శ్రీవారి దర్శనం పేరిట యాత్రికులకు శఠగోపం..
రూ. 4 లక్షలు తీసుకుని మోసం దళారి అదృశ్యం
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-18 07:34 GMT
తిరుమల శ్రీవారిని దగ్గరగా చూడాలని యాత్రికులు తపన పడతారు. ఈ ఆతృతను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. వారి మాటలు నమ్మి, శ్రీవారి దర్శనం చేయిస్తామనే దళారులు మాటలు విశ్వసించే యాత్రికులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా తెలంగాణకు చెందిన ఓ యాత్రిక బృందం నాలుగు లక్షల రూపాయల చెల్లించి మోసపోయారు. డబ్బు తీసుకున్న వ్యక్తి ఫోన్ స్విచాఫ్ చేయడంతో అతని కోసం ప్రయత్నించి, విసిగి వేసారిన యాత్రికులు తిరుమల రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఆన్ లైన్ లోనే తీసుకోండి. నకిలీ వెబ్ సైట్ల జోలికి వెళ్లవద్దు అని టీటీడీ పదేపదే చెబుతోంది. విజిలెన్స్ విభాగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, దళారుల చేతికి చిక్కే యాత్రికులు దగా పడుతూనే ఉన్నారు.
తిరుమలలో శనివారం ఓ సంఘటన వెలుగు చూసింది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన యాత్రికులు ఓ దళారీని ఆశ్రయించారు. అతని పేరు శ్రీకాంత్ అని తెలిసింది. వారికి ఆ వ్యక్తి ఎలా పరిచయ అయ్యారనేది తెలియలేదు.
తిరుమలలో ఆదివారం దర్శనం చేయిస్తానని ఓ వ్యక్తి చెప్పిన మాటలు విశ్వసించిన ఓ బృదంలోని అమన్ అనే వ్యక్తి తిరుమలలో శ్రీకాంత్ కు నాలుగు లక్షల రూపాయలు ఆన్ లైన్ లో అకౌంట్ కు బదిలీ చేశారు. శ్రీవారి దర్శనానికి ఆ యాత్రికులు తిరుమలకు చేరుకున్నారు. తాము నగదు చెల్లించిన వ్యక్తి కోసం ప్రయత్నిస్తుంటే, ఆ సెల్ ఫోన్ స్విచాఫ్ అని సమాధానం వస్తోంది. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న అమన్ కుటుంబీకులు తిరుమల రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.