బాబు కుప్పం, పవన్ కల్యాణ్ పిఠాపురం కంటే జగన్ పులివెందులలో తక్కువే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల స్థానాల్లో కంటే చంద్రబాబు నియోజక వర్గంలోనే అధిక శాతం పోలింగ్.
Byline : Vijayakumar Garika
Update: 2024-05-16 08:34 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంతో పోల్చితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోటీలో ఉన్న పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో తక్కువుగానే పోలింగ్ నమోదైంది. పిఠాపురం, పులివెందుల కంటే కుప్పంలో అధికంగా పోలింగ్ నమోదు కావడం విశేషం. అలాగే నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, వైఎస్ షర్మిల బరిలో ఉన్న నియోజక వర్గాల్లోను పోలింగ్ శాతం పెరిగింది.
చంద్రబాబు స్థానంలోనే ఎక్కువ
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య అసెంబ్లీ నియోజక వర్గాల్లో కుప్పం ఒకటి. ఇక్కడ నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు బరిలో ఉన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కుప్పంలో ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే అధికంగానే నమోదైంది. దాదాపు 4.41 శాతం ఎక్కువుగా 2024 ఎన్నికల్లో రికార్డు అయింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన జరిగిన తొలి ఎన్నికలతో పోల్చితే చాలా ఎక్కువు శాతం రికార్డు అయింది. 2014తో పోల్చితే ఈ సారి కుప్పంలో ఏకంగా 6.08 శాతం పోల్ పర్సెంటేజీ నమోదు కావడం విశేషం. అంటే 2014లో 83.8 శాతంగా పోలింగ్ ఉంటే 2019 ఎన్నికల్లో 85.47 శాతానికి పెరుగగా, 2024 ఎన్నికల్లో 89.88 శాతానికి ఎగబాకింది.
పిఠాపురంలో అమాంతంగా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గలో అమాంతంగా పోలింగ్ పర్సెంటేజీ పెరిగి పోయింది. అయితే చంద్రబాబు కుప్పంతో పోల్చితే తక్కువుగాను, సీఎం జగన్ పులివెందుల కంటే ఎక్కువ శాతం నమోదైంది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో ఏకంగా 5.64 శాతం పోలింగ్ పెరిగింది. అంతకంటే ముందు జరిగిన ఎన్నికల కంటే కూడా ఈ సారి అధిక పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 79.03 శాతం, 2019 ఎన్నికల్లో 80.99, 2024 ఎన్నికల్లో 86.63 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.
అక్కడతో పోల్చితే తక్కువే
ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా పోలింగ్ పర్సెంటేజీ పెరిగినా చంద్రబాబు కుప్పం, పవన్ కల్యాణ్ పిఠాపురంలో నమోదైన పోలింగ్ శాతం కంటే పులివెందులలో నమోదైన పోలింగ్ శాతం తక్కువే. అయితే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ పర్సెంటేజీ పెరిగింది. 2014 ఎన్నికల్లో 79.86 శాతం పోలింగ్ నమోదు కాగా 2019 ఎన్నికల్లో 80.87, 2024 ఎన్నికల్లో 81.34 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. అంటే 2019తో పోల్చితే 2024లో 0,47 శాతం, 2014తో పోల్చితే 1.48 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది.
ఇక నారా చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీలో ఉన్న మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. గత మూడు ఎన్నికల్లో 80కిపైగా పోలింగ్ శాతం నమోదైంది. 2024 ఎన్నికల్లో 85.74 శాతం, 2019లో 85.45, 2014 ఎన్నికల్లో 85.24 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. అంటే 2019 కంటే 0,29 శాతం, 2014 కంటే 0.50 శాతం చొప్పున పోలింగ్ పెరిగింది. ఎన్టీఆర్ కుమారుడు, నారా చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్న హిందూపురంలో ఈ ఎన్నికల్లో 77.82 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014 ఎన్నికల్లో 76.23, 2019 ఎన్నికల్లో 77.50 శాతం చొప్పున పోలింగ్ పర్సెంటేజీ నమోదైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, సీఎం వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల బరిలో ఉన్న కడప పార్లమెంట్ నియోజక వర్గంలో కూడా పోలింగ్ శాతం పెరిగింది. దాదాపు 79.57 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 78.68, 2014లో 77.45 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.