అమరావతికి కొత్త రైల్వే లైన్.. ప్రకటించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతికి నిర్మాణానికి సహకరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన మరుసటి రోజే భారీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించింది కేంద్రం.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతికి నిర్మాణానికి సహకరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన మరుసటి రోజే భారీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని, అందులో భాగంగానే సరికొత్త ప్రాజెక్ట్‌ను అమరావతికి తీసుకొస్తున్నామని కేంద్రం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రా రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్‌ను ఆయన ఈరోజు వివరించారు. ఆంధ్రలో 100 శాతం రైళ్లు విద్యుదీకరించామని, అలాగే రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమృత్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 73 స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటుగా ఏపీలో ఇప్పటికే 743 అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్‌లు నిర్మించినట్లు తెలిపారు.
అమరావతికి రైల్వే లైన్
దక్షిణ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణం కోసం చర్యలు చేపడుతున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో ఈ రైల్వే జోన్ కోసం కేటాయించిన భూమికి బ్యాక్ వాటర్ సమస్య ఉందని తెలిపారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్రప్రభుత్వం కొత్త భూమిని కేటాయించిన అనంతరం నిర్మాణం ప్రారంభం అవుతుంది. విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణానది మీదుగా రూ.2,047 కోట్లతో 56 కిమీ మేర రైల్వే లైన్ నిర్మాణం చేపడతాం. అమరావతి రైల్వే లైన్ డీపీఆర్‌కు నీతి అయోగ్ అనుమతి లభించింది. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుంది’’ అని వెల్లడించారు. అదే విధంగా విజయవాడ నుంచి ముంబైకు వందేభారత్ రైలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కూడా ప్రకటించారు.
ఇదిలా ఉంటే అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం తన పూర్తి సహకారాన్ని ప్రకటించడంతో అమరావతి విషయంలో రాష్ట్ర సర్కార్ తన స్పీడు పెంచింది. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రజారోగ్యశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్‌గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధి కూడా సభ్యులుగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ రాజధాని ప్రాంతంలో చేపట్టే వేర్వేరు నిర్మాణాల్ని పరిశీలించాలని, అనంతరం నిర్మాణ పనులను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే అంశంపై సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
తెలంగాణకు కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రైల్వేకు కూడా కేంద్రం భారీగా కేటాయింపులు చేసింది. దాదాపు రూ.5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6రెట్లు ఎక్కవని తెలిపారు. ‘‘తెలంగాణలో ప్రస్తుతం రూ.32,946 కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అమృత్ పథకంలో భాగంగా 40 రైల్వేస్టేషన్లు ఆధునికీకరించాం. తెలంగాణలో కూడా వందశాతం విద్యుదీకరణ పూర్తయింది. గడిచిన 10ఏళ్లలో 437 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం పూర్తయింది. దేశంలో రూ.1.9లక్సల కోట్లతో రైల్వే సేఫ్టీ కోసం కేటాయింపులు చేశాం. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో 60శాతం తగ్గాయి’’ అని వివరించారాయన.