మూసీ బాధితులకు బంపరాఫర్

బాధితుల విషయంలో మరింత ఉదారంగా ఉంటే అందరు స్వచ్చంధంగా తమ ఇళ్ళను ఖాళీ చేసేస్తారని అనుకున్నారని తెలిసింది.

Update: 2024-10-23 07:30 GMT

మూసీనది నిర్వాసితులకు అండగా నిలవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మూసీనది(Musi River) పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం నదికి రెండువైపులా ఉంటున్న నిర్మాణాలను, ఆక్రమణలను క్లియర్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మూసీనదికి రెండువైపులా ఉంటున్న బాధితులు(Musi Victims) తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడి బాధితులు అంగీకరించకపోయినా కొందరిని యంత్రాంగం ఖాళీ చేయించి వాళ్ళ(Houses Demolition) ఇళ్ళను కూల్చేసింది. అన్నీ ఇళ్ళకు ఆర్ బి అని ఎర్రటి ఇంకుతో మార్క్ చేసిన అధికారులు సుమారు 200 ఇళ్ళని కూల్చేశారు. దాంతో బాధితులు పెరిగిపోవటంతో ప్రతిపక్షాలు సహజంగానే సీనులోకి ఎంటరైపోయాయి. తాము అండగా ఉంటామని చెబుతు బాధితులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయి. బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు(Double bed room houses), తక్షణ ఖర్చులకు రు. 25 వేలు, స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు తలా రు. 2 లక్షలు ఇస్తున్నా బాధితుల గోల తగ్గటంలేదు.

అందుకనే బాధితుల గోల, ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చ, అందిస్తున్న సాయంపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు సమాచారం. మూసీ ప్రాజెక్టు గనుక మొదలైతే రేవంత్ ఇమేజి ఓ రేంజికి పెరిగిపోవటం ఖాయం. అందుకనే బాధితుల విషయంలో మరింత ఉదారంగా ఉంటే అందరు స్వచ్చంధంగా తమ ఇళ్ళను ఖాళీ చేసేస్తారని అనుకున్నారని తెలిసింది. అందుకనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, 25 వేల రూపాయలు, రు. 2 లక్షలు ఇవ్వటంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)కు దగ్గరలో బాధితులకు తలా 150 గజాల ఇంటిస్ధలం ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఈనెల 26వ తేదీన జరగబోయే క్యాబినెట్(Telangana Cabinet) సమావేశంలో బాధితులకు తలా 150 గజాల ఇంటిస్ధలం కేటాయింపుపై చర్చించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో 150 గజాల స్ధలం అంటే సుమారు రు. 30 లక్షల విలువ చేస్తుందని సమాచారం.

మూసీనది గర్భంలో ఇళ్ళు 1697తో పాటు రెండువైపులా సుమారు 13 వేల ఇళ్ళు తొలగించాల్సుంటుంది. ఇళ్ళ యజమానులందరికీ ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో 150 గజాల స్ధలం కేటాయించాలంటే సుమారు 700 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే బాధితులకు 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇళ్ళు ఖాళీ చేస్తున్న వాళ్ళ తక్షణ ఖర్చులకు రు. 25 వేలు ఇస్తోంది. అలాగే మహిళాసంఘాల్లోని సభ్యులు(Women Self help Groups) వ్యాపారం చేసుకునేందుకు తలా రు. 2 లక్షలు పంపిణీ చేస్తోంది. వీటన్నింటికీ అదనంగా ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో 150 గజాల స్ధలం ఇవ్వాలని క్యాబినెట్ డిసైడ్ అయితే బాధితులకు బంపరాఫర్ అనే చెప్పాలి.

బాధితులకు క్యాబినెట్ బంపరాఫర్(Bumper Offer) ఇస్తే ప్రతిపక్షాలకు షాక్ తగిలినట్లే. ఎందుకంటే తమ ఇళ్ళను ఖాళీచేస్తున్నపుడు ప్రభుత్వం తమకు ఇంతమంచి ప్యాకేజీ ఇస్తున్నపుడు బాధితులు ఇక ప్రతిపక్షాలు బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మాట ఎందుకు వింటారు ? తీసుకునే నిర్ణయం ఏదో తొందరగా తీసుకుని అమల్లోకి తీసుకొస్తే మూసీనది రివర్ ఫ్రంట్(Musi River Front) అంశంపై మాట్లాడేందుకు, ఆరోపణలు చేయటానికి ప్రతిపక్షాలకు ఏమీ ఉండదు. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బాధితులను ఆకట్టుకునేందుకు ప్రతిపక్షాలు మూసీ ప్రాజెక్టును టేకప్ చేశాయని మంత్రులు చేస్తున్న ఆరోపణలు తెలిసిందే. బాధితులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని రేవంత్, మంత్రులు ఎదురుదాడులు చేస్తున్నారు. ఈ గోలంతటికీ ఫులుస్టాప్ పెట్టాలంటే ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో తలా 150 గజాల స్ధలం కేటాయిస్తు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని ఉన్నతస్ధాయి వర్గాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి 26వ తేదీ క్యాబినెట్ సమావేశంలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News