చంద్రబాబు నిర్ణయంతో అవాక్కవుతున్న ఆంధ్రా టీచర్లు...

'బంగారు కుటుంబా'లను బలవంతంగా రుద్దుతారా? ఉద్యమానికి సిధ్దమంటున్న ఉపాధ్యాయ సంఘాలు;

Update: 2025-07-27 12:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన P4 పథకం ఇప్పుడు ప్రభుత్వం ఉపాధ్యాయులకు వణుకు పుట్టిస్తోంది.ఉపాధ్యాయులందరూ పీ4 పథకంలో భాగస్వాములు కావాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయ సంఘాలలో కలవరాన్ని సృష్టిస్తోంది.ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 పథకం అందరికీ ఆదర్శం కావాలి గాని ,బంగారు కుటుంబాలను ప్రభుత్వ టీచర్లపై బలవంతంగా రుద్దటం ఏంటని ఎస్ టీయూ, యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.అసలే ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో నడుస్తూ, ఉపాధ్యాయులకు చదువు చెప్పే తీరిక లేకుండా చేస్తున్న ప్రభుత్వం , కొత్తగా పీ4 అంటూ ఉపాధ్యాయులతో చెలగాటం ఆడటం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ యూనియన్ (STU)అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ఈ విషయంపై ఫెడరల్ న్యూస్ తో మాట్లాడుతూ " పీ4 పథకం ప్రభుత్వం చేపట్టడం మంచిదే ,పేద కుటుంబాలను దారిద్యం నుంచి బయటకు తీసుకు రావాలన్న ఆశయం మంచిదే ,కాని ఇప్పడు ఉపాధ్యాయులు తప్పని సరిగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం మాత్రం సరికాదు.అంటే టీచర్లను కూడా ప్రభుత్వం ధనికుల లిస్టులో చేర్చి ఆలోచిస్తోందా..ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వకుండా టీచర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీచర్లు ధనవంతులు కాదు,ఇప్పటికే పేద విద్యార్ధులకు స్వచ్చంధంగా కొందరు ఉపాధ్యాయులు ఆర్ధికంగా సహకరిస్తూనే వున్నారు.స్వచ్చంధంగా అంటే మంచిదే , బలవంతంగా రుద్దాలని చూస్తే ఉద్యమిస్తాం" అన్నారు.
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) రాష్ట్ర కార్యదర్శి మనోహర్ ఫెడరల్ న్యూస్ తో మాట్లాడుతూ " బంగారు కుటుంబాలను టీచర్లందరూ దత్తత తీసుకోవాల్సిందే నంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం , కొన్ని జిల్లాలలో కలెక్ఠర్లు , డీఈవోలు బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తుండటం దారుణం.యూటీఎప్ పక్షాన ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రధానోపాధ్యాయుడు 5 బంగారు కుటుంబాలను , ఒక్కో టీచర్ రెండేసీ బంగారు కుటుంబాలను తప్పకుండా దత్తత తీసుకోవాలనడం దారుణం.స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారు రావచ్చు నంటే బాగుంటుంది. కాదుకూడదంటే ఉద్యమం తప్పదు.అయినా ఎందరు ఎమ్మెల్యేలు, మంత్రులు , కలెక్టర్లు ,ఇతర అధికారులు ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకున్నారో ముందు ప్రకటించాలి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాప్ లతోనే సరి చదువు చెప్పేదెప్పుడు?
ప్రభుత్వం పాఠశాలలు ప్రైవేటు బడులతో పోటీ పడాలని చెప్పే ప్రభుత్వం టీచర్లకు చదువు చెప్పే సమయం కూడా ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ బడికి వచ్చిన దగ్గరి నుంచి యాప్ లతోనే సరిపోతోందని ,క్లాస్ రూం కు కూడా సమయానికి వెల్లలేని పరిస్ధితి వుందని ఉపాధ్యాయ నేతలు అంటున్నారు. ఇప్పుడున్న సమస్యలు చాలక పీ4 అంటూ కొత్త సమస్యను నెత్తిమీద పెట్టడం సరికాదని యూటీఎఫ్ కార్యదర్శి అరుణ కుమారి అన్నారు.బదిలీ అయిన టీచర్లకు రెండు నెలలుగా జీతాలు లేవని , అదేమంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలంటూ సమాధానం వస్తోందని తెలిపారు. ముందు టీచర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వం టీచర్లను వేధించిందని అధికారం లోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దేమిటని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Full View


Tags:    

Similar News