TTD LADDU| తిరుమలలో కల్తీ నెయ్యి డొంక కదులుతోంది!
తిరుమల శ్రీవారి లడ్డూ (TTD LADDU) తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి రూటేమిటో తెలుసుకునేందుకు సీబీఐ తీగలాగుతోంది.
By : The Federal
Update: 2024-11-26 02:16 GMT
తిరుమల శ్రీవారి లడ్డూ (TTD LADDU) తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి రూటేమిటో తెలుసుకునేందుకు సీబీఐ తీగలాగుతోంది. ఇప్పటికే ఒకటి రెండు కంపెనీల నుంచి సమాచారం రాబట్టినప్పటికీ దాని విశ్వసనీయతపై అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు బృందంలోని కొందరు అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (TTD LADDU) తయారీలో గొడ్డు కొవ్వుతో తయారుచేసిన కల్తీ నెయ్యి ఉన్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడం, దానిపై సుప్రీంకోర్టు సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు అయింది. దానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తన సీఐడీ బృందంతో దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు బృందం ఏర్పాటు అయింది. ఈ నేపథ్యంలో తిరుమల వచ్చిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు నెయ్యి ఒప్పందం కాంట్రాక్టులను పరిశీలిస్తున్నారు. కొందరు ఉద్యోగులు, అధికారుల నుంచి సమాచారం రాబడుతున్నారు.
నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థ మాత్రమే టీటీడీకి నేరుగా నెయ్యి సరఫరా చేసిందా లేక మరెవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా అనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే ఏఆర్ డెయిరీతోపాటు వైష్ణవి డెయిరీలను పరిశీలించి వచ్చిన సిట్ అధికారులు ఆ సమాచారాన్ విశ్లేషిస్తున్నారు. టెండరు సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలేంటి? ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాల్నీ సరిచూస్తున్నారు. నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని టీటీడీ నిర్ణయించింది, ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరిచూశారు. ఏఆర్ డెయిరీ వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేస్తుందన్న విషయమై కూడా అధికారులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతతో ఉన్నట్లు ఎస్‌ఎంఎస్ ల్యాబ్ ధ్రువీకరించిందని ఏఆర్ డెయిరీ పేర్కొంటున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించిన తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
తమిళనాడు దిండుక్కల్‌లోని ఏఆర్ డెయిరీ, శ్రీకాళహస్తి ప్రాంతంలోని వైష్ణవి డెయిరీలతోపాటు చెన్నైలోని ఎస్‌ఎంఎస్ ల్యాబ్ నుంచి కొన్ని ఫైళ్లను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని.. ఈ డెయిరీ నిర్వాహకులు రెండు ఇతర డెయిరీల నుంచి నెయ్యి సేకరించి, టీటీడీకి సరఫరా చేసినట్లు, అదీ నాణ్యతా లోపంగా ఉందని గుర్తించినట్లు తెలిసింది.
హుండీలో చోరి ఎలా జరిగిందీ?
తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీలో చోరీ జరిగింది. నవంబర్ 23న ఈ సంఘటన జరిగింది. శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలో నగదును ఓ దుండగుడు దొంగలించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో కొంత నగదు తస్కరించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన వ్యవహారమంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది పరిశీలించి.. యువకుడిని గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.