కడపపై కాంగ్రెస్, కమలం ఫోకస్..

కడప జిల్లాపై కాంగ్రెస్, చిత్తూరు జిల్లాపై బిజెపి కూటమి ఫోకస్ పెట్టింది. ఢిల్లీ పెద్దలను ఈ రెండు జిల్లాల్లో పర్యటనకు తీసుకురానున్నారు.

Update: 2024-04-29 15:47 GMT

(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. అధికార వైఎస్ఆర్సీపీని నిలువరించే లక్ష్యంగా ప్రతిపక్ష కూటమి కార్యాచరణ సిద్ధం చేసింది. అది కూడా సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాపై ఫోకస్ పెట్టింది. చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థిని కట్టడి చేయడానికి బిజెపి కూడా ఢిల్లీ నుంచి కూడా అగ్రనేతలను ప్రచార రంగంలోకి తీసుకురానున్నారు.

ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం) ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పర్యటన ఉన్నారు. ఆయన కార్యక్రమం ఖరారు అయిన తర్వాత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు సమాచారం అందింది.

"పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలరెడ్డితో కలిసి వారు ప్రచార సభలో పాల్గొంటారు" అని రాయచోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అల్లాబక్షు.. ఫెడరల్ ప్రతినిధికి తెలిపారు. "ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని అనుసరించి తమ పార్టీ అగర నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అవుతుంది" అని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.

అధికార పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పోరాటం

రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్సిపి ఒంటరిగా పోటీ చేస్తోంది. కుటుంబ కలహాలు, రాజకీయంగా విభేదించిన ఆయన సోదరి వైఎస్. షర్మిలరెడ్డి పిసిసి అధ్యక్షురాలుగా కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడంతో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో కడప అసెంబ్లీ స్థానం తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా రాయచోటి అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ అల్లాబక్షును పోటీ చేయిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం అనడం కంటే, కేంద్రంలో బిజెపి తీసుకురానున్న చట్టాల వల్ల ముస్లింలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిస్తే జరిగే ప్రయోజనాలను ముస్లిం మైనార్టీ వర్గాలకు వివరించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని రప్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మే నాలుగు లేదా ఆరో తేదీల్లో ఆయన పర్యటన ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

బిజెపికి ప్రతిష్టాత్మకం

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానాన్ని రాష్ట్రంలో కూటమితో పాటు, బిజెపి కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని పార్లమెంట్ సెగ్మెంట్‌లో ప్రచారానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానం కేంద్రమైన రాజంపేటలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సిపిని ఢీకొనడానికి బిజెపి- జనసేన - టిడిపి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి బద్ధశత్రువుగా మారిన మాజీ సీఎం, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనకు రాజకీయంగా చిరకాల ప్రత్యర్థి అయిన చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నుంచి 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. ఇద్దరు ప్రధాన రాజకీయ విరోధులతో పోటీపడుతున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం ఇటీవల అధికార వైఎస్ఆర్సిపి నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొన్నారు. పీలేరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రచార వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. దీనిని నల్లారి కుటుంబం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలికిరిలో ప్రచారసభ నిర్వహించడానికి అవసరమైన సన్నాహాల్లో ఉన్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి.

మళ్లీ.. బాబు రాక

కడప జిల్లాపై కాంగ్రెస్‌తో పాటు టిడిపి కూటమి కూడా ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు మే 2వ తేదీ మళ్లీ కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం రాజంపేటకు రానున్నారు. ఇటీవల కొన్ని రోజుల కిందటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచారం చేసి వెళ్లారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో పర్యటనకు ప్రాధాన్యతిస్తున్నారు. మే మూడో తేదీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రానున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీ అగ్ర నేతలను రంగం లోకి దించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్, టిడిపి కూటమి కసరత్తు చేస్తోంది. వీరి పర్యటనలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయి అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News