మాడుగుల నుంచి టీడీపీ అభ్యర్థి ఔట్.. బరిలో బండారు

పంతం నెగ్గించుకున్న బండారు సత్యనారాయణ మూర్తి. ఎట్టకేలకు మాడుగుల సీటును సొంతం చేసుకున్నారు. ఆయన పంతానికి నియోజకవర్గంలోని అసమ్మతి కలిసొచ్చింది.

Update: 2024-04-19 08:13 GMT

(శివరామ్)

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఎట్టకేలకూ మాడుగుల సీటును దక్కించుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని సొంత సీటు అయిన పెందుర్తి పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిపోవడంతో కినుక వహించి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయనకు మాడుగులలో ప్రస్తుత అభ్యర్ది పైలా ప్రసాద రావుపై వ్యక్తమవుతున్న అసమ్మతి కలిసి వచ్చింది. పైలా ప్రసాదరావుకు అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్‌లు సహకరించకపోవడం, పార్టీకి హామీ ఇచ్చిన విధంగా ఆయన ఖర్చు చేయలేకపోవడం వంటి కారణాలతో ఆయనను మార్చాలని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది.

నాలుగు రోజుల క్రితం విశాఖ వచ్చిన చంద్రబాబు నాయుడు.. బండారును సముదాయించినప్పటికీ ఆయన శాంతిచలేదని తెలిసింది. ఉత్తరాంధ్రాలో మాజీ మంత్రులు, సీనియర్లందరికీ టికెట్‌లు దక్కాయని . పార్టీ కోసం పోలీసు కేసులు ఎదుర్కొని అరెస్టు కూడా అయిన తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొప్పుల వెలమలకు కేటాయించే మాడుగుల సీటును అదే సామాజిక వర్గానికి చెందిన బండారుకు కేటాయించడం ద్వారా సమస్యను పరిష్కరించారు.

వైసీపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల సీటును తొలుత ఆయనకు ఇచ్చిన అధిష్టానం ఆ తరువాత ఆయనను అనకాపల్లి ఎంపీగా నిలిపి ఆయన కుమార్తె అనురాధాకు మాడుగులను కేటాయించింది. ముత్యాల నాయుడు బలమైన అభ్యర్ది కావడంతో తొలుత అక్కడకు వెళ్లేందుకు బండారు కూడా సుముఖత చూపలేదు. అయితే, ఇప్పుడు ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ ప్రత్యర్థి కావడంతో ఒప్పుకున్నట్లు తెలిసింది. సీటు ఖారారు కావడంతో గురువారం బండారు.. మాడుగుల వెళ్లి అక్కడి మోడు కొండమ్మ ఆలయంలో పూజలు చేశారు. స్థానిక నేతలను కలిశారు. బండారుకు టికెట్ ఖరారు కావడంతో ఇప్పుడు పైలా ప్రసాద్ ఏం చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

Tags:    

Similar News