అత్తారింట్లో మెగా విందు..కొత్త అల్లుడికి మైండ్‌ బ్లాక్‌

కొత్త అల్లుడికి వందల కొద్ది వంటకాలు చేసి పండుగ సందర్భంగా ఇంటికి ఆహ్వానించారు అత్తా మామలు. వారి ప్రేమకు అల్లుడు ఫిదా అయ్యాడు.;

By :  Admin
Update: 2025-01-13 12:20 GMT

పండుగ పర్వదినాలలో అత్తగారి ఇంట్లో కొత్త అల్లుళ్లకు విందు ఇవ్వడం పరిపాటి. మటన్, చికెన్, చేపలు, రోయ్యలు వంటి వాటితో ప్రత్యేక వంటకాలు తయారు చేసి విందు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. మహా అయితే వీటికి అదనంగా బిర్యానీలు, ఫలావులు, శాఖాహార వంటకాలైతే.. సాంబారు, కూరగాయ కర్రీలు, ఆకుకూరలు, రసం, చెట్నీలు వంటి వంటకాలు చేసి కొత్త అల్లుళ్లకు వడ్డించడం చేస్తుంటారు. వీటికి అదనంగా ఫ్రూట్స్, స్వీట్స్‌ అందిస్తుంటారు. అయితే అంత సింపుల్‌గా చేస్తే మజా ఏముంటుందని భావించారు ఈ అత్తారింటోళ్లు. వందల సంఖ్యలో వంటకాలు చేసి కొత్త అల్లుడుని సర్‌ప్రైజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. అనుకున్నదే తడువుగా ఏకంగా 470 రకాల వంటకాలను చేసి అల్లుడిని అబ్బుర పరిచారు. ఇన్ని వందల రకాల వంటకాలను చూసిన కొత్త అల్లుడికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఈ సర్‌ప్రైజ్‌ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతమైన యానాంలో చోటు చేసుకుంది.

యానాం నివాసి అయిన మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతులు ఈ సర్‌ప్రైజ్‌ మెగా విందును ఏర్పాటు చేసి కొత్త అల్లుడిని ఆశ్చర్య పరిచారు. మేజేటి భాస్కర్, వెంకటేశ్వరి దంపతులకు హరిణ్య ఏకైక కుమార్తె. మేజేటి భాస్కర్‌ యానం వ్యాపార సంఘం గౌరవ అధ్యక్షుడుగా ఉన్నారు. వీరి ఏకైక కుమార్తె హరిణ్యను విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సాకేత్‌తో వివాహం జరిపించారు. ఇరు కుటుంబాలు వ్యాపార రంగంలో స్థిరపడిన వారు కావడంతో డబ్బుకు కొదవ లేదు. అయితే మొదటి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు సాకేత్‌ను యానాంకు ఆహ్వానించారు అత్తా మామలు. ఈ సందర్భంగా అల్లుడు సాకేత్‌ కోసం మెగా విందును ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగా శాకాహారంతో కూడిన సాంబారు, రసం, కూరలు, పచ్చళ్లు, పిండి వంటలు, పండ్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, కూల్‌ డ్రింగ్, ఐస్‌ క్రీమ్‌లు, ఇలా దాదాపు 470 రకాల ఆహార పదార్థాలతో మెగా వింద్‌ను తయారు చేయించారు. చిన్న చిన్న కప్పుల్లో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు సాకేత్, కుమార్తె హరిణ్యలను విందుకు ఆహ్వానించారు. ఒకే సారి వందల కొద్ది వంటకాలను చూసిన అల్లుడు సాకేత్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. అందంగా అలంకరించిన వాటిని చూసిన సాకేత్‌ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అత్తగాంటి వాళ్లు వందల కొద్ది వంటకాలతో చూపించిన గౌరవ, మర్యాదలు, ప్రేమ, ఆప్యాయతలకు కొత్త అల్లుడు సాకేత్‌ ఉబ్బితబ్బిబ్బయాడు. శాఖాహారంతో వందల కొద్ది వంటకాలను తాను ఎన్నడు చూడ లేదని, ఇప్పుడే చూశానని చెబుతూ.. తన పట్ల అత్తా.. మామలు చూపిన ప్రేమకు ఫిదా అయ్యాడు.
Tags:    

Similar News