TDP alliance | బాబు దడదడ.. అధికారులకు గుండె దడ
పాత కార్యక్రమాలకు కొత్త పేర్లు పెట్టారు. 1995 పాలనకు సీఎం మళ్లీ తెర తీశారు. దీంతో ఉద్యోగుల్లో అలజడి మొదలైంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-17 09:59 GMT
ఎన్నికలకు ముందు "నేను మారాను.. ఇక మారిన చంద్రబాబును చూస్తారు" అని ఆయన చెప్పిన మాటలకు భిన్నంగా తన పాత పద్దతిలో మెల్లగా వేగం పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
గత అనుభవాల నుంచి గుణపాఠాలు మరిచినట్లు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే సీఎం చంద్రబాబు పాత పాలనకు పదును పెట్టారు. టెలికాన్ఫరెన్స్ తో అధికారులపై ఒత్తిడి ప్రారంభమైంది. ప్రజావేదికలపై హెచ్చరికలు ఒకపక్క. అక్టోబర్ 2 నుంచి ఆకస్మిక తనిఘీలు ఉంటాయని ఈపాటికే అల్టిమేటం జారీ చేశారు.
ఈ విషయాల్లోకి వెళ్లడానికి ముందు రెండోసారి సీఎం అయ్యాక సాగించిన పాలన వల్ల ఎదురైన ఫలితాలను ఓసారి సమీక్షిద్దాం.
నిద్రపోనివ్వను అన్నారుగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి సీఎం కాగానే సీఎం చంద్రబాబు 1995 నుంచి 2004 మధ్య సాగించిన పాలనలో "నేను నిద్రపోను.. మిమ్మలిని నిద్రపోనివ్వను" అని పదేపదే చెప్పిన ఆయన జన్మభూమి, కార్యక్రమాలు శ్రమదానం, పచ్చదనం పరిశుభ్రత, ప్రజల వద్దకు పాలన, అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం పేరిట అధికారులను పరుగులు పెట్టించారు.
ఆ పేర్లకు కొత్త నగిషీలు అద్దిన సీఎం చంద్రబాబు అధికారులు, సిబ్బందిని దడదడ లాడించేందుకు శ్రీకారం చుట్టారు. సాంకేతిక ఆధారిత సమీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం సర్వసాధారణం. అధికారులు ఆ పనుల్లో తలకమునకలు అవుతున్నారు. వినతులతో వచ్చే వారు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే, ప్రజాప్రతినిధుల కంటే అధికారులకు ఇచ్చే ప్రాధాన్యతే ఎక్కువగా ఉంటుందనేది అపవాదు. వాస్తవం కూడా. కానీ, ప్రజావేదికలపై హెచ్చరికలు ఒకపక్క. టెలికాన్ఫరెన్స్ ల కోసం అధికారులపై ఒత్తిడి పెరిగింది.
సీఎం అయ్యాక తొమ్మది నెలల తరువాత పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్న చంద్రబాబు నేను కూర్చోను మిమ్మిలిని కూర్చోనివ్వను అనే విధంగా పాలన సాగించడానికి సమాయత్తం అయ్యారు.
2024లో జూన్ 12వ తేదీ నాల్గవసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఆ నెల చివరిలో ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజావేదిక నుంచి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ఎలా స్పందించారంటే..
"ప్రభుత్వం ఇప్పుడే కదా ఏర్పడింది. అందుకే కాస్త స్లోగా వెళుతున్నా. చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ నాటి తరహాలో కాదు. కాస్త స్లోగా ఉంటుంది" అని కాస్త సున్నితంగానే యంత్రాంగాన్ని అప్రమత్తంగా కావాలనే తరహాలో హెచ్చరించారు.
1999 పాలనకు శ్రీకారం
కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా. పాలన ఇంకా గాడిన పడలేదనే మాటలు వినిపిస్తోంది. ఈన నేపథ్యంలో 1995 నాటి పాలనకు తెర తీశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజధాని నుంచి జిల్లా అధికారులతో సమీక్షలు ఎక్కువయ్యాయి. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర కీలక అధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులతో ఉదయం నుంచి మధ్యాహ్నం, లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సమీక్షలకు పరిమితమయ్యే పరిస్థితి కల్పించారు. దీనివల్ల పరిపాలనా వ్యవహారాలు, సమస్యల పరిష్కారానికి ప్రతిబంధకంగా మారుతోందనే మాటలు వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్యాబినెట్ లోని జనసేన, బీజేపీ మంత్రివర్గ సహచరులతో కలిసి ఐక్యంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మాత్రం సీఎం చంద్రబాబు తన మార్కు పాలనకే ప్రాధాన్యం ఇవ్వడానికి శ్రద్ధ తీసుకుంటున్నారు.
మాజీ సీఎం వైఎస్. జగన్ మానసపుత్రిక వలంటీర్ వ్యవస్థను ఏమాత్రం రంగంలోకి రానివ్వకుండా, మొదటి నెల పింఛన్ల పంపిణీలో అధికారులతో పూర్తి చేయించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక విధంగా అధికారులు, ఎన్జీవోలపై అప్పటి నుంచి ఒత్తిడి ప్రారంభమైందనే వాస్తవం అర్థం చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ ఏమన్నారంటే..
"గత ప్రభుత్వంలో కూడా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు. ఇప్పుడైతే ఉద్యోగులపై అంతటి ఒత్తిడి ప్రారంభం కాలేదు" అని వ్యాఖ్యానించారు. "మా సంఘం ద్వారా ఉద్యోగుల నుంచి లేదా, సర్వీస్ రూల్స్, సమస్యలపై అందే ఫిర్యాదులపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించడానికి శ్రద్ధ తీసుకుంటున్నాం" అని సూర్యనారాయణ చెప్పారు.
"విభిన్న కార్యక్రమాల వల్ల పనిభారం పెరుగుతోంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిదనే విషయంలో ఏ ఉద్యోగ సంఘం, అధికారుల నుంచి ఫిర్యాదు లేదు" అని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ వల్ల అధికారులు కార్యాలయాలకు పరిమితమైతే, ప్రజల సమస్యలు, పాలన వ్యవహారాల విషయం ప్రస్తావిస్తే, సమాధానం దాటవేయడం వేశారు.
పరిగెత్తించడం వల్ల ఏమి జరిగింది?
1995 సెప్టెంబర్ ఒకటో తేదీ సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు జీవితంలో బంగారు రోజులు ప్రారంభమయ్యాయి. అని చెప్పడంలో సందేహం లేదు. ఆ సంవత్సరం గుర్తుకు చేసుకుంటే మాత్రం అధికారులను ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఆకస్మిక తనిఘీలతో పరుగులు పెట్టించిన విషయం గుర్తుకు రాకమానదు.
అయితే ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. 1995-1999 ఆయన దృష్టికి సంస్కరణల మీద లేదు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి వచ్చాడన్న అపవాదునుంచి బయటి పడి సొంతంగా గెలవడమెలా అనే ఆలోచించాడు. 1999 గెలిచాడు. కాంగ్రెస్ వీక్ కావడం, అంతర్గత కుమ్ములాట వల్ల. 1999 లో సొంతంగా ఎన్టీర్ పేరు లేకుండా గెలిచాక ప్రపంచ బ్యాంక్ మాయలోపడ్డాడు
1999లో చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాక ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాల వల్ల "రాష్ట్రానికి నేను సీఈఓల పాలన సాగిస్తా" అని ప్రకటించారు. ప్రజల వద్దకు పాలన పేరిట ప్రజల్లోకి వెళ్లడం ఒకటి. ఈ కార్యక్రమం వల్ల అధికారులకు ఉరుకులు పరుగులు తప్పలేదు. జిల్లా పర్యటనలు సాగించి సీఎం చంద్రబాబు, అధికారులు, సిబ్బందిలో హైరానా రేకెత్తించారు. దీనిపై ప్రజల సమస్యలు పరిష్కారం దేవుడెరుగు ప్రభుత్వ ఉద్యోగవర్గాల్లో ఒత్తిడి పెరగడంతో పాటు అసహనానికి గురయ్యే విధంగా చేశాయి. అధికారులను మీటింగుల్సలో సాగించిన సమీక్షలతో ఒత్తిడికి గురయ్యారు. దీంతోె వారిలో అసహనం పెరిగింది.
2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దారితీసింది. ఉద్యోగుల్లో విపరీతంగా పెరిగిన వ్యతిరేకత కూడా కారణంగా చెబుతారు.
కలెక్టర్లతో కాన్ఫరెన్స్
జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమస్యలు గుర్తించి, జిల్లాలకు వచ్చి సమీక్షించారు. ఏ సమస్య అయిన ముందు తనకే తెలియాలి అనేది బాబు ఆదేశం. ఈ తరహా పాలనతో అధికారులకు మినహా టీడీపీ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఉదయం లేవగానే నేరుగా జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించే వారు. సమస్యలు తెలుసుకోవడంతో పాటు, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసే వారు. దీంతో 1999లో అధికారంలో ఉండగానే సీఎం చంద్రబాబు నిర్వహించే టెలీకన్ఫారెన్స్ అ ధాటికి జిల్లా కలెక్టర్లే కాదు. విభిన్న శాఖ యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఈ పరిస్థితుల్లో..
దారుణ ఘటనలు ఇవీ..
నీటిపారుదల శాఖపై టెలీకాన్ఫరెన్స్ జరుగుతుండగానే హైదరాబాద్ లో ఇంజీనీర్ ఇన్ చీఫ్ అధికారి తీవ్ర ఒత్తిడికి గురై, తాను కూర్చొన్న సీట్ లోనే గుండెపోటుతో కుప్పకూలిన సంఘటనపైయ అధికార వర్గాల ఆగ్రహాన్ని చవిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామల నేపథ్యంలో 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ వరుస ఓటములు చవిచూసింది.
1999 నుంచి 2004 మధ్య కాలంలో విద్యుత్ చార్జీలు పెంచడం ఓ కారణమైతే. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో వలసల నివారణలో విఫలమయ్యారు.
2000 ఆగష్టు 28 : విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు సాగించిన ఉద్యమంలో బషీర్ బాగ్ వద్ద జరిగిన కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణ మరణించడం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు టెలీ కాన్ఫరెన్సులు, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి శ్రమదానం, ఆకస్మిక తనిఖీలు, పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో ఉద్యోగవర్గాలు విసిగి వేశారాయి. ఒత్తిడి పెరగడంతో వ్యతిరేకత పెరిగింది.
మారాను అంటారు..
ఆ తరువాత పార్టీ వేదికలపై మళ్లీ పల్లవి అందుకున్న చంద్రబాబు, "నేను మారతాను. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తా. మీరు చెప్పేది వినడమే కాదు. ఆచరిస్తా" అని చెప్పడం ప్రారంభించినా, అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ 1995 పాలనను రుచిచూపిస్తూనే ఉన్నారు. సొంత ప్రయోగాలతో తలబొప్పి కడుతున్న ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనిపించవు.
2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం వంటి పరిణామాలు టీడీపీకి పట్టం కట్టాల్సిన అనివార్యమైన వాతావరణం కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో నిర్వహించిన మహానాడులో అప్పటి అనంతపురం ఎంపీ జేసీ. దివాకరరెడ్డి వేదికపైనే సీఎం చంద్రబాబుకు క్లాస్ పీకారు.
"సార్.. నాదొక కోరిక. దయచేసి మీరు (చంద్రబాబు) ఆ వీడియో కాన్ఫరెన్సులు ఆపండి. మీరేమో అధికారులతో నేరుగా మాట్టాడితిరి. మేము లెటర్లు తీసుకోని పోతే ఒక్కడు కూడా పట్టించుకోవడం లేదు" అని తన సహజ శైలిలో మాటల సంధించారు. "ఈ నా... కొ (బూతు) ఒక్కరూ పట్టించుకోరు. ఎమ్మెల్యే, ఎంపీలకు విలువే లేదు. నీకు దండం పెడతా సామీ ఆ కాన్ఫరెన్సులు ఆపు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ తరువాడ కొత్త ప్రయోగానికి తెరతీసి, "జన్మభూమి కమిటీల ఏర్పాటు"తో మళ్లీ అధికారానికి దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన ఈ కమిటీ సభ్యుల సంతకాలు లేనిదే పథకాలు, ధృవపత్రాలు జారీ చేయని అధికారం కల్పించడం వల్ల ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత పూర్తిగా లేకుండా పోయింది.
నమ్మండి అన్నారు..
ఉమ్మడి రాష్ట్రంలో రెండోసారి సీఎం అయినప్పుడు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. అదే టీడీపీకి అధికారవర్గాల నుంచి శాపమైంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో నన్ను నమ్మండి.. మారిన చంద్రబాబును చూస్తారు అని ప్రతి సభలో అర్థించారు. వైసీపీ పాలనపై నగదు బదిలీ పథకాలు మినహా అసంతృప్తికి తోడు, సంక్షేమ కార్యక్రమాలు లేకపోవడం, అభివృద్ధి మందగించడం వైఎస్. జగన్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికి తోడు ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేయడం వల్ల ప్రపంచంలోని తెలుగు ఓటర్లను ఏకం చేసింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు బస్సులు ఏర్పాటు చేసుకుని పోలింగ్ రోజు సొంతూళ్లకు వచ్చారు. ఎన్ఆర్ఐ (NRI Tdp cell) లు సొంత ఖర్చులతో విమానాల్లో తరలివచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వంలో అరెస్టు చేసిన తీరు ఎంత హైప్ క్రియేట్ చేసిందంటే. అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లిన పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 144 అసోంబ్లీ సీట్లలో పోటీ చేస్తే, 135 స్థానాల్లో అద్వితీయమైన విజయం సాధించింది. కూటిమిలోని భాగస్వామ్య జనసేనకు 21కి 21 సీట్లు పది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఎనిమిది చోట్ల గెలవడం ఓ చారిత్రక విజయం గా అభివర్ణించారు.
" ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం." అని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు మాట ఇది.
ఇప్పుడు కూర్చోనివ్వరా... బాబూ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేతలకు పొంతన ఉండదు అనేది రాజకీయ విమర్శకుల మాట. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
1999 తరువాత అమలు చేసిన కార్యక్రమాల పేర్లకు సీఎం చంద్రబాబు కొత్త నగిషీలు దిద్దారు. అప్పుడు పచ్చదనం పరిశుభ్రత పేరిట నిర్వహించిన కార్యక్రమాలు కాస్త ఫలితం చూపినా, ఫొటోలకు ఫోజులిచ్చే కార్యక్రమంగా మార్చారు.
ప్రస్తుతం : తాజాగా స్వర్ణంధ్ర - స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి తెరతీసిన చంద్రబాబు పరిశుభ్రత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో గ్రేటర్ కార్పొరేషన్లు మూడు, కార్పేషన్లు 13, మున్సిపాలిటీలు 74, నగర పంచాయతీలు 20 ఉంటే అందులో... వేలాది మంది శాశ్వత, కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారిని పర్యవేక్షించే వారిలో మేస్త్రీ నుంచి ఐఏఎస్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వారితో పనిచేయిస్తే చాలదా? అనేది ధర్మసందేహం. ఈ పరిస్థితుల్లో ఆ శాఖతో పాటు, సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మళ్లీ చీపుర్లు పట్టారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు సీపీఎం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ ఏమంటారంటే...
"సీఎం చంద్రబాబు సాంకేతికతకు ప్రధాన్యం ఇస్తారు. ఆయనలో సాఫ్ట్ వేర్ అలా ఉండిపోయింది" అని సాంకేతిక పరిభాషే వాడారు. "చంద్రబాబులో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కావడం లేనట్లే ఉంది" అని చెబుతూ, మారినట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మినహా.. అలాంటిదేమీ ఉండదు" అని గఫూర్ అభిప్రాయపడ్డారు.
రెండోసారి సీఎం హోదాలో చంద్రబాబు సాగించిన ఆకస్మిక పర్యటనలు అధికారులను బెంబేలెత్తించాయి. 2014లో ఆ పరిస్థితి లేకున్నా, మళ్లీ తన ఆలోచన అమ్ముల పొది నుంచి పాత అస్త్రాలను చంద్రబాబు కిందికి దించారు.
"ఈ ఏడాది అక్టోబర్ 2 తరువాత ఆకస్మక తనిఖీలు చేపడతా. ముందుగా చెప్పను" అని సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందట అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. హెలికాప్టర్ ఎక్కిన తరువాత కానీ, తాను ఎక్కడ దిగేది చెప్పను" అని కూడా ప్రకటించారు. దీని వల్ల మళ్లీ పరుగుపందేనికి సిద్ధంగా ఉండండని అధికారుల మెదడుకు టెన్షన్ కల్పించినట్లే కనిపిస్తోంది.
1999 నుంచి రెండు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు క్షణం తీరిక లేని కార్యక్రమాలతో ఉద్యోగులకు ఊపిరి సలపనివ్వకుండా చేశారు. తద్వారా వరుసగా రెండు ఎన్నికల్లో అధికారానికి దూరం అయ్యారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాధికారులను మళ్లీ పరుగు పెట్టించడానికి సిద్ధం అయ్యారు. ఈసారి ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.