ఏపీలో కూడా కులగణన చేపట్టాలి
ఆంధ్రప్రదేశ్‌లో ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలి అని షర్మిల డిమాండ్ చేశారు.;
By : Admin
Update: 2025-02-05 04:46 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కులగణన అంశంపై తెరపైకొచ్చింది. తెలంగాణలో కులగణన పూర్తి చేసి వివరాలను వెల్లడించడంతో ఏపీలో కూడా కులగణన చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా కులగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం. ఇదో చారిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూర దృష్టికి ఇదొక నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారు. అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా కులగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
తెలంగాణలో ఉన్నట్లే ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నాం. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలి. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలి. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి. మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలి. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారు. బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. బీజేపీ డైరెక్షన్‌లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారు. ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోంది. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.