ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అరాచక వాది, అప్రజాస్వామిక వాది, అబద్దాలు చెప్పడంలోను, వెన్నుపోట్లు పొడవంలోను సిద్ధహస్తుడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యానికి పాతల వస్తున్నారని ఆయన మండిపడ్డారు. చివరికి ధర్మమే గెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. ఆ మేరకు జగన్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
జగన్ ఏమన్నారంటే..
సీఎం చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుగారు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబుగారు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాన్ని ఒక సారి చూస్తే..
1. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందలమంది వైయస్సార్‌సీపీ, నాయకులను కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేసి, వైయస్సార్‌సీపీ తరఫున పనిచేస్తున్నవారిని, ప్రచారంచేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
2. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైయస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడిచేశాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికిదిగారు. ఈ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.
3. ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్యచేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లెవద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు,రాళ్లు, రాడ్లతో దాడిచేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నంకూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్రగాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారు. వైయస్సార్‌సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈరకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.
4. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6, మధ్యాహ్నం 3.30గంటలకు వైయస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడిచేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముసహా మరొక 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ హత్యాయత్నం కేసుపెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింతమంది వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.
5. ఆగస్టు8, వైయస్సార్‌సీపీకి చెందిన ఒక నాయకుడ్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమవైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని, తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైయస్సార్‌సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైయస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీచేశారు.
6. అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైయస్సార్‌సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు4వేల మంది ఓటర్లను, పక్కా వైయస్సార్‌సీపీకి చెందిన గ్రామాలకు చెందినవారిని ఈ రకంగా ఇబ్బందిపెట్టి, వీళ్లు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడ్డం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డం, చంద్రబాబుగారు ఈమాదిరి కుట్ర చేస్తున్నారు.
(పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్న టేబుల్‌ను అటాచ్ మెంట్లో ఉంది. పరిశీలించగలరు)
7. ఆగస్టు8 రాత్రి, నల్లగొండువారిపల్లెవద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీకేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్లు బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అయినా వారిమీదకూడా ఎస్సీ, ఎస్టీకేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వీరిని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.
8. ఇక ఎన్నికల పోలింగ్ రోజున, ఓటింగ్ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడిచేస్తున్నారు. వారిపై దాడులకూ సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసంచేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. అంటూ జగన్ ట్వీట్ చేశారు.