ఆమె... వ్యూహమే శాసనమా..!

ఆ అసెంబ్లీ స్థానం పరిధి మూడు మండలాలే. ఎన్నికల్లో పోరాటం వ్యక్తుల మధ్య ఉంది. విజయావకాశాలను ఓ మహిళ శాసించనున్నారు.

Update: 2024-04-26 07:47 GMT


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: డోన్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అందుకు కోట్ల, కేఈ కుటుంబాలే ప్రధాన కారణం. తాత, తండ్రుల నుంచి అందిన రాజకీయ వారసత్వం. ఆధిపత్యం కోసం ఆ కుటుంబాల నుంచి సమరానికి దిగారు. అయితే "ప్రతి పురుషుడి విజయం వెనక.. ఓ మహిళ ఉంటుందంటారు" ఇది ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో వాస్తవం అవుతుందనట్లే ఉంది.

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ (ద్రోణాచలం) నియోజకవర్గంలో పోటీ అధికార వైఎస్ఆర్సిపి, కూటమిలోని టిడిపి మధ్య కాదు. కుటుంబాలు, వ్యక్తుల మధ్య జరుగుతోంది. మంత్రి, డిప్యూటీ సీఎం, ఏకంగా సీఎం, రాష్ట్రపతిని అందించిన డోన్ నియోజకవర్గంలో ఎన్నికలను ఓ మహిళా మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు. అని.భావిస్తున్నారు.


వారసత్వంగా.. బుగ్గన

నియోజకవర్గాల ఏర్పాటులో 1950లో కొత్తగా ఏర్పడిన తర్వాత 1952లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కొట్రక వెంకటశెట్టి గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో బేతంచర్లకు చెందిన బీపీ. శేషారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన అందించిన సేవల ఆనవాళ్లు ఇప్పటికీ చెదరకుండా ఉన్నాయి. సొంత డబ్బులతో ఉచితంగా ఆసుపత్రి, పాఠశాల భవనాలను నిర్మించారు. అందుకే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా శేషారెడ్డిని రావు బహదూర్ పేరుతో సత్కరించింది. ఇక్కడ ఈయన చరిత్ర చెప్పడానికి ప్రధాన కారణం... వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా హ్యాట్రిక్ సాధించాలని పోరాటం సాగిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వయానా శేషారెడ్డి మనవడే.

గత చరిత్ర ఘనం

1962లో నీలం సంజీవరెడ్డి, 1967లో కేవీకే మూర్తి స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించారు. 1972లో శేషన్న కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1978 నుంచి 1989 వరకు కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి, 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కేఈ ప్రభాకర్.. టిడిపి నుంచి, 2004లో కోట్ల సుజాతమ్మ, 2009లో కేఈ కృష్ణమూర్తి విజయాలు సాధిస్తూ వచ్చారు. వైయస్సార్సీపి ఆవిర్భావంతో 2014 ఎన్నికల నుంచి కోట్ల, కేఈ కుటుంబాలకు బ్రేక్ పడింది. గత రెండే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయం సాధించారు.

డోన్ నియోజకవర్గంలో కోట్ల, కేఈ వర్గాలు మాత్రమే ఉండేవి. వైయస్ఆర్సీపీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగయింది. దీంతో ఆ వర్గం మొత్తం బుగ్గన రాజేంద్రనాథరెడ్డిని ఆశ్రయించింది. 15 ఏళ్ల తర్వాత కోట్ల తిరిగి రావడంతో రాజకీయం మారిపోయింది. కేఈ వర్గంపై టిడిపి ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీసీ ఓటర్లే కీలకం

డోన్ నియోజకవర్గంలో 2,19,678 ఓటర్లు ఉన్నారు. వారిలో నియోజకవర్గంలో ముస్లింలు, కాపులు, వైశ్యులు, వాల్మీకి, కురుబ, బెస్త, దళిత సామాజిక వర్గాల తర్వాత రెడ్డి సామాజిక వర్గం వారు ఉంటారు. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు దాదాపు 60 శాతం పైగానే ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ, వారి వెంట కదులుతున్న కేఈ సోదరులు వారి కుటుంబం బీసీ సామాజిక వర్గానికి చెందింది. వారికి కూడా బీసీ సామాజిక వర్గాలపై మంచి పట్టు ఉంది. దీంతో కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ సీటుగా మారింది.


కేఈ కుటుంబం ఎంట్రీ

డోన్ నియోజకవర్గం నుంచి 1962లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా డోన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.. ప్రజలకు స్వచ్ఛంద సేవ అందించడంలోనే కాకుండా, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ప్రతినిధిని అందించిన డోన్ నియోజకవర్గం ప్రత్యేక సంతరించుకుంది. డోన్ నియోజకవర్గంలోకి కేఈ కుటుంబం 1978లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వారికి డోన్ నియోజకవర్గంతో 2019 వరకు అవినాభావ సంబంధం ఏర్పడింది. కేఈ ప్రభాకర్ తండ్రి కేఈ కృష్ణమూర్తి.. డోన్ నుంచి 1978, 1983 పోటీ చేసి విజయం సాధించారు.

కేఈ కృష్ణమూర్తి ఐదుసార్లు, కేఈ ప్రభాకర్ రెండుసార్లు, కేఈ ప్రతాప్ రెండుసార్లు డోన్ నుంచి పోటీ చేశారు. ఈ కుటుంబంతో సామీప్య, అవినాభావ సంబంధం ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కోడలు కోట్ల సుజాత, సోదరుని కుమారుడు కోట్ల హరి చక్రపాణి రెడ్డి డోన్ నుంచి పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు.

హ్యాట్రిక్ కొట్టాలని ఆశలు

తాత వారసత్వంగా బేతంచెర్ల పంచాయతీకి రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేస్తుండగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వైయస్సార్సీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. దశాబ్దాలుగా డోన్‌లో పాతుకుపోయిన కేఈ కుటుంబాన్ని ఎదుర్కోవడానికి బుగ్గన సరితూగగలరని భావించిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అంచనాలు తప్పు కాలేదు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఆర్థిక మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అక్కడ మరోసారి గెలిచి హ్యాట్రిక్ చేయాలని కసరత్తులు చేస్తున్నారు.

ఏకమైన కుటుంబాలు..

డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల, డోన్, ప్యాపిలి మండలాల్లో అభివృద్ధికి బుగ్గన రాజేంద్ర రామారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధితులు తీసుకునేందుకు మొదటకే ఈ సోదరులు వెనకడుగు వేశారు. ఈ పరిస్థితుల్లో టిడిపి ఇన్చార్జిగా సుబ్బారెడ్డిని ఆ పార్టీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకువచ్చారు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వాస్తవంగా కోట్ల కుటుంబానికి నిజాయితీ అనే మంచి పేరు ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాతల కాలం నుంచి సేవా భావం ఉంది. ఇక్కడ పై చేయి సాధించడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుచూపుతో వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ఎలాగంటే బుగ్గలను ఢీ కొట్టాలంటే బలంగా కొట్లాడాలి. కేఈ సోదరులను, వారి కుటుంబాలను ఏకం చేయడంతో పాటు ధర్మవరం సుబ్బారెడ్డిని కూడా వారితో మమేకం చేశారు. వారందరిని చంద్రబాబు నాయుడు కదనరంగంలోకి దించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొట్టడానికి కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు సుబ్బారెడ్డి కూడా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే సుజాత కూతురు నివేదిత, కొడుకు రాఘవేంద్ర రెడ్డి ప్రతి గడపకు వెళ్తున్నారు. వీరికి కూడా ఏమాత్రం తగ్గని రీతిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కుటుంబం కూడా పల్లెలను చుట్టు చుడుతున్నారు. ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది.


కోట్ల రీఎంట్రీతో మారిన సీన్

నిరాడంబరంగా కనిపించే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే ఈ ఎన్నికల్లో తనకు విజయం అందిస్తుందని భావిస్తున్నారు. అయితే, నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాలు ఏకమయ్యాయి. వీరికి ధర్మవరం సుబ్బారెడ్డి కూడా కలిసొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 2004 లో కేఈ ప్రభాకర్( 53,373) పై కోట్ల సుజాతమ్మ (55,982) ఓట్లతో గెలుపొందారు. 2009లో కేఈ కృష్ణమూర్తి (69,769) చేతిలో కోట్ల సుజాతమ్మ (55,618) ఓట్లతో ఓటమి చెందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో కోట్ల సుజాతమ్మ చేసిన అభివృద్ధి ఇప్పుడు చర్చకు వచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోయింది. అంతకుముందు కోట్ల కుటుంబం వెంట నడిచిన కాంగ్రెస్ కీలక నాయకులు, శ్రేణులు గత్యంతరం లేని స్థితిలో వైఎస్ఆర్సిపి వైపు వెళ్లారు. గత 20 రోజులుగా వారందరినీ తమ శిబిరంలోకి రప్పించడంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సఫలమైనట్లు అక్కడి వాతావరణం కనిపిస్తోంది. ఆమె భర్త కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. డోన్ అభ్యర్థిగా రావడం వల్లనే ఈ నియోజకవర్గాన్ని వారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు గతంలో తమ అభిమానులు విధేయులుగా ఉన్న వారిని శ్రేణులను సమీకరించడంలో సఫలమైనట్లు చెబుతున్నారు.

అందరితో అత్యంత సామాన్యురాలిగా కలిసిపోయే కోట్ల సుజాతమ్మ మళ్లీ అదే పద్ధతిలో అందరిని తమ కుటుంబం వైపు మరలిచ్చుకున్నారని, ఇది టిడిపి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని ఆదరించిన డోన్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమి అభ్యర్థిగా 80 వచ్చిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మధ్య పోరాటం ఉద్ధృతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


నా ప్రాధాన్యతలు ఇవి

‘‘డోన్ నియోజకవర్గంలో సేద్యం, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలన్న నా కలను సాకారం చేస్తా" అని కూటమి నుంచి పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెబుతున్నారు. "హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు పారించడానికి గోరకల్లు ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించడానికి శ్రద్ధ తీసుకుంటా "అని చెబుతున్నారు. తన సతీమణి కోట్ల సుజాతమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిలో 10 శాతం కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేయలేకపోయారని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై కనిపిస్తుందని ఆయన వ్యంగ్యంగా అంటున్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే కర్నూల్- నంద్యాల మధ్య చేసిన అభివృద్ధి పనుల వల్ల ప్యాసింజర్ రైలు నడపడానికి మార్గం ఏర్పడిందని ఆయన గుర్తు చేస్తున్నారు. డోన్ రైల్వే జంక్షన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా బెంగళూరు డోన్ మధ్య కనెక్టివిటీ పెంచడానికి ఐటీ రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని కూడా తన భవిష్యత్ కార్యాచరణను ఆయన వెల్లడించారు.

ప్రజలు సంతోషంగా ఉన్నారు

నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి, వైఎస్ఆర్సిపి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశా. ఎంఎస్ఎంఈ కేంద్రంతో పాటు యూనివర్సిటీ ఆధ్వర్యంలో వెటర్నరీ పాలిటెక్ కూడా ఏర్పాటు చేయించా. దశాబ్దాల కాల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి వెలుగులను నియోజకవర్గంలో పంచా అని బుగ్గన చెబుతున్నారు. అందులో.. ఐటిఐ, సెంట్రల్ స్కూల్, పార్కుకు, స్విమ్మింగ్ పూల్, మార్కెట్ యార్డ్ అభివృద్ధితోపాటు ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

‘‘నేనంటే నేను అభివృద్ధి చేశా’’ అని హ్యాట్రిక్ కోసం శ్రమిస్తున్న మంత్రి బుగ్గన, మా హయాంలోనే జరిగింది అని టిడిపి అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చెబుతున్న మాటలను జనం ఎంత మేరకు ఎవరిని విశ్వసిస్తారు. తమ కుటుంబ పాత అనుచరులను సమీకరించడంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సఫలమైందని భావిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేది తెలియాలంటే పోలింగ్ వరకు ఆగాల్సిందే.


Tags:    

Similar News