ఎపిలో బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్

బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుంది. ఇందుకు పార్వతీపురం మన్యం జిల్లాను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది.;

Update: 2025-02-15 07:00 GMT

మనిషి అందం పై పెడుతున్న శ్రద్ధ మెదడు ఆరోగ్యంపై పెట్టడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటే ఆలోచనా శక్తి పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ఏదైనా సాధించే వీలు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఎంతో మంది మానశిక వేదనతో బాధపడుతున్నారు. ఇందుకు మెదడు ఆరోగ్యంగా లేకపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దేశ వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం ను ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇందులో ఏపీ కూడా ఉండటం చెప్పుకోదగిన విశేషం.

పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక

బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక అయింది. ఈ మేరకు నీతి ఆయోగ్ నేతృత్వంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ గీతాంజలి గుప్తా, సంచాలకులు ప్రొఫెసర్ రాజేందర్ కె దమిజ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయం విజయనగరం జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 9 మిలియన్ల మంది న్యూరోలాజికల్ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. ఈ క్రమంలో మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జిల్లాలో న్యూరోలాజికల్ సమస్యల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభించనున్న ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లో పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక కావడం గర్వకారణంగా చెప్పొచ్చు.

జిల్లా ఆస్పత్రి వద్ద బ్రెయిన్ హెల్త్ క్లినిక్

భారతదేశంలో బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్, నీతి ఆయోగ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం కింద, వైద్యులకు మానసిక ఆరోగ్య రోగులను గుర్తించడం, చికిత్స చేయడంపై శిక్షణ ఇస్తారు. మెదడు ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన, మానసిక ఆరోగ్య సేవలకు అందుబాటులోకి తెచ్చి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం, మానసిక ఆరోగ్య సంరక్షణలో నాణ్యతను పెంచడానికి చర్యలు తీసుకుంటారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ను జిల్లా ఆస్పత్రి వద్ద బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ అనేది మెదడు ఆరోగ్యం పనితీరును మెరుగు పరచడానికి అంకితమైన ఒక ప్రపంచ సంస్థ. గ్లోబల్ కౌన్సిల్ ఆన్ బ్రెయిన్ హెల్త్ అనేది మెదడు ఆరోగ్యంపై పరిశోధన, విద్యను ప్రోత్సహించే ఒక సంస్థ. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెదడు ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Tags:    

Similar News