అమెరికాలో తెలుగు యువతి మృతి.. కారణం అదే..!

అమెరికాలో మరో తెలుగు యువతి మరణించింది. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన యువతి అనుకోని విధంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచింది.

Update: 2024-07-22 10:32 GMT

అమెరికాలో మరో తెలుగు యువతి మరణించింది. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన యువతి అనుకోని విధంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచింది. ఈ ఘటన అమెరికాలోని ఒక్లహామా స్టేట్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి నిహారిక.. న్యూట్రిషన్, ఫుడ్ అండ్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో గతేడాది ఆగస్టులో అమెరికాకు వెళ్లింది. ఆమె మరణ వార్త విన్న కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అసలేం జరిగిందంటే..

ఒక్లహామాలో నివాసం ఉంటున్న నిహారిక తన విధులు పూర్తి చేసుకుని ఆదివారం(భారత టైమింగ్స్ ప్రకారం) ఉదయం తన సహచరులతో కలిసి కారులో ఇంటికి బయలదేరారు. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న మార్గంలో ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కిందపడిపోవడంతో వీరు సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాల వస్తున్న మూడు వాహనాలు వరుసగా వీరి కారును ఢీకొట్టాయి. ఆ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నిహారిక అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

లోకేష్‌కు విజ్ఞప్తి

నిహారిక తండ్రి జెట్టి శ్రీనివాసరావు.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి. తమ కూతరు నిహారిక మరణ వార్త వినడంతో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా తన కూతురు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. తమది పేద కుటుంబమని, బ్యాంకు లోన్లు తీసుకుని ఉన్నత చదవుల కోసం కూతురును అమెరికా పంపామని తెలిపారాయన. అక్కడ తన కూతురు మరణించిందని, ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం సహాయం చేయాలంటూ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News