ఓ అభిమానికి చంద్రబాబు వీడియో కాల్
తామంతా తోడుగా ఉంటామని క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి సీఎం చంద్రబాబు భరోసా;
By : The Federal
Update: 2025-07-06 04:27 GMT
క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని పట్ల సీఎం చంద్రబాబు ఔదార్యం ప్రదర్శించారు. చంద్రబాబును చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనే ఆ బాధితుడి కోరికను చంద్రబాబు తీర్చారు. వీడియోకాల్ చేసి ఆ క్యాన్సర్ రోగిని పలకరించి, పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నేరుగా సీఎం చంద్రబాబే వారికి వీడియో కాల్ చేసి మాట్లాడటంతో ఆ క్యాన్సర్ బాధితుడు అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ నారా చంద్రబాబు నాయుడుకి వీరాభిమాని. చంద్రబాబు అంటే ఆకుల కృష్ణకు ఎలనలేని గౌరవం, ఇష్టం. తొలి నుంచి తెలుగుదేశంతో పాటు చంద్రబాబు పట్ల తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. అయితే ఇటీవల ఆకుల కృష్ణ క్యాన్సర్ బారిన పడ్డాడు. రోజు రోజుకు తన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తన అభిమాన రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒక్క సారైనా మాట్లాడాలని ఆశ పడ్డాడు. ఆ మేరకు తన కుటుంబ సభ్యులను కోరాడు. ఈ విషయం స్థాన నాయకుల వెళ్లడం.. అది అక్కడ నుంచి చివరకు చంద్రబాబు వద్దకు చేరింది.
దీంతో ఆ క్యాన్సర్ బాధితుడు ఆకుల కృష్ణ కోరికను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు భావించారు. వెంటనే చంద్రబాబు క్యాన్సర్‌తో ఇబ్బందులు పడుతున్న ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేశారు. బాధితుడితో పాటు అతని కుటుంబ సభ్యులతోను చంద్రబాబు మాట్లాడారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. తామంతా అండగా ఉంటామని బాధితుడు ఆకుల కృష్ణ, ఆయన కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం అయిన ఖర్చులకు సంబంధించిన బిల్లులన్నీ తమకు పంపితే రియింబర్స్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.