విజయసాయి ఉత్తరాంధ్రకు ఊపు తెస్తారా?!

మళ్లీ ఆయనకే రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు. గతంలో ఆయనపై ఫిర్యాదులు, ఆరోపణలతో మార్పు. ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డి నియామకం. ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతానికేనంటున్న పార్టీ.

By :  Admin
Update: 2024-10-20 03:50 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన వైసీపీ ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలను చేపడుతోంది. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల జిల్లాల అధ్యక్షుల్లో మార్పులు చేర్పులు చేసింది. తాజాగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల (రీజనల్ కో-ఆర్డినేటర్ల)ను నియమించింది. ఇందులోభాగంగా గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికే ఇప్పుడు మళ్లీ ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను అప్పగించింది. 2022 వరకు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు రీజనల్ కోఆర్డినేటర్ వ్యవహరించారు. అప్పట్లో ఇంటా బయటా ఆయనపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.

భూవివాదాల్లో జోక్యం, వర్గ విభేదాలు, పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు, వర్గ విభేదాలు, కొన్ని వర్గాలకే ప్రాధాన్యమివ్వడం వంటి ఆరోపణలు వచ్చాయి. పైగా గతంలో లోక్సభ సభ్యుడిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణకు, ఆయనకు గ్రూపు రాజకీయాలున్నాయి. సొంత పార్టీకి చెందిన ఈ ఇద్దరి ఎంపీల రాజకీయాలూ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర, అధినేత జగన్మోహన్రెడ్డి వద్ద ఎంతో ప్రాధాన్యత ఉండడం వల్ల చాన్నాళ్లు ఆయన రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఏమాత్రం డోకా లేకుండా పోయింది.

కొన్నాళ్లు ప్రాధాన్యత లేకుండా..

సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఊపందుకున్నాయి. అసలే ఎన్నికల సమయంలో పార్టీ వర్గాల్లో విభేదాలు ముదిరిపాకాన పడకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి.. తనకు అత్యంత సన్నిహితుడైనప్పటికీ విజయసాయిరెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయనకు పార్టీలో అంతగా ప్రాధాన్యత కూడా లేకుండా పక్కనబెట్టారు. విజయసాయి స్థానంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా జగన్ సొంత బాబాయి, టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అప్పట్నుంచి సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఆయనే ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేశారు. అయితే రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి ఎంత దూకుడుగా వ్యవహరించారో.. సుబ్బారెడ్డి అందుకు భిన్నంగా నడుచుకున్నారన్న పేరు గడించారు.

వివాదాస్పదుడు కాకపోయినా పార్టీ నాయకులను సమన్వయ పరచలేక పోవడం, మెతక వైఖరి, క్రైసిస్ మేనేజిమెంట్ వంటి వాటిలో ఆయన సమర్థవంతంగా పనితీరును కనబరచలేక పోయారన్న అభిప్రాయం వైసీపీ క్యాడరులో బలంగా నాటుకుపోయింది. ఆయనను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కొనసాగించకపోవడానికి ఇవన్నీ కారణమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూ వ్యవహారాలు, రుషికొండ ప్యాలెస్, దసపల్లా భూముల వివాదం తదితర అంశాలపై నిగ్గు తేల్చాలని పట్టుదలగా ఉంది. వీటన్నిటిపై విజయసాయికి అవగాహన, పట్టు ఉందని, అందువల్ల వీటన్నిటినీ చక్కబెట్టగల సమర్థత ఉన్నందున మళ్లీ ఆయనకే రీజనల్ కోఆర్డినేటర్ పదవిని మరోసారి కట్టబెట్టారని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

 

ఈ పదవి బొత్సకే ఇస్తారనుకున్నా..

వైసీపీ గత ఎన్నికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు అసెంబ్లీ, అరకు లోక్సభ స్థానాలను మాత్రమే దక్కించుకుని చావుతప్పి కన్నులొట్టబోయిన పరిస్థితికి వచ్చింది. దీంతో ఎన్నికల అనంతరం ఉత్తరాంధ్ర వైసీపీ పగ్గాలు విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కట్టబెడతారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ మళ్లీ విజయసాయిరెడ్డికే ఆ పదవిని కట్టబెట్టారు. అయితే ఊహించని విధంగా బొత్సకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు.

గ్రూపులను సమన్వయం చేస్తారా?

కొన్నాళ్లుగా ఉత్తరాంధ్ర వైసీపీలో గ్రూపుల గోల నడుస్తోంది. ముఖ్యంగా విశాఖలో ఆ పరిస్థితి మరింత అధికంగా ఉంది. గతంలో విజయసాయి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు అప్పటికీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు విభేదాలు రచ్చకెక్కాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అయిన ఎంవీవీకి చెందిన స్థలాల విషయంలోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు ఎంవీవీ సత్యనారాయణతో వైసీపీ నేత, ప్రముఖ ఆడిటర్ జి. వేంకటేశ్వరరావు (జీవీ)కు వ్యాపార భాగస్వామ్యం ఉంది. వీరితో బొత్స సత్యనారాయణకు కూడా వ్యాపార సంబంధాలున్నాయని అంటారు. దీంతో వీరంతా ఒక మాటగా ఉంటారన్న ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో మళ్లీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమితులవడంతో అధికారంలో ఉన్నప్పటిలా దూకుడుగా వ్యవహరిస్తారా? లేక సామరస్యంగా వీరందరిని కలుపుకుని వెళతారా? అని వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. కాగా విశాఖ జిల్లాలోనే వైసీపీలో ఒకింత వర్గ విభేదాలున్నా.. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆ జిల్లాలో చక్రం తిప్పే ధర్మాన బ్రదర్స్తో విజయసాయికి సత్సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో తీవ్రంగా దెబ్బతిన్న వైసీపీని విజయసాయిరెడ్డి బలోపేతం చేస్తారన్న ఆశాభావం ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. బొత్సకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇవ్వకపోయినా కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించడం వల్ల ఆయన అసంతృప్తికి లోనయ్యే అవకాశం లేదన్నది వీరి అభిప్రాయంగా ఉంది.

Tags:    

Similar News