ఫైల్స్‌ దగ్ధాల వెనుక అసలు నిజాలు ఇవేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఫైల్స్‌ దగ్ధం సంఘటనలు ప్రజలను, అధికారులను, పాలకులను కలవర పరుస్తున్నాయి. ఈ ఫైల్స్‌ దగ్ధం వెనుక అసలు నిజాలు ఏమిటి?

Update: 2024-08-19 03:18 GMT

ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైల్స్‌ దగ్ధం సంఘటనలు తీవ్ర చర్చనియాంశంగా మారాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఫైల్స్‌ దగ్ధం సంఘటన మరువక ముందే శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా కార్యాలయం, పోలవరం ప్రాజెక్టు కార్యాలయాల్లో ఫైల్స్‌ దగ్ధమయ్యాయి. తిరుపతి, పోలవరం ఫైల్స్‌ సంఘటనలు దుమారం రేపాయి.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ కాల్చివేతకు సంబంధించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోని ఏపీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సంఘటనకు పరోక్షంగా కారకుడని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఇద్దరు డిప్యూటీ కలెక్టర్‌లు, మరో యుడిసిని సస్పెండ్‌ చేసింది. దీనిపై రెవెన్యూ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా ప్రత్యేకంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. 2,440 ఫైల్స్‌ కాలినట్లు అధికారులు గుర్తించారు. కావాలని ఫైల్స్‌ను తగుల బెట్టారనేది సిసోడియా రిపోర్టులో స్పష్టమైంది. స్వయంగా డీజీపీ హెలికాఫ్టర్‌లో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మదనపల్లి సంఘటనలో ఫైల్సే కాకుండా కంప్యూటర్‌ ఆర్డ్‌ డిస్క్‌లు కూడా కాల్చివేశారు. వేల ఎకరాల భూములు స్వాహా చేశారని, ఆ రికార్డులు మాయం చేసేందుకే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్‌ చేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది. ఇందులో ప్రధానమైనది 22ఎ కింద ఉన్న భూములు అధికారుల అండతో వైఎస్సార్‌సీపీ నేతలు కాజేశారనేది ప్రభుత్వం చెబుతున్న మాట. సీఎం కూడా ఇదే విషయంపై స్పందించారు.

అవినీతి బయట పడుతుందనేనా?

ఈనెల 17న తిరుపతిలోని టీటీడీ పరిపాలనా కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ భాస్కర్‌ క్యాబిన్‌లోని పలు కాగితాలు కాలిపోయాయి. ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామికి దీపారాధన చేస్తారని, ఆ దీపారాధన చేసి వెళ్లిన తరువాత నూనె ఫైల్స్‌పై పడి కాలిపోయి ఉంటాయని, కావాలని చేసిన అగ్ని ప్రమాదం కాదని, సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తంగానే ఉందని కార్యాలయ సూపరింటెన్‌డెంట్‌ సెలవిచ్చారు. నిజానికి టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో అవకతవకలు జరిగాయని భావించిన ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న సమయంలో ఫైల్స్‌ కాలిపోవడం చర్చనియాంశంగా మారింది. దీని వెనుక ఎవరో ఒకరు ఉండి ఉంటారని, డిఇఇ సెలవులో ఉన్నందున వివరాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందనే అనుమానాలు ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ట్రస్ట్‌ టిక్కెట్స్‌ అమ్మకాలు, ఇంజనీరింగ్‌ విభాగం చేసిన పనుల్లో అవినీతి జరిగి ఉంటుందనే కోణంలో విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. మొత్తం 13 ఆలయాలకు సంబంధించిన రికార్డులు కాలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు. అయితే ఎటువంటి క్లూ వారికి దొరకలేదు. నూనె ద్వారా అంటుకుని కాలిందనేందుకు కూడా సరైన ఆధారం కనిపించలేదని సంఘటన చూసిన వారు చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం ఆవరణలో ఫైల్స్‌ తగలబడిన సంఘటనపై పలువురు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు స్పందించారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపితే కాని వాస్తవాలు వెలుగు చూస్తాయని నాయకులు చెప్పడం విశేషం. ఇక్కడ కాలిన కాగితాలు చిత్తుకాగితాలని, అవి ఎందుకూ పనికిరావని స్థానిక ఉన్నతాధికారి చెప్పడం విశేషం. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన దస్త్రాలని, నిర్వాసితులకు పరిహారం ఇచ్చే విషయంలో అవినీతి చోటు చేసుకుందని, అందుకే ఈ ఫైల్స్‌ దగ్ధం చేసినట్లు టీడీపీ వారి ఆరోపణ. దీనిని అవినీతి కోణంలోనే చూడాలని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఇప్పటి వరకు పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ విషయంలో కానీ, నిర్మాణాల్లో కానీ అవినీతి చోటు చేసుకుందననే అంశంపై ఎటువంటి ఆధారాలు ఆరోపణలు చేసే వారు చూపించలేకపోయారు.

ఈ ఫైల్స్‌ దగ్ధం కేసులో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. స్పెషల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె కళాజ్యోతి, ఆఫీసు సబార్డినేట్‌ కె రాజశేఖర్, సీనియర్‌ అసిస్టెంట్లు కె నూకరాజు, కారం బేబిలను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతి ఆదివారం ఉత్తర్వులిచ్చారు. డిప్యూటీ తహశీల్దార్లు ఎ కుమారి, ఎ సత్యదేవిలకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఫైళ్ల దగ్ధం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కాగా ఫైల్స్‌ దగ్ధం కావడంపై దవళేశ్వరం పోలీస్‌ స్టేషన్లో డిప్యూటీ కలెక్టర్‌ కె వేదవల్లి ఫిర్యాదు చేశారు.

ఇటీవల పర్యావరణ శాఖలోని పైల్స్‌ బందరు కాలువ కట్టపై కాల్చారని పలు ఆరోపణలు వచ్చాయి. పర్యావరణ శాఖలో చోటు చేసుకున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఫైల్స్‌ను అధికారులే కాల్చివేశారని వచ్చిన ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ విచారణకు ఆదేశించారు. ఇవి కూడా వేస్ట్‌ పేపర్స్‌ అని పనికిరాని పేపర్లను ఇక్కడ çపడేసి కాల్చి వేశారని అధికారులు తప్పించుకున్నారు.

కంప్యూటర్లలో సమాచారం ఉండదా?

ప్రతి కార్యాలయంలోనూ కంప్యూటర్‌లు పనిచేస్తున్నాయి. ఆఫీసుకు సంబంధించిన ప్రతి ఫైల్‌ కూడా కంప్యూటరైజ్‌ అవుతోంది. కంప్యూటరైజ్‌ కాని కార్యాలయం దాదాపు లేదని చెప్పొచ్చు. మాన్యువల్‌ కాపీ ఒకటి కంప్యూటరైజ్‌ అయిన తరువాతనే ప్రింట్‌ తీసి ఫైల్‌ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరి వద్దా డేటా ఉంటుంది. ఇంట్రానెట్‌ (లాన్‌) సౌకర్యం ద్వారా ఆయా కార్యాలయాల్లో సమాచారం లాన్‌లో ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా సమాచారం తీసుకునేందుకు వీలు ఉంటుంది. ఫైల్స్‌ కాల్చి, కంప్యూటర్లను ధ్వంసం చేసినంత మాత్రాన సమాచారం లేకుండా పోతుందనుకోవడం కూడా సరైంది కాదని కొందరు ఉన్నతాధికారులు చెప్పడం విశేషం.

సర్వర్‌ నుంచి తొలగించే అవకాశం ఉంటుందా?

ఫైల్స్‌ దగ్ధం కేసులు ఏపీలో ఏమి సాధిస్తాయనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అధికార తెలుగుదేశం, జనసేన, బిజెపి వారు స్పందించిన తీరును బట్టి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. కంప్యూటర్లలో సమాచారం ఉన్నా దగ్ధం చేసి ఉంటే తప్పకుండా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వానికి ఇంకో అనుమానం కూడా ఉంది. లాన్‌ నిర్వాహకులను లోబరుచుకుని ఏఫైల్స్‌ అయితే తీసేయాలనుకున్నారో ఆ ఫైల్స్‌ను ల్యాన్‌ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని భావిస్తోంది. సర్వర్‌ నిర్వహణ రాష్ట్ర టెక్నికల్‌ విభాగం చేతుల్లో ఉంటుంది. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ ద్వారా సర్వర్‌ మెయింటెనెన్స్‌ జరుగుతోందని, దీని నిర్వాహకులు ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీ ద్వారా నిర్వహణ జరుగుతున్నందున ఈ అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఏపీ సీఎఫ్‌ఎస్‌ఎస్‌) 2014లో టీడీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటైంది. ఈ ఏజెన్సీని అప్పట్లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. తిరిగి ఇదే ఏజెన్సీ కొనసాగుతోంది.

Tags:    

Similar News