సేవతో భువనేశ్వరి సంచలనాలు
రాజకీయాల్లో నారా భువనేశ్వరి సంచలనాలు ఎన్నో ఉన్నాయి. భర్త చంద్రబాబునాయుడు ను గత ప్రభుత్వం జైలుకు పంపడంతో రాజకీయాల్లో అడుగు పెట్టారు భువనేశ్వరి.;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా భువనేశ్వరి ఏది చేసినా సంచలనమే. తన భర్త ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నాటి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే నినాదంతో ఆమె ఆంధ్రప్రదేశ్ లో సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు. అప్పట్లో అమరావతిలోనూ ఊరూరా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తన భర్త ఎలాంటివాడో, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను రాజకీయ వేదికల మీద ఎందుకు కనిపించలేదో వివరించారు. ప్రజల సానుభూతిని పొందటంలో విజయం సాధించారు. ఆ విజయ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది.
కుప్పం పై ప్రత్యేక దృష్టి
కుప్పంలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేసింది. అయినా ఎన్నికల్లో 2014లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువే సాధించి చంద్రబాబు నాయుడు తన పట్టును సాధించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. తిరిగి ఇటీవల కొన్ని పోస్టులు ఖాళీ కావడంతో ఆ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగుర వేసింది. ఎన్నికలు పూర్తయిన తరువాత కుప్పం ప్రజలకు దగ్గరయ్యేందుకు పలు కార్యక్రమాలు చంద్రబాబు చేపట్టారు. పలు చోట్ల రోడ్లు నిర్మించారు.
భువనేశ్వరిని ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గంలో తిరిగి సేవా కార్యక్రమాలు చేసేందుకు చంద్రబాబు ప్రోత్సహించారు. ఇందుకు ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ ను భువనేశ్వరి ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గడచిన ఏడు నెలల్లో దాదాపు ప్రతి గ్రాంలోనూ కొన్ని కుటుంబాలకు కట్టు మిషన్ లు, రుణాలు, బ్యాంక్ లింకేజీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. నియోజకవర్గ బాధ్యతలు చూస్తే ఏ సమస్య వచ్చినా సీఎంతో మాట్లాడి పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో భువనేశ్వరి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకాంత్ హాజరవుతున్నారు. ఆమెకు ఒక విధంగా పీఎస్ మాదిరి పనిచేస్తున్నారు.
కుప్పంలో సంక్రాంతి సంబరాలు
సీఎం చంద్రబాబు కుటుంబమంతా కుప్పం వెళ్లి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కుమారుడు లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, భార్య భువనేశ్వరి, మనుమడు వేవాన్ష్ తో కలిసి వెళ్లి అక్కడే ఉన్నారు. దేవాన్స్ చిన్న పిల్లలతో కలిసి ఆటలు ఆడారు. కొడుకు, కోడలు కలిసి తాడు లాగుడు, ఇంకా పలు గ్రామీణ క్రీడల్లో పాల్గొని అందరినీ ఆనందింప జేశారు. కుప్పం, చంద్రగిరి, నారావారిపల్లె ల్లో సందడి నెలకొంది. ఈ ఖర్చు చంద్రబాబు కుటుంబం భరించింది. అధికారికంగా ఇటువంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరైతే ప్రభుత్వం భరించ వచ్చు. కుప్పంలో సంక్రాంతి సందర్భంగా ఉన్నందున కొందరు అధికారులు అక్కడి రాగా వారితో ప్రత్యేకించి సమావేశం కూడా సీఎం నిర్వహించారు. ఈ సంబరాల్లో భువనేశ్వరి అగ్ర భాగాన ఉన్నారు. మహిళలతో కలిసి ఆమె ఎన్నో ఆటల్లో పాల్గొన్నారు. సాయంత్రం వేళల్లో జరిగిన సాంకృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. భువనేశ్వరి ఇచ్చే ఏ సందేశం అయినా తన కుటుంబం గురించి చెప్పడంతో పాటు జీవన విధానం ఎలా ఉండాలో, వ్యాపారాల్లో ఎలా సక్సెస్ అవ్వాలో చెబుతుంటారు.
సరదా కార్యక్రమాల్లోనూ ఉల్లాసంగా...
ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో కలిసి భువనేశ్వరి సరదాగా గడిపారు. ఆ కార్యక్రమంలో ఆమె అక్క పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. అక్క, చెల్లెలు కలిసి బాలకృష్ణను సరదాగా ఆట పట్టించారు. మీకు మ్యాన్సన్ హౌస్ కు ఏమిటి సంబంధం ఎక్కడికి వెళ్లినా కూడా సంకలో పెట్టకుని వెళుతుంటారు. అంటే నాన్నగారు అప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టించారు కదా. అదే ఆ ఏరియాలో ఫస్ట్ ఇల్లు. దానిని వైట్ హౌస్ అంటారు. అదో మాన్సన్. నాకు అన్నీ జీవితంలో యాదృచ్ఛికంగా జరిగినవి. ఇది కూడా అంతే. స్పెషల్ ఏమీ లేదు. అది నన్ను ప్రేమించేసింది. ఇంతకూ మాన్సన్ హౌస్ అంటే ఇష్టమా, వసుంధర అంటే ఇష్టమా అంటూ భువనేశ్వరి ప్రశ్నించారు. తప్పించుకునేందుకు వీలు లేదని, సమాధానం చెప్పాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో తప్పించుకోలేక బాలకృష్ణ సరదాగానే సమాధానాలు చెప్పారు.
మా నాన్న నేర్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయని, ఇష్టమైన వాటిల్లో ఒకదానిని వదిలి, మరోదానిని చెప్పటం మంచిది కాదని అంటూ మాన్సన్ హౌస్, వసూ ఇద్దరూ రెండు కళ్లు అంటూ సమాధానం చెప్పి అందరినీ నవ్వించారు. చాలా మంది సంసారుల్లో సన్యాసులు ఉన్నారు. నువ్వు ప్రతి రోజూ రెండు నుంచి మూడు గంటల పాటు పూజ చేస్తావు. ఎవరి నుంచి తప్పించుకోవడానికి నీవు సంసార సన్యాసం పుచ్చుకుంటున్నావు అంటూ పురందేశ్వరి చమత్కరించారు. వన్మోర్ క్వశ్చన్ అంటూ భువనేశ్వరి మొదలు పెట్టారు. ఒకటే కదా అని బాలకృష్ణ అంటే ఇంకా ఉన్నాయి. అందులో ఒక ప్రశ్న అంటూ మళ్లీ మొదలు పెట్టారు.
మీకు సినిమాల్లో ఇష్టమైన నటులు ఎవరని ప్రశ్నించారు. ఫస్ట్ విజయశాంతి, రెండో వారు రమ్యకృష్ణ, మూడో వారు సిమ్రాన్ అంటూ బాలకృష్ణ సమాధానమిచ్చారు. మీరందరూ బాలకృష్ణ నా తమ్ముడు అని అనుకుంటారు, కాదు నాకంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు. అందరు వచ్చి మీ తమ్ముడు ఎట్లున్నారు అని అడుగుతుంటారు. ఐ డోంట్ లైకిట్. నాకు నచ్చిన సినిమాలు నరసింహనాయుడు, సమర సింహారెడ్డి, అఖండ (ఐ లైక్ అఖండ) అని అందరినీ నవ్వించారు. ఎన్‌బీకే ను హాహాలో చూసి చప్పట్లు కొడతారు. మాకు కొట్టరా అంటూ చమత్కరించటంలో అందరూ చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అన్ని రంగాల్లోనూ భువనేశ్వరికి ప్రవేశం ఉందని చెప్పేందుకు మాత్రమే.
చంద్రబాబుపైనా చమత్కారాలు
తలసీమియా రోగుల కోసం విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ ను భువనేశ్వరి నిర్వహించారు. సంగీత దర్శకులు థమన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక ప్రత్యేక పౌరుడిగా టిక్కెట్ కొని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని భువనేశ్వరి చమత్కరించడంతో కార్యక్రమంలో చప్పట్లు మోగాయి. ఎన్టీఆర్ లాగే భువనేశ్వరి కూడా మొండిఘటం, వ్యాపారం అయినా, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు అయినా అలాగే నిర్వహిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
హెరిటేజ్ ను ఒక ట్రాక్ లో పెట్టిన ఘనత భువనేశ్వరిదే...
నేను గృహిణిగానే చంద్రబాబు ఇంటికొచ్చి జీవితం ప్రారంభించాను. నా చేతుల్లో హెరిటేజ్ వ్యాపారం పెట్టారు. ఇది నా చేతకాదేమో అన్నాను. నువ్వు చెయ్యగలవు. ఆ నమ్మకం కాకుందని చంద్రబాబు అన్నారు. అలాగే హెరిటేజ్ ను ఒక దారిలో పెట్టి ఎంతో మందికి ఉపాధికల్పిస్తున్నామని చాలా సందర్భాల్లో చెప్పారు.
రాజకీయాల గురించి చక్కగా మాట్లాడుతున్నారు..
రాష్ట్ర రాజకీయాల గురించి చక్కగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎక్కడా కాంట్రవర్సీ జోలికి పోరు. తన గురించి, భర్త గురించి, అన్న బాలయ్య బాబు గురించి చాలా చోట్ల ప్రస్తావిస్తుంటారు. తాను స్వతహాగా నిర్వహించే కార్యక్రమాల్లో తాను చెప్పినట్లే జరగాలని కోరుకుంటారు. ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా కోరుకుంటారు. తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించిన మ్యూజికల్ నైట్ లో ఎటువంటి చిన్న సంఘటనకు కూడా తావివ్వకుండా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందారు. అమరావతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తలసీమియా వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.