తిరుపతి నుంచి భూమనను తరిమికొట్టాలంటున్న టీటీడీ చైర్మన్
మా ప్రశ్నలకు సమాధానం చెబుతావా? టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఫైర్.;
By : SSV Bhaskar Rao
Update: 2025-08-26 14:36 GMT
తప్పుడు ప్రచారంతో ప్రజల మనసులు కలుషితం చేస్తున్నారు. టీటీడీపై బురదజల్లుతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని తిరుపతి నుంచి తరిమికొట్టాలని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఫైర్ అయ్యారు.
తిరుపతిలోని పద్మావతీ అతిథిగృహంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మంతాజ్ హోటల్ వ్యవహారం వైసీపీ, టీడీపీ మధ్య అగ్గిరాజేసింది. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మాట్లాడుతూ,
"భూమన కరుణాకరరెడ్డి, వైసీపీ నేతలు తప్పు అంగీకరించాలి. ముక్కు నేలకు రాయడం ద్వారా పాపాలు ప్రక్షాళన చేసుకోండి" అని బీఆర్. నాయుడు సలహా ఇచ్చారు.
మీడియాతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, దివాకరరెడ్డి, జీ.భానుప్రకాష్ రెడ్డి
తిరుమలకు దిగువన ఉన్న అటవీ ప్రాంతం ఏడుకొండలల్లో అంతర్భాగమే అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. సాధువులు, హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో ముంతాజ్ హోటల్ కు కేటాయించిన 20 ఎకరాల స్థలం లీజును రద్దు చేసినట్లు ఆయన వివరించారు.
"అలిపిరి రోడ్డుకు ఎడమ పక్క స్థలం కేటాయించడం అనేది ప్రభుత్వం మధ్య జరిగిన నిర్ణయం" అని బీఆర్. నాయుడు గుర్తు చేశారు. ఇదిలావుంటే,
"దేవుడు అంటే విశ్వాసం లేదు. తిరుమలకు రావడం, తలనీలాలు సమర్పించే భక్తి ఏమాతరం లేని వ్యక్తులు" తిరుమల శ్రీవారిని వివాదాల్లోకి లాగడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు ముంతాజ్ హోటల్ యాజమాన్యంతో దాదాపు రెండు గంటల పాటు చర్చించి, ప్రత్యామ్యాయ స్థలం కేటాయించడానికి ఒప్పించారని బీఆర్ నాయుడు వెల్లడించారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వైసీపీ నేతలకు ప్రధానంగా మాజీ సీఎం వైఎస్. గట్టి సవాల్ విసిరారు. తాను లెవనెత్తిన ప్రశ్నకుల సమాధానం చెప్పాలని నిలదీశారు.
1. అలిపిరి మార్గంలో ముంతాజ్ హోటల్ కు వైసీపీ స్థలం ఎలా కేటాయించారు.
2. ఈ కేటాయింపులు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో కాదా?
3.శ్రీవారిపై భక్తి ఉంటే ఏడుకొండల పరిధిలో ఎలా కేటాయించారు?
4. ఈ స్థలం అజయకుమార్ నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారా? లేదా?
"ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సవాల్ చేశారు.
టీటీడీ పాలక మండలి ఏర్పడినప్పటి నుంచి మేము నిస్వార్థంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీవారి నిధులకు కాపలాదారులుగా ఉంటూ, తమ సొంత ఖర్చులతోనే సేవ చేస్తున్నట్లు బీఆర్. నాయుడు చెప్పారు.
ఆ స్థలం అప్పగించలేదు..
దేవలోక్ క్లాంప్లెక్స్ ప్రాంతంలో (అలిపిరి నుంచి ఎస్వీ జూకు వెళ్లే మార్గం) ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన అనుమతిని సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో 2025 మార్చిలో రద్దు చేశామని టీటీడీ చైర్మన్ చెప్పారు. ప్రత్యామ్యాయ స్థలం ఇవ్వాలని పాలక మండలిలో తీర్మానించినా, ఇంకా ఆ సంస్థకు అప్పగించలేదని ఆయన స్పష్టం చేశారు.
పర్యాటక శాఖ ఆధీనంలోని స్థలం 25 ఎకరాలు ముంతాజ్ హోటల్ కు కేటాయించింది వైసీపీ ప్రభుత్వంలోనే అని బీఆర్ నాయుడు గుర్తు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని ఆయన మాజీ చైర్మన్ భూమనను నిలదీశారు.
ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్. నాయుడు ఎద్దేవా చేశారు. కేసులు విచారణ చేసే సమర్థవంతమైన పోలీస్ అధికారులు రాష్ట్రంలో లేరా? అని ఆయన ప్రశ్నించారు. అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు తప్పించుకుని తిరుగుతూ, మళ్లీ సీబీఐ విచారణ కోరే నైతిక అర్హత ఏమాత్రం వారికి లేదన్నారు.
తులభారం కేసు కదుపుతాం..
శ్రీవారి ఆలయంలో తులాభారం కుంభకోణం కేసు మళ్లీ తెరిపిస్తామని టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. రూ. వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని విజిలెన్స్ నివేదికలు స్పష్టంగా చెబుతున్నా, నిందితుడితో లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం అనేది చెల్లదన్నారు. దీనిని హైకోర్టు ద్వారా కేసు మళ్లీ తెరిపించి, వైసీపీ నేతలకు గట్టిగా బుద్ధి చెబుతామని భానుప్రకాశష్ రెడ్డి హెచ్చరించారు.