ఎరువులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కేసులు

ఎరువులు పక్క దారి పట్టకుండా చూడాలని, సరఫరాలో రైతులు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.;

Update: 2025-08-24 12:22 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎరువులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాలకు ఎరువులు తరలించకపోకుండా కట్టడి చేయాలని, దీనికి సంబంధిత శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు దిశానిర్థేశం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్‌ పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల లభ్యత, సరఫరాల వంటి పలు అంశాలపైన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎరువులు ఎంత మేరకు అందుబాటులో ఉందని, ఉన్న ఎరువులన్నీ రైతులకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. జిల్లాల వారీగా కూడా ఎరువల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎరువుల నిల్వలు, మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎరువుల సరఫరా వంటి వివరాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎరువులు పక్క దారి పట్టకుండా, వ్యవసాయేతరాలకు ఎరువులు తరలిపోకుండా కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్‌ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని, యూరియాతో పాటు ఇతర ఎరువుల స్టాక్‌ చెకింగ్‌లు కూడా చేపట్టాలని సీఎస్‌ కే విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా, వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా డిమాండ్‌ను సాకుగా చూసుకొని అధిక ధరలకు విక్రయించినా, కావాలని ధరలు పెంచి ఎక్కువ రేట్లకు విక్రయించినా.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటుగా ప్రైవేటు డీలర్లకు ఎరువుల కేటాయింపులు తగ్గించి, మార్క్‌ఫెడ్‌ ద్వారానే అధికంగా ఎరువులు రైతులకు సరఫరా అయ్యేవిధంగా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Tags:    

Similar News