బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే
పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. గాలి, నీరు, ఇండస్ట్రీయల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలి. ఇందు కోసం టెక్నాలజీని వినియోగించాలి. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే... సదరు సంస్థలు.. వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇక ప్రత్యేకంగా ప్లాస్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వివిధ వ్యర్ధాలను సర్య్కలర్ పాలసీకి అనుసంధానం చేయాలి. ఇక ప్రత్యేకంగా బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దు. మొత్తంగా 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి... వీటి ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే. దీన్ని కచ్చితంగా పాటించాలి. పర్యవేక్షణకు టెక్నాలజీని... సీసీ టీవీలను వినియోగించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.