లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా
గిరిజనులకు న్యాయం చేయరా.. గిరిజనులు కేవలం ఓట్లకే పనికొస్తారా అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.;
మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రశ్నించారు. గురువారం విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగురాలైన తాను ఎనిమిది ఏళ్లుగా తనకు న్యాయం చేయాలని కోరుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్ల మైనర్ బాలిక అయిన తన కూతురు సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేస్తే ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మొదట సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని కానీ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి అయినా సుగాలి ప్రీతి కేసును పట్టించుకోలేదని పార్వత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఎన్నికల్లో ఓట్లకే పనికొస్తారా వారికి న్యాయం చేయరా అని ఆమె ప్రశ్నించారు. హోం మంత్రి అనిత దృష్టికి కూడా సుగాలి ప్రీతి కేసును తీసుకెళ్లానని, ఆమె కూడా న్యాయం చేయలేదన్నారు. జైల్లో ఖైదీగా ఉన్న శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు విషయంలో మంత్రి అనిత బిజీ ఉన్నారని, మరి సుగాలి ప్రీతి కేసును పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎందుకు తన కుమార్తె ప్రీతి కేసుపై ఇంత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.