సర్కారు స్కూళ్ల నుంచి అక్షరాలు పరారవుతున్నాయి...

ఏపీలోని 4,750 పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా ఒకటో తరగతిలో చేరలేదు.;

Update: 2025-07-20 04:46 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చేరిక తీవ్రమైన సంక్షోభానికి దారి తీసింది. అధికారిక గణాంకాల ప్రకారం 4,750 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా మొదటి తరగతిలో చేరలేదు. అంతే కాకుండా సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారారు. మొత్తం నమోదు సంఖ్య గత సంవత్సరం 32.50 లక్షలు కాగా ఈ సంవత్సరం 29.65 లక్షలకు పడిపోయింది. ఈ భారీ తగ్గుదల ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు స్పష్టం చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2,66,860 మంది విద్యార్థుల నమోదు తగ్గడం విద్యా ఉద్యమకారులు, తల్లిదండ్రుల సంఘాలలో ఆందోళన రేకెత్తించింది. జూన్ 30న విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు మొత్తం నమోదైన విద్యార్థుల సంఖ్య 76,02,854గా ఉంది. గత సంవత్సరం ఈ సంఖ్య 78,69,714గా నమోదైంది.

ప్రాథమిక విద్యలో ముఖ్యంగా ఒకటవ తరగతిలో నమోదు 2024-25లో 6.87 లక్షల నుంచి ఈ సంవత్సరం 5.60 లక్షలకు పడిపోయింది. అంటే 1.26 లక్షల తగ్గుదల నమోదైంది. ఈ ధోరణి జనాభా క్షీణతతో పాటు సకాలంలో నమోదు చేయడంలో పరిపాలనా వైఫల్యాలను సూచిస్తోంది. నమోదు కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, UDISE+ గణాంకాలు సెప్టెంబర్ 30 నాటికి ఖరారు కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో నమోదు తగ్గుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారా? లేక డాక్యుమెంటేషన్ లేదా? ఇతర సమస్యల వల్ల వ్యవస్థ నుంచి దూరంగా పోయారా అని యాక్టివిస్ట్ లు ప్రశ్నిస్తున్నారు.


నమోదు తగ్గడానికి కారణాలు

ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా విద్యాశాఖ ఇటీవల అమలు చేసిన ‘రేషనలైజేషన్’ విధానం కారణమని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఈ విధానం కింద ఖర్చులను తగ్గించేందుకు పాఠశాలలను విలీనం చేయడం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడం జరిగింది. ఈ చర్యలు విద్యా వ్యవస్థను సమర్థవంతం చేయాలనే లక్ష్యంతో చేపట్టినప్పటికీ, అవి ప్రతికూల పరిణామాలను తెచ్చిపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు విలీనం కావడంతో విద్యార్థులు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. ఇది తల్లిదండ్రులకు అసౌకర్యంగా మారింది. ఫలితంగా చాలా మంది తమ పిల్లలను సమీపంలోని ప్రైవేటు పాఠశాలలకు మార్చారు. ఈ రేషనలైజేషన్ విధానం జగన్ ప్రభుత్వం హయాంలోనే పట్టింది. దానిని కూటమి ప్రభుత్వం కొనసాగించింది.

తల్లిదండ్రుల చూపు ప్రైవేటు పాఠశాలల వైపు

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఎంచుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమ విద్య, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన బోధనా పద్ధతులను అందిస్తున్నాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్ల పరిశుభ్రత, తాగునీరు, గదుల సమస్యలు తరచూ అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఈ అంశాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రతి విద్యార్థిపై స్కూల్లో పరిశుభ్రత కోసం ఏడాదికి రూ. 2వేలు ఖర్చు చేస్తోంది. అయిన వసతులు మెరుగు పడలేదు. కొన్ని స్కూళ్లలో మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి.


రేషనలైజేషన్ పరిణామాలు

రేషనలైజేషన్ విధానం విద్యా వ్యవస్థలో సమర్థతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇది అనేక సమస్యలను సృష్టించింది. పాఠశాలల విలీనం వల్ల విద్యార్థులు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి రావడంతో, రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇది పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం కిలో మీటరు దూరంలోని పాఠశాలను మాత్రమే మెర్జ్ చేశామని, తక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. స్కూళ్లు రద్దు చేయడంతో పాటు అక్కడి పోస్టులు కూడా రద్దయ్యాయి. దీంతో అక్కడి ఉపాధ్యాయులను వేరొక చోటకు పంపించారు. ఉపాధ్యాయ పోస్టుల రద్దు వల్ల తిరిగి స్కూలు పెట్టాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. అక్కడ కొత్త స్కూలు, పోస్టులు మంజూరు అయ్యే వరకు అనుకున్నది సాధించలేరు. ఇటువంటి విధానం బోధన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ విధానం ఆర్థిక లాభాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేశారు. విద్యార్థుల భవిష్యత్, విద్యా వ్యవస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

ముందుకు వెళ్లే మార్గం

ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయుల శిక్షణను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల యాక్సెసిబిలిటీని పెంచడం అవసరం. అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశపెట్టడం ద్వారా ప్రైవేటు పాఠశాలలతో పోటీపడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు, విద్యా వ్యవస్థలో పారదర్శకత నాణ్యతను పెంచే చర్యలు అవసరం.

తల్లిదండ్రుల సంఘం ఆందోళన

ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల సంఘం (PAAP) అధ్యక్షుడు సిఖరం నరహరి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో 2.66 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి పోయారు? వారు ఈ సంవత్సరం పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి ఎందుకు కనిపించకుండా పోయారు? నమోదు, వాస్తవ విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరారు.


విద్యాశాఖ కమిషనర్ స్పందన

విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఈ సంవత్సరం నమోదు తగ్గిందనేది కేవలం ప్రచారం అని ఖండించారు. ‘నమోదు సాధారణంగా ఆగస్టులో ముగుస్తుంది. ఈ సంవత్సరం మేము చాలా కట్టుదిట్టమైన, పారదర్శకమైన సమీక్ష నిర్వహిస్తున్నాము. ఈ తగ్గుదల ఉద్దేశపూర్వకంగా చూపిస్తున్నారు. APAAR ID రూపొందించడం, డేటా శుద్ధితో కూడిన ప్రక్రియ చేపట్టాము. చాలా మంది నమోదైన విద్యార్థులకు ఇంకా ఆధార్ ధృవీకరణ లేదు. వారి నమోదు త్వరలో ఖరారవుతుంది,’ అని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం కఠినమైన డీ-డూప్లికేషన్, ఆధార్ ఆధారిత ధృవీకరణ వల్ల గత సంవత్సరాల్లో భారీ గణాంకాలకు భిన్నంగా వాస్తవ చిత్రం బయటపడిందని అధికారులు తెలిపారు.

జూనియర్ కళాశాలల్లో కూడా క్షీణత

పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో కూడా నమోదు తగ్గింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం నమోదు గత సంవత్సరం 1,27,270 నుంచి ఈ సంవత్సరం 99,323కు పడిపోయింది. ప్రైవేటు కళాశాలలు 62,123 మంది విద్యార్థులను కోల్పోగా, సహాయక కళాశాలలు 1,331 మంది తగ్గుదలను చవిచూశాయి.

తల్లిదండ్రులు, ఉద్యమకారుల డిమాండ్లు

ప్రభుత్వ హామీలు ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సంఘాలు, బాలల హక్కుల ఉద్యమకారులు రాష్ట్ర స్థాయిలో అత్యవసర నమోదు కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నారు. పాఠశాలల్లో లేని విద్యార్థులను గుర్తించి, వారిని తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నమోదు వ్యత్యాసాలపై స్వతంత్ర విచారణ కోసం కూడా వారు పిలుపు నిస్తున్నారు. ఖచ్చితమైన డేటా విద్యా ప్రణాళిక, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని వారు నొక్కి చెబుతున్నారు.

పబ్లిక్ డొమైన్ లో వివరాలు వెల్లడించని స్కూల్ ఎడ్యుకేషన్

హైస్కూలు విద్యకు సంబంధించిన వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో ఉంచలేదు. అధికారులు, మంత్రుల ఫొటోలు తప్ప అందులో ఏమీ కనిపించడం లేదు. కనీసం ఏ క్లాస్ లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏ క్లాస్ కు ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలు కూడా నమోదు చేయలేదు. పాఠశాలల్లో పిల్లలు చేరుతున్నారని చెబుతున్న విద్యాశాఖ కమిషనర్ వెబ్ సైట్ లో వివరాలు ఉంచేందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దస్ బోర్డ్ ఏర్పాటు చేసి మినిమం వివరాలు ఉంచేందుకు జంకు ఎందుకనేది తల్లిదండ్రుల ప్రశ్న. ఒకటో తరగతిలో చేరే వారి సంఖ్య మాత్రం తప్పకుండా నమోదు కావాలి. మిగిలిన క్లాసుల్లో ఆటో మేటిగ్గా విద్యార్థులు నమోదవుతారు. ఎవరైనా కొత్తగా వచ్చి చేరే వారు ఉంటే వారి సంఖ్య పదుల్లోనే ఉంటుంది.

ఇంటర్ లో ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారో చెప్పలేని ప్రభుత్వం

చాలా మంది పేద విద్యార్థులు పదో తరగతి పాస్ కాగానే కాలేజీలో చదువుకునేందుకు చేరటం లేదు. చదువు మానేస్తున్నారు. ఎందుకు వారు చదువు మానేస్తున్నారని విచారించే వ్యవస్థను రూపొందించాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 26 వేల మందికి పైన ఇంటర్ విద్యలో చేరకుండా పదో తరగతితోనే ఆపేశారు.

ప్రభుత్వ చర్యలు

విద్యా మంత్రి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాలు, రెగ్యులర్ సమీక్షలు ప్రారంభించారు. ప్రతి విద్యార్థిని డిజిటల్‌గా ట్రాక్ చేసే పారదర్శక, స్పందనాత్మక విద్యా వ్యవస్థను నిర్మిస్తున్నాము. ఎవరూ వెనుకబడకుండా చూస్తామని లోకేష్ పేర్కొన్నారు.

Tags:    

Similar News