రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు.;
By : The Federal
Update: 2025-08-15 16:30 GMT
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం‘ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. శుక్రవారం రాత్రి రాజ్‌భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖలంతా సతీసమేతంగా హాజరయ్యారు. ఆహ్వానితులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ తేనీటి విందు ఇచ్చారు.
రాజ్ భవన్ లో పలువురు అధికారులు, రాజకీయ నాయకులు కలవడంతో కాసేపు పిచ్చాపాటీగా చర్చించుకోవడం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ప్రత్యేకంగా చర్చించుకోవడం పలువురిలో ఆసక్తిని పెంచింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రావడంతో అప్పుడప్పుడూ కాస్తంత నిశ్శబ్ధం కూడా కనిపించింది.
సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజ్నెవా, మంత్రి నారా లోకేష్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ దంపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, పలువురు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు గద్దె రామోహన్, సీనియర్ అధికారులు, పద్మ పురస్కార గ్రహీతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ జీ. లక్ష్మీశ, క్రీడాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు.