కీలకంగా మారిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ

ఓట్ల లెక్కింపుపై కీలక చర్చలు. కూటమికి మెజారిటీ వస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలక చర్చలు.

Update: 2024-05-30 14:13 GMT

ఎన్నికల అనంతరం, ఎన్నికల ఫలితాలకు ముందు తొలి సారిగా టీడీపీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు,జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌లు భేటీ కానున్నారు. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో శుక్రవారం వారి భేటీ జరగనుంది. బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపునకు నాలుగు రోజుల ముందు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి, ఎంత మేరకు మెజారిటీలు నమోదు చేసుకునే అవకాశం ఉందనే అంశాలపైన వీరు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూటమి తరపున టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గ్యారెంటీగా ఏయే సీట్లలో గెలవనున్నారు, ఎన్ని సీట్లు సొంతం చేసుకోనున్నారు తదితర అంశాలపైన చర్చించనున్నారు. ఆయా నియోజక వర్గాల సమాచారాన్ని ఇది వరకే ఆ పార్టీ శ్రేణుల నుంచి అధినాయకులకు చేరినట్లు తెలిసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దానిపైన వారు చర్చించనున్నారు.

జూన్‌ 4న ఎన్నికల భవితవ్యం తేలి పోనుంది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎవరెవరు గెలిచారు, ఎవరికి ఎంత మెజారిటీ వచ్చిందనే విషయాలు జూన్‌ 4న తేలి పోనుంది. ఎన్నికలకు, ఫలితాలకు మధ్య ఎక్కువ రోజులు గ్యాప్‌ ఉండటంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌ రోజు దగ్గరపడే కొద్ది రాజకీయ పార్టీల నేతలతో పాటు అన్ని వర్గాల ప్రజల్లోను టెన్షన్‌ పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు జూన్‌4 వస్తుందని ఎదురు చూస్తున్నారు.
ఎన్నికల అనంతరం ఎవరి ధీమాలో వాళ్లున్నారు. మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, మంత్రులు అయితే ఏకంగా ప్రమాణ స్వీకారం తేదీ, సమయం, ప్రదేశంను ప్రకటించి సంచలనం సృష్టించారు. టీడీపీ నేతలు కూడా కూటమి గెలుస్తుందని, అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిన చంద్రబాబు బుధవారం హైదరబాద్‌ చేరుకున్నారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మంది కీలక టీడీపీ నేతలతో ఆయన టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై ఆయన చర్చించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలనే దానిపైన దిశా నిర్థేశం చేశారు. కౌంటింగ్‌పైన సీరియస్‌గా దృష్టి పెట్టాలని కీలక నేతలకు సూచించారు. కౌంటింగ్‌కు సంబంధించి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ నియోజక వర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లతో శుక్రవారం సమావేశం కావాలని నిర్ణయించారు. కౌంటింగ్‌కు సంబంధించి వారికి ప్రత్యే శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించనున్నారు. జూన్‌ 1న ఈ శిక్షణలు ఇవ్వనున్నారు. నేతలను కౌంటింగ్‌పై సీరియస్‌గా దృష్టి సారించడం, ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడం చాలా కీలకమైనవిగా చంద్రబాబు భావిస్తున్నారు.
Tags:    

Similar News