ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక
పదోన్నతులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్త్రాన్ని క్లియర్ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మెకానికల్‌లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్జీజన్స్ కేడర్‌లలోని ఉద్యోగులు, పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు, ఛార్జెస్ ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా పేర్కొంది.
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు ఇతర కేడర్లలోని ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు కల్పించనున్నారు. గతంలో వారిపై నమోదైన క్రమశిక్షణా చర్యలు, శిక్షలు లేదా పెనాల్టీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు ఇదే విధానం అమల్లో ఉండేది.2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వర్తించే నిబంధనలనే ఆర్టీసీ సిబ్బందికి కూడా అమలు చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాత విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు నిజమైన దీపావళి కానుక అని అభివర్ణించారు.
2020లో ప్రభుత్వంలో విలీనం అయినప్పటి నుంచి ఇతర శాఖల ఉద్యోగుల నిబంధనలు వీరికీ వర్తించాయి. వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. బీ ఆర్టీసీలో ఆరు విభాగాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం రెండు విభాగాల్లోని సిబ్బందికే పదోన్నతులకు అవకాశం కల్పించడం గమనార్హం. ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని 6 విభాగాల్లోని ఉద్యోగులు అందరికీ పదోన్నతులు దక్కేలా చొరవ చూపాలని, లేకపోతే చాలా మందికి అన్యాయం జరుగుతుందని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పేర్కొంది.