువులు వాడాలని, జీవన ఎరువులు వాడాలని ఉచిత సలహాలు ఇవ్వటం సిగ్గుచేటు అన్నారు. కానీ వాటిని సబ్సిడీ రూపంలో అందించడానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని అలాంటప్పుడు రసాయన ఎరువులు వాడకపోతే దిగుబడి రాదని, పెట్టిన పెట్టుబడి, చెల్లించిన కౌలు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆందోళనతో రసాయన ఎరువులు వాడుతున్నారనన్నారు.
క్షేత్రస్థాయిలో ఎవ్వరు వ్యవసాయం చేస్తున్నారో ఈ ప్రభుత్వానికి సోదిలో ఉందా అని గుర్తు చేశారు. ప్రతి ఏడాది పెరుగుతున్న కౌలు రేట్లను నియంత్రించడం లేదని, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తదితర ఇన్ పుట్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చి పంటల పండిస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న రైతులను కించపర్చడం బాధాకరమన్నారు.
పండించిన పంటలకు కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితులలో, దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి ఆరోపణలు చేయటం హీనమైన చర్యన్నారు.
రాష్ట్రంలో 80శాతం పంటలు పండిస్తున్నది కౌలు రైతులే వీరికి గుర్తింపు కార్డులు లేవని బస్తాకు రూ.800లు చొప్పున ఇస్తే సాగు చేయని భూ యజమానులకు వెళతాయి తప్ప వాస్తవ సాగుదారులైన కౌలురైతులకు అందే అవకాశం లేదన్నారు.ఒక రకంగా చెప్పాలంటే సాగు చేయని భూ యజమానులకు అందించే పథకం లాగా తయారువుతుంది తప్ప కౌలురైతులకు న్యాయం జరగదన్నారు. క్రమంగా ఎరువుల సరఫరా చేసే విధానానికి స్వస్తి పలికి గ్యాస్ లాగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి క్రమంగా ఎరువులు అందించే బాధ్యత నుండి తప్పుకోవటానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగం కుదేలవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సాయిల్ టెస్టు చేయడం లేదు. సాయిల్ టేస్ట్ లో ఏ పోషకాలు లోపంగా ఉన్నాయే నిర్దారణ చేసిన రిపోర్టు భూ యజమానులకు ఇవ్వడం వలన కౌలురైతులకు ఎటువంటి ఎరువుల వాడాలో తెలియడం లేదు. కూటమి సర్కారు ఆధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పట వరకు ఒక్క కేజీ సూక్ష్మ పోషకాలు ఇవ్వలేదని,జీవన ఎరువుల మాటే మార్చారన్నారు. కేంద్రప్రభుత్వం ఎరువుల సబ్సిడీ తగ్గించుకునేందుకు మరోవైపు వ్యవసాయాన్ని దెబ్బ తీసి విదేశాలపై ఆధారపడే విధంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

క్రమంగా రైతుల్ని భూముల్నుంచి వేరుచేసి, వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని విష ప్రచారం చేయడం మానుకోవాలని భవిష్యత్తులోనైనా పచ్చిరొట్ట విత్తనాలు, జీవన ఎరువులు సాగు చేసే రైతులకు, కౌలురైతులకు అందించి ప్రోత్సహించాలని ఎ. కాటమయ్య, పి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News