విచారణకు వెళ్లాను, వచ్చాను, ఏం చెప్పాలో అదే చెప్పానన్న భూమన

1500 ఏళ్లుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వారు ఎంతమంది? అని అడిగితే ఏమి సమాధానం చెప్పగలనో- పరకామణి కేసులో అంతే సమాధానం చెప్పాను అని ఎద్దేవా చేశారు భూమన

Update: 2025-11-26 03:14 GMT
పరకామణి చోరీ కేసులో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి నిన్న సాయంత్రం సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణకు ముందు, బయటికి వచ్చాక మీడియా ముందు మాట్లాడారు. నాలుగు పిచ్చి శునకాల ఒత్తిడి భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను పిలిచారు. అయిననూ... పోయిరావలె హస్తినకు అంటూ లోపలికి వెళ్లారు. తిరిగి బయటికి వచ్చాక మళ్లీ మీడియాతో మాట్లాడుతూ... పసిఫిక్‌ మహా సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? నైలు నదిలో మొసళ్ల సంఖ్య ఎంత? 1500 ఏళ్లుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వారు ఎంతమంది? నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని? అని అడిగితే ఏమి సమాధానం చెప్పగలనో... పరకామణి కేసులో అంతే సమాధానం చెప్పాను అని వెటకారంగా చెప్పారు.
పరకామణి చోరీ కేసులో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహంలో సీఐడీ డీజీ ఎదుట భూమన విచారణకు హాజరయ్యారు. మాజీ ఏవీఎస్వో సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగానే మీరు ఆత్మహత్య అని ఎలా చెప్పారు? అని భూమనను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. నగదు చోరీకి సంబంధించిన కేసు రాజీ చేస్తుంటే టీటీడీ ఛైర్మన్‌గా ఏం చేస్తున్నారు? నిందితుడి ఆస్తులు టీటీడీకి రాయించుకోవాలని టేబుల్‌ అజెండాలో ఎవరు పెట్టారు? ఎస్టేట్‌ కమిటీలో సభ్యుడిగా అత్యవసర తీర్మానం చేసిందెవరు? రాజీ ప్రతిపాదన ఎవరు తెచ్చారు? వంటి ప్రశ్నలు వేసినట్టు సమాచారం.
సతీశ్‌ కుమార్‌ది ముమ్మాటికి ఆత్మహత్యేనని, ప్రభుత్వ ఒత్తిడితోనే చనిపోయాడన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని భూమన చెప్పినట్టు తెలిసింది. ఇదే కేసులో టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌ కుమార్‌, ఎస్టేట్‌ కమిటీ సభ్యుడు జీవన్‌ రెడ్డిని కూడా సీఐడీ బృందం మంగళవారం విచారించింది.
Tags:    

Similar News