సూపర్ జీఎస్టీతో దసరా,దీపావళీ చేసుకోండి
భవిష్యత్ తరాలను అభివృద్ధి వైపు అడుగులు వేయించే సంస్కరణలివి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎలా మేలు జరిగిందో... సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సూపర్ జీఎస్టీగా మార్చిందని.. దీని ద్వారా కూడా ప్రజలకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని సీఎం వివరించారు. సుమారు రూ.8,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు ఆదా అవుతుందని చెప్పారు. సోమవారం జరిగిన మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రచార కార్యక్రమాలపై శాసనసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘జీఎస్టీ 2.0 ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందేలా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశాం. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. 2047 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల సాధనకు జీఎస్టీ సంస్కరణలు, సూపర్ సిక్స్ , పీ4 కార్యక్రమాలు శక్తివంతంగా పని చేస్తాయి. నిత్యావసర వస్తువుల్లో 99 శాతం వస్తువులపై సున్నా శాతం పన్ను ఉంది. చిన్న చిన్న వ్యాపారాలకు లబ్ది కలుగుతుంది. ఎంఎస్‌ఎంఈలకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనం కలుగుతుంది. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా నినాదాలకు ప్రత్యక్షంగా నెక్స్ జెన్ జీఎస్టీ సంస్కరణలు పెద్ద ఎత్తున తోడ్పడతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు పెద్ద ఎత్తున సహకారం లభిస్తుంది. గ్లోబల్ బ్రాండ్లుగా భారతీయ ఉత్పత్తులు పోటీ పడేందుకు పెద్ద ఎత్తున ఆస్కారం కలుగుతుంది. భారతీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశాభివద్ధిలో నేరుగా భాగస్వాములైనట్టే. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రతి ఇంటికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తాం. 65 వేలకు పైగా సమావేశాలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.’’ అని చంద్రబాబు వివరించారు.