వంద రోజులే టైం.. ఏ శాఖను వదిలిపెట్టం: చంద్రబాబు

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని, అనేక మంది అధికారులు అక్రమాలు, అవినీతికి అలవాటు పడిపోయారని కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2024-08-03 10:06 GMT

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని, అనేక మంది అధికారులు అక్రమాలు, అవినీతికి అలవాటు పడిపోయారని కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఐదేళ్లలో ఏ రంగాన్ని చూసిన అవినీతి తప్ప అభివృద్ధి, పురోగతి అనేవి కనిపంచడం లేదని కూడా కూటమి ప్రభుత్వం పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. వాటన్నింటిని తప్పకుండా గాడిలో పెడతామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరోసారి పరుగులు పెట్టిస్తానని సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ప్రజలకు భరోసా కల్పించారు. అమరావతిని కూడా నిర్మించి రాజధాని లేని రాష్ట్రం అన్న మచ్చను ఆంధ్రపై నుంచి తొలగిస్తానని కూడా అన్నారు. తాజాగా రాష్ట్రంలోని వ్యవస్థలపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికి డెడ్‌లైన్ కూడా ఫిక్స్ చేసుకుంది. వందే వంద రోజుల్లో అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దాలని, అక్రమాలకు తావు లేకుండా చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులను చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

ఆ ఫిర్యాదులే ఎక్కువ

అక్రమాలకు పాల్పడిన ఏ అధికారిని వదిలేది లేదని అన్నారు చంద్రబాబు. ‘‘ప్రజలు అందించిన అన్ని వినతులను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతాం. ప్రజల అన్ని సమస్యలను తీర్చడమే మా లక్ష్యం. అధికంగా రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే వినతులు వచ్చాయి. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ అసమర్థ పాలన వల్ల ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది. రికార్డులను కూడా తారుమారు చేస్తున్నారు. అన్ని అంశాలను గమనిస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికపై చర్యలు ఉంటాయి. ఎవరినీ ఉపేక్షించేది లేదు’’ అని వార్నింగ్ ఇచ్చారు.

రీసర్వేతో ప్రజలకు ఇబ్బందులు

‘‘వైసీపీ నిర్వహించిన భూముల రీసర్వే అస్తవ్యస్థంగా జరిగింది. దాంతో ప్రజలకు ఎక్కడలేని ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. దాంతో వాటి పరిష్కారానికి పెద్దపీట వేయనున్నాం. రెవెన్యూ శాఖలో ఇన్ని ఫిర్యాదులకు కారకులను గుర్తిస్తాం. గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల రెవెన్యూ శాఖ నిర్వీర్యమైంది. ఇందుకు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదమే నిలువెత్తు నిదర్శనం. అన్ని వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతాం. రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేపడతాం. భూ కబ్జాదారులపై చర్యలు ఉంటాయి. సమస్యలను విభాగాల వారిగీ విభజించి పరిష్కరిస్తాం. అదే విధంగా ప్రజల తమ సమస్యలకు సంబంధించి వినతులు ఇవ్వడానికి అమరావతికి రావాల్సిన అవసరం లేకుండా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా త్వరలోనే చేస్తాం. నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. సీఎంగా నేను చేసే పర్యటనల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు రాకుండా మార్పులు తీసుకొస్తాం. శాఖలు వారీగా చేపడుతున్న సమీక్షలు సత్ఫలితాలను ఇస్తున్నాయి’’ అని వివరించారు.

Tags:    

Similar News