చిరంజీవికి అవమానమా? : బాలకృష్ణ ఆగ్రహం

‘అతను సైకో జగన్‌, అందుకే ఆహ్వానం అందినా వెళ్లలేదు’

Update: 2025-09-25 12:39 GMT

మెగాస్టార్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నయ్య చిరంజీవి గురించి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. దీనిపైన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు సినీ ప్రముఖులు తాడేపల్లి వెళ్లిన సందర్భంలో జగన్‌ వారిని కలవకపోవడం, సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని సూచించడం ద్వారా తీవ్ర అవమానం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్‌ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ, చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు, జగన్‌ సమావేశానికి రాకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని సూచించారని, చిరంజీవి గట్టిగా నిలదీసిన తర్వాతే జగన్‌ సమావేశానికి అంగీకరించారని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. జగన్‌ను ఎవరూ గట్టిగా నిలదీయలేదని, చిరంజీవి గట్టిగా అడిగితే జగన్‌ దిగొచ్చాడని చెప్పడం సరికాదని బాలకృష్ణ స్పష్టం చేశారు. చిరంజీవిని జగన్‌ అవమానించిన మాట వాస్తవమేనని, అయితే ఎవరూ గట్టిగా ప్రశ్నించలేదని ఆయన అన్నారు.
ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ, ఆ సమావేశానికి తనకు కూడా ఆహ్వానం వచ్చినప్పటికీ, ఆ సైకోగాడు జగన్‌ను కలిసేందుకు తాను వెళ్లలేదని తెలిపారు. అలాగే, కూటమి ప్రభుత్వంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) జాబితాలో తన పేరును తొమ్మిదో స్థానంలో పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను నిలదీసినట్లు ఆయన తెలిపారు. తాను అసెంబ్లీలో ఈ అంశంపై స్పందించడం వెనుక స్పష్టత ఇవ్వడమే ఉద్దేశమని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ చర్చలో చిరంజీవి అవమానం గురించి బాలకృష్ణ ఆవేశంగా మాట్లాడడం, కామినేని వ్యాఖ్యలను ఖండించడం అసెంబ్లీలో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.
Tags:    

Similar News