శ్రీనివాసుని భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం దూరమవుతోందా?
టీటీడీలో భద్రతా లోపాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ నిద్రావస్థలో ఉందని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.;
టీటీడీలో భద్రతా లోపాలు ఒక్కరి పైనో లేదా ఒక విభాగం పైనో ఆధారపడి ఉండవు. ఇది సంస్థాగత వైఫల్యం. సమన్వయ లోపం. జనవరి 2025లో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనలో టీటీడీ అధికారులు, పోలీసు విభాగం, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం సరిగా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావు మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు కారణం కావొచ్చు. ఉదాహరణకు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ విషయంలో సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. ఈ సమన్వయ లోపం వల్ల భక్తుల భద్రతకు సంబంధించిన ప్రణాళికలు సమర్థవంతంగా అమలు కాలేదు. ఒక భక్తురాలు స్వయంగా "టీటీడీ చేతకానితనమే ఈ ఘటనకు కారణం" అని వ్యాఖ్యానించడం దీనికి నిదర్శనం.
ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాటకు కారకులు ఎవరు?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 8, 2025న తిరుపతిలో విష్ణు నివాసం వద్ద టికెట్ పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనకు బాధ్యులుగా తిరుపతి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమణ కుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అదనంగా, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్ శ్రీధర్, జాయింట్ ఈవో ఎం గౌతమిలను బదిలీ చేశారు. విచారణ ఇంకా పూర్తి కానప్పటికీ, ఈ చర్యలు భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. లక్షలాది భక్తులు హాజరయ్యే ఈవెంట్‌కు తగిన క్రౌడ్ మేనేజ్‌మెంట్ లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అన్నదాన కార్యక్రమంలో తొక్కిసలాట ఎందుకు జరిగింది?
అన్నదాన కార్యక్రమం టీటీడీ అత్యంత పవిత్రమైన సేవలలో ఒకటి. కానీ ఇటీవలి సంఘటనలు దాని నిర్వహణలో లోపాలను బయటపెట్టాయి. 2024లో ఈవో శ్యామలరావు అన్నదాన క్యాంటీన్లలో నాణ్యత లోపాలు, పిల్లలకు పాల సరఫరా ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించారు. ఈ సమస్యలు పరిష్కరించక పోవడంతో, భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించలేక పోయారు. రద్దీ సమయంలో సరైన క్యూ నిర్వహణ, సిబ్బంది లేకపోవడం వల్ల తోపులాట జరిగి, తొక్కిసలాటకు దారితీసింది. ఇది కేవలం లాజిస్టికల్ వైఫల్యం కాదు. భక్తుల ఆకలిని తీర్చాలనే సంకల్పంలోని నిర్లక్ష్యం.
తిరుమల కొండపై గంజాయి, మద్యం ఎలా అందుబాటులో ఉంది?
తిరుమల కొండ పవిత్రతను కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యత, కానీ గంజాయి, మద్యం వంటి నిషిద్ధ వస్తువులు అందుబాటులో ఉండటం ఆందోళనకరం. అలిపిరి వద్ద భద్రతా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ, తనిఖీలు పట్టీపట్టనట్లు ఉంటాయని, స్థానిక దుకాణాల ద్వారా ఈ వస్తువులు చేరుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. భద్రతా సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, లేదా అవినీతికి పాల్పడుతున్నారని భక్తులు అనుమానిస్తున్నారు. ఇది కొండ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తోందని భక్తులు అంటున్నారు. తిరుమలలోని బాలాజీ కాలనీలో తనిఖీలు నిర్వహిస్తే రమేశ్ అనే వ్యక్తి వద్ద మూడు మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. దీంతో రమేశ్ పై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల 31న మతిస్థిమితం లేని వ్యక్తి బైక్‌పై కొండపైకి ఎలా వెళ్లాడు?
మార్చి 31, 2025న ఒక మతిస్థిమితం లేని వ్యక్తి బుల్లెట్ బైక్‌పై తిరుమల కొండపైకి చేరడం, సిబ్బందితో వాదులాటకు దిగటం పలువురిని ఆశ్చర్య పరిచింది. తాను తన తాత రమ్మంటే వచ్చానని, ఆయనకు కావాల్సినవన్నీ తెచ్చి ఇవ్వాల్సి ఉందని చెప్పారు. తాత ఎక్కడున్నారంటే సమాధానం చెప్పలేదు. తమిళ్ లో మాట్లాడుతున్నాడు. ముస్లీమ్ వస్త్రధారణలో ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిక్కతిక్కగా మాట్లాడుతూ పోలీసులను సైతం ముప్పుతిప్పలు పెట్టారు.
పాప వినాశనంలో పడవలు తిప్పటం ఏమిటి?
పాపవినాశనంలో భక్తులు తమ కోర్కెలు తీర్చుకునేందుకు స్నానాలు చేస్తారు. అటువంటి పాపవినాశనం కోనేరులో టూరిజం శాఖవారు పడవలు తిప్పటం కూడా ఆధ్యాత్మిక ఆనందానికి భంగం కలిగించడమేననే విమర్శలు వెల్లువెత్తాయి. ఆంధ్యాత్మిక కేంద్రాన్ని టూరిజం కేంద్రంగా మార్చేందుకు టీటీడీ పాలక మండలి ప్రయత్నిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. పాప వినాశనం అటవీ శాఖ వారి అధీనంలో ఉంది. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో పాప వినాశనం ఉంది. అటవీశాఖ తీరును టీడీడీ తప్పు పట్టింది. అయితే వారు ఏదో చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అటవీ శాఖ మంత్రి కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని భక్తులు అంటున్నారు. ఇటువంటి సంఘటనలు భద్రతా వ్యవస్థలో గందరగోళాన్ని సూచిస్తాయి.
బిర్యానీ వంటకాలు కొండపైకి..
తిరుమలలో మాంసాహారం నిషేధం. అటువంటి తిరుమల కొండపైకి ఉడికించిన కోడిగ్రుడ్లు, బిర్యానీ పాకెట్లు తీసుకొని కొందరు భక్తులు వెళ్లారు. చెట్లకింద కూర్చుని తింటుండగా చూసిన భక్తులు వారిని ప్రశ్నించారు. కొండపై మాంసం తినకూడదని మాకు తెలియదని వారు చెప్పటం విశేషం. ఇది భద్రతా లోపాలను తెలియజేస్తోంది.
అలిపిరి, శ్రీవారిమెట్టు వంటి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు సరిగా జరగకపోవడం, సీసీటీవీలను సమర్థవంతంగా ఉపయోగించకపోవడం దీనికి కారణాలుగా కనిపిస్తాయి. ఈ సంఘటనలు భక్తులలో భయాందోళనలను కలిగించాయి. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు ఎలా సాధ్యమవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు.
తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి లేఖలు, కేంద్రం స్పందన ఎలా ఉండవచ్చు?
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ సమస్యలన్నింటినీ ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖల ద్వారా తెలిపారు. కేంద్రం ఈ లేఖలపై సీరియస్‌గా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుమల క్షేత్రానికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉంది. సుప్రీం కోర్టు గతంలో లడ్డు వివాదంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని నియమించినట్లే, ఈ సంఘటనలపై కూడా CBI లేదా ఇతర కేంద్ర ఏజెన్సీ ద్వారా విచారణకు ఆదేశించవచ్చు. అయితే రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేంద్రం తక్షణ చర్యలకు బదులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా ఉంది.
దర్శనాల విషయంలో భక్తులు ఎందుకు అసంతృప్తికి గురవుతున్నారు?
పాలక మండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్యూలైన్లను నియంత్రిస్తామని చెప్పినప్పటికీ, దాని అమలు ఇంకా ఆచరణలోకి రాలేదు. దీనికి కారణం టీటీడీ ఐటీ విభాగంలో సాంకేతిక లోపాలు మరియు ప్రణాళిక లేకపోవడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ఆధార్ కార్డుతో 1,800 సార్లు టికెట్లు బుక్ చేసిన సంఘటన ఐటీ వ్యవస్థలోని లోపాలను బయటపెట్టింది. భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడటం, అసౌకర్యాలు పడటం వల్ల అసంతృప్తి పెరుగుతోంది. ఇది వారి ఆధ్యాత్మిక అనుభవాన్ని దెబ్బతీస్తోంది.
ఈవో శ్యామలరావును ముఖ్యమంత్రి ఎందుకు సమర్థించారు? చైర్మన్ నాయుడులోనే లోపాలు ఉన్నాయా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవో శ్యామలరావును సమర్థించడం వెనుక రాజకీయ, పరిపాలనా కారణాలు ఉండవచ్చు. శ్యామలరావు గతంలో అడల్టరేటెడ్ ఘీ సరఫరాను గుర్తించి ఆపడంలో కీలక పాత్ర పోషించారు. ఇది ఆయన సామర్థ్యాన్ని చూపిస్తుంది. కానీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఆయన వైరుధ్యం, నిర్ణయాధికారంలో అస్పష్టత వంటివి సమస్యలను సృష్టించాయి. ముఖ్యమంత్రి శ్యామలరావును సమర్థించడం ద్వారా పరిపాలనా స్థిరత్వాన్ని కాపాడాలని భావించి ఉండవచ్చు. చైర్మన్ నాయుడు విమర్శలను తప్పించుకోలేరు. ఆయన నాయకత్వంలో టీటీడీ సంస్థాగత సంస్కరణలు ఆశించిన స్థాయిలో జరగలేదు.
తిరుమలకు భక్తులు ఆధ్యాత్మిక ఆనందం కోసం వస్తారు...
తిరుమలకు వచ్చే భక్తులు కేవలం దర్శనం కోసం మాత్రమే రారు. వారు శాంతి, ఆధ్యాత్మిక ఆనందం కోసం వస్తారు. కానీ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం, గంజాయి వంటి వాటి ఉనికి, దర్శనాల్లో అసౌకర్యాలు వారి భావోద్వేగాలను దెబ్బతీస్తున్నాయి. ఒక తల్లి తన బిడ్డతో క్యూలో నిలబడి, ఆకలితో అలమటించడం లేదా ఒక వృద్ధుడు గంటల తరబడి నిరీక్షించి నిరాశతో వెనుదిరగడం దురదృష్టకరం. టీటీడీ పాలకవర్గం ఈ సమస్యలను సాంకేతికతతోనో, సమన్వయంతోనో పరిష్కరించాలి. కానీ అంతకంటే ముఖ్యంగా, భక్తుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. లేకపోతే ఈ పవిత్ర క్షేత్రం గౌరవం క్రమంగా క్షీణిస్తుంది.