ఆ గ్రామంలో దీపావళిపై నిషేధం!

200 ఏళ్లుగా దీపావళిపై బ్యాన్‌..

Update: 2025-10-20 06:03 GMT

దీపావళి రోజు దేశమంతా వెలుగులు విరజిమ్ముతూ అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటారు.  కుటుంబ సభ్యులు, పిల్లా పాపలతో కలిసి ఈ వేడుకను చూడముచ్చటగా అందంగా నిర్వహించుకుంటారు. లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తూ తమ కోరికలు కోరుకుంటారు. ఇంతటి పవిత్రమైన దీపావళిని దేశం మొత్తం జరుపుకుంటే.. ఏపీలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని జరుపుకోరు. ఆ గ్రామంలో దీపాల కాంతులు ఉండవు, టపాసుల శబ్దాలు వినబడవు. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెంలో గత రెండు వందల ఏళ్లుగా దీపావళి పండగను జరుపుకోవ‌డం లేదు. ఎందుకంటే ఈ పండగ జరుపుకోవడం వల్ల తమ గ్రామానికి కీడు సోకుతుందని, ఎదో ఒక అపాయం జరుగుతుందని ఆ గ్రామస్థుల నమ్మకమట. 



పున్ననపాలెం గ్రామ నివాసి అప్ప‌ల నాయుడు ది ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌తో మాట్లాడుతూ "పూర్వం త‌మ గ్రామస్థులు దీపావళి పండగ జరుపుకొని నాగ దేవతను పూజించే వారు. అయితే అప్ప‌ట్లో దీపావళిని చేసుకొని, పుట్టలో పాలు పోసి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఊయలలో ఉన్న చిన్నారి పాము కాటుకు గురై చనిపోయింది. మరో ఏడాది ఇలానే దీపావళి రోజు నాగు పాముకు పుట్టలో పాలు పోసి ఇంటికి వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన పశువులు.. అంటే ఎద్దులు, ఆవులు మృతి చెందాయట. దీంతో అప్పటి నుంచి ఆ గ్రామస్తుల్లో భయం నెలకొంది. దీపావళి నిర్వహించుకుంటే తప్పనిసరిగా తమ గ్రామంలో కీడు జరుగుతుందని నమ్మారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు దీపావళి పండగను జరుపుకోరు" అని చెప్పారు. 

"గ్రామ పెద్దలది మూఢ నమ్మకమని, పండగను జరుపుకుంటే ఎలాంటి హాని జరగదని ఆ గ్రామ యువత, కొత్తగా వచ్చిన కోడళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. విద్యావేత్తలు, యువత, కోడళ్ళు పండగను నిర్వహించుకోవాలని పట్టు బడుతున్నప్పటికీ ఆ గ్రామంలోని పెద్దలు దీనికి ఒప్పుకోవడం లేదట.  పండగను జరుపుకుంటే కచ్చితంగా ఎదో కీడు జరుగుతుందని ఆ గ్రామ పెద్దమనుషులు చెబుతున్నార‌ని" య‌డ్ల పూర్ణ‌య్య ది ఫెడ‌ర‌ల్ ఆంధ్ర‌తో తెలిపారు.

"గ్రామంలో యువత, చదువుకున్న వాళ్ళు దీపావళి పండుగను చేసుకోవాలని పలు మార్లు సమావేశాలు జరిపి తమ వంతు ప్రయత్నం చేశారట. కానీ గ్రామ పెద్దలు తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కాదని మళ్ళీ పండగను జరుపుకోవాలని చూడటం మంచిది కాదని ఏదైనా గ్రామానికి అశుభం జరిగే అవకాశం ఉండవచ్చని చెప్పటంతో భయపడి తిరిగి ఆ నిర్ణయాన్ని మనుకున్నారట. అంతే కాదు పున్నాన నరసింహులు నాయుడు అనే ఉపాధ్యాయుడు గతంలో పండుగ సెలబ్రేట్ చేసుకునే యత్నం చేయగా అతని కుమారుడు అకాల మరణం పొందాడట"  దీంతో గ్రామస్తులు దీపావళి పండుగకు పూర్తిగా దూరంగా ఉంటున్నారని వంశీమోహ‌న్ చెప్పారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే, "పున్నానపాలేం గ్రామంలో పుట్టి పెరిగి బయట ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లిపోతే అక్కడ దీపావళి పండుగను అక్కడి వారి ఆచారం ప్రకారం జరుపుకుంటున్నారు".

అయితే  "బయట ఊరు ఆడపిల్ల పున్నాన పాలెం అబ్బాయిని వివాహం చేసుకునీ ఈ గ్రామానికి వస్తే మాత్రం వారు దీపావళి సంబ‌రాల‌కు దూరం వుండాల్సిందే". పున్ననపాలెం గ్రామస్థులు ఇప్పటికీ ఆ కట్టుబాటును గౌరవిస్తూ పండుగ జరుపుకోవడం లేదు. తమ పూర్వీకులు చేసిన తీర్మానాన్ని ఇప్పటికీ పాటిస్తూ.. ఆ గ్రామం దీపావళికి దూరంగా ఉంటూ వస్తుంది.. గతంలో జరిగిన ఈ విషాద ఘటనలు మళ్లీ తమ గ్రామంలో జరగకూడదు అంటే.. దీపావళికి దూరంగా ఉండడమే సరైనది  ఆ గ్రామస్థులు న‌మ్ముతున్నారు. అశుభంగా భావించి పండగకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

Tags:    

Similar News