Breaking | కుప్పం: మహిళా పోలీస్ సజీవ దహనయత్నం
ప్రేమ మోజులో మోసపోయిన కడప మహిళ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-24 18:19 GMT
పెళ్లి చేసుకోవడానికి ప్రేమికుడు నిరాకరించాడు. ఆ వేదన భరించలేక ప్రియుడు ఇంటి ముందే కడప జిల్లా మహిళా కానిస్టేబుల్ సజీవ దహనానికి ప్రయత్నించింది. సగం కాలిన దేహంతో బాధితురాలు కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే,
కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన వాసు ఫైనాన్స్ వ్యాపారం పనిచేసేవాడు. దీంతో అతను కడప జిల్లా పొద్దుటూరు, కడప పట్టణానికి రాకపోకలు సాగించేవాడు. ఈ ప్రయాణంలో కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వారి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,
తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళా కానిస్టేబుల్ చేసిన ప్రతిపాదనకు మార్వాడ గ్రామానికి చెందిన వాసు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ మహిళా కానిస్టేబుల్ ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని, ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిసింది. మంటల్లో చిక్కుకుని గాయపడిన ఆమెను కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అందింది.
కుప్పం మండలం మార్వాడ గ్రామంలో జరిగిన ఈ సంఘటన నిమిషాల వ్యవధిలోనే మీడియాలో వైరల్ అయింది.
మా కానిస్టేబులే..
ఈ ఘటనపై 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి ప్రొద్దుటూరులోని ఏపీఎస్ఆర్టీసీ డిపో కంట్రోలర్ తో మాట్లాడారు. సమాచారం తెలుసుకున్న ఆ డిపో లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బివియన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
"ప్రొద్దుటూరు ఆర్టిసి డిపోలో ప్రశాంతి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు" అని ధృవీకరించారు.
కడప పట్టణం శివారులోని రాయచోటి మార్గంలో ఉన్న ఊటుకూరు ప్రాంతానికి చెందిన మహిళ ప్రొద్దుటూరు ఆర్టిసీ డిపోలో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
"కుప్పంలో జరిగిన సంఘటన పై సమాచారం అందింది. ప్రస్తుతం ఆమె కుప్పం పి ఇ ఎస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు" అని ప్రొద్దుటూరు డిపో కే చెందిన కానిస్టేబుల్ బివియన్ రెడ్డి స్పష్టం చేశారు.
కుప్పం సీఐతో మాట్టాడేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
ప్రశాంతిని ప్రేమాయణం లోకి దించిన కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన వాసుకు వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.