బలిజలు, దొమ్మర్ల మధ్య గొడవేంటీ?

దొమ్మర్ల పేరు మారిస్తే బలిజల అభ్యంతరమేమిటీ? పవన్ కల్యాణ్ జోక్యాన్ని ఎందుకు కోరుతున్నారు..

Update: 2025-09-20 02:30 GMT
Graphics- M.V. Sivaiah (The Federal)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓ జీవో రెండు కులాల మధ్య కుంపటి రాజేసింది. అస్తిత్వ పోరాటం చేస్తున్న ఓ సామాజికవర్గం తన అస్తిత్వానికి కొత్త రూపు ఇవ్వాలని కోరుకుంటుంటే మరో సామాజిక వర్గం తమ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడీ వివాదం ఎక్కడి దాకా వెళుతుందీ, ఏయే వర్గాలు ఎవరి డిమాండ్ కి తలొగ్గుతాయనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 14, 2025న కీలక నిర్ణయం తీసుకుంది. దొమ్మర కులం పేరును మార్చాలని చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ కు అనుగుణంగా 'గిరి బలిజ'గా మార్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ లోని బలిజ సామాజిక వర్గం (కాపు ఉపకులం) వ్యతిరేకిస్తోంది. ఊరూవాడా సమావేశాలు పెట్టి ఆ జీవోను ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరుతోంది.
అసలింతకీ వివాదం ఏమిటీ?
దొమ్మర కులస్తులు (DOMMARA) తమ కులం పేరు మార్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కులం పేరుతో సామాజిక అవమానాలు ఎదుర్కొంటున్నామని, అటు సొసైటీలో ఇటు సినిమాల్లో “దొమ్మర నాకొడకా”, “దొమ్మరోడు” వంటి తిట్టు పదాలు వాడుతున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మానసిక వేదనను తొలగించాలన్న దొమ్మర్ల డిమాండ్ ను అంగీకరించి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 14న G.O.Ms.No.5- dated 14-08-2025ను విడుదల చేసింది.
ఆ జీవోలో ఏముందంటే..
1970 అక్టోబర్ 23న విద్యాశాఖ విడుదల చేసిన జి.ఓ. ఎమ్‌.ఎస్‌. నం.1793లో పేర్కొన్న కులాలు- ఆర్ధికంగా, సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడ్డవని ప్రభుత్వం ప్రకటించింది. వాటిని A, B, C, D, E గ్రూపులుగా విభజించింది. అందులో “దొమ్మర” అనే కులాన్ని రాష్ట్ర జాబితాలో గ్రూప్-‘A’ లో, అలాగే కేంద్ర ప్రభుత్వ OBC జాబితాలో కూడా 7వ స్థానంలో చేర్చారు.

అయితే కొంతమంది వ్యక్తులు “దొమ్మర నాకొడకా”, “దొమ్మరోడు”, “దొమ్మరోడులా ఉన్నావు” వంటి తిట్టు పదాలను వాడుతున్నారని, సినిమాలలో కూడా ఆ కులానికి వ్యతిరేకంగా పర్యాయపదాలు, సామెతలు చెబుతున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఇవి ఆ సామాజికవర్గం లేదా కుల ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తున్నాయి. వారి గౌరవాన్ని కించపరుస్తున్నాయి.
ఈ విషయాన్ని గమనించి, ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. ఆ కుల ప్రజలు అనుభవిస్తున్న మానసిక వేదన తొలగించడానికి, సామాజిక అవమానాన్ని నిలువరించడానికి “దొమ్మర” అనే పేరును “గిరి బలిజ”గా మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో గ్రూప్-‘A’ కింద, సీరియల్ నంబర్ 7 వద్ద చేర్చబడుతుంది.
సవరణ (Amendment)
జి.ఓ. ఎమ్‌.ఎస్‌. నం.1793, విద్యాశాఖ, తేదీ 23.09.1970లోని అనెక్సర్ – I లో, గ్రూప్-‘A’, సీరియల్ నం.7 స్థానంలో ఈ క్రింది విధంగా మార్చబడును:
సీరియల్ నం.7 – దొమ్మర (గిరి బలిజ)
గవర్నర్ ఆదేశానుసారం జారీ చేయబడినది.
ఎస్. సత్యనారాయణ
ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టు గవర్నమెంట్
కాపీ టూ :
డైరెక్టర్, బి.సి. సంక్షేమం, విజయవాడ
మెంబర్ సెక్రటరీ, ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ బిసి, విజయవాడ
దీని ప్రకారం ఇప్పటి వరకు “దొమ్మర” గా పిలిచిన కులాన్ని, ఇకపై “దొమ్మర (గిరి బలిజ)”గా పిలుస్తారు. బీసీ హోదాలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం, ఈ మార్పు వల్ల ఆ కులానికి సంబంధించిన అవమానం తొలగిపోతుంది. వారిని గౌరవప్రదమైన పేరుతో పిలవడానికి అవకాశం కలుగుతుంది.
బలిజల వ్యతిరేకత ఎందుకు...
అయితే ఈ నిర్ణయాన్ని బలిజ వర్గాలు, ముఖ్యంగా బలిజ మహాసభ తీవ్రంగా వ్యతిరేకించింది. బలిజ మహాసభ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం- ఇప్పుడు మరో కులాన్ని బలిజల పేరుతో కలపడం తాము అంగీకరించలేమని స్పష్టం చేసింది. దొమ్మర్లను గిరి బలిజలుగా పేర్కొన్న జీవోను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.
బలిజ మహాసభ డిమాండ్ ఇలా ఉంది..
"బలిజలంటే అంత చులకనా! 5 కోట్ల బలిజలకు ఆగ్రహం కలిగించే వ్యవహారం ఇది. జీవో ఉపసంహరించకపోతే పోరాటం చేయటానికి మేము సిద్ధం. ప్రతి కులానికి బలిజ అనే పదం కలపడం చాలా దారుణం. 5 కోట్ల బలిజలు దీనిపై పోరాటం చేయాలని నిర్ణయించాం" అని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ బలిజ సంఘం అధ్యక్షుని పేరిట కర్నూలు నగర బలిజ సంఘం గౌరవ సలహాదారులు గాజుల వెంకట విజయభాస్కర్ తదితరులు ఓ ప్రకటన వచ్చింది. "కులవివక్షకు మేము (బలిజలు) బలి కావాల్నా” అని ప్రశ్నించారు.
"ఆంధ్రప్రదేశ్‌లో బలిజల జనాభా 5 కోట్లు దాటింది. వీరిలో 4% కన్నా తక్కువ శాతం మాత్రమే రాజకీయ హక్కులు, అవకాశాలు పొందుతున్నారు. మొత్తం 1793 కులాలలో బలిజలను ప్రతిసారీ వెనుక్కి నెడుతూనే ఉన్నారు. ఇది అన్యాయం. బలిజలకు ఎటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. కానీ ఇతర కులాలకు బలిజలని తగిలిస్తున్నారు. ఇది అవమానకరం. మా అస్తిత్వాన్ని దెబ్బ తీసే చర్య ఇది.

ఇకపై బలిజ కులాన్ని అవమానించే పదజాలాన్ని ఎవరైనా వాడితే సహించబోమని హెచ్చరించారు. మద్రాస్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో బలిజలకు గౌరవం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిర్లక్ష్యం జరుగుతోంది" అని పేర్కొన్నారు.
దొమ్మర్లను గిరి బలిజలు గా మార్చి అసలు బలిజలతో మేళవించడం తప్పు అని, ఇది బలిజల ఐడెంటిటీని దెబ్బతీస్తుందని, మా కుల పేరును ఇతరులకూ ముద్రించడం అన్యాయమని పేర్కొన్నారు. గిరి బలిజ అని పెట్టడానికి బదులు గిరి చౌదరి, గిరి రెడ్డి, గిరి బ్రాహ్మణ, గిరి వైశ్య వంటివి పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల బలిజలు ఉద్యమానికి దిగుతారని హెచ్చరించారు మరో నాయకుడు చెన్నంశెట్టి బసవయ్య.
రాజకీయ–సామాజిక ప్రభావం
దొమ్మరుల కోణం: వారికి ఇది గౌరవప్రదమైన ముందడుగుగా అనిపిస్తోంది. అవమానపరిచే పదాల నుండి విముక్తి లభిస్తుంది.
బలిజల కోణం: బలిజలకు ఇది ఐడెంటిటీ సంక్షోభంగా కనిపిస్తోంది. వారి పేరు ఇతర కులాలకు ముందు లేదా వెనుక పెట్టడం అన్యాయం అన్న భావన కలుగుతోంది.
కాపు ఉద్యమం: రిజర్వేషన్ల కోసం ఇప్పటికే కాపులు, బలిజలు కలిసి పోరాడుతున్న తరుణంలో ఈ కొత్త సమస్య వచ్చింది.
రాజకీయ లెక్కలు: పెద్ద కుల వర్గాలుగా లెక్క చూపడం ఎన్నికల్లో “నెంబర్ గేమ్”లో ప్రయోజనం తీసుకురావొచ్చు.
వెల్లువెత్తుతున్న ఖండన మండనలు..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర కులస్థుల ఆత్మగౌరవ పరిరక్షణ పేరుతో ఆ కులం పేరును గిరి బలిజ అని నామకరణం చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు అర్జా రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన G.O.No 5 తో బలిజ కులస్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. దొమ్మరి కులస్తుల పట్ల జనాల్లో చిన్నచూపు ఉంటుందన్న భావనతో వారి కులం పేరులో మార్పు కోరుకోవడాన్ని సమర్ధించవలసిందే కానీ పేరు మార్పులో బలిజ అనే పదం చేర్చడం మా బలిజ కులస్తులకు ఆక్షేపణీయమని, ఇప్పటికే బలిజలకు సంబందం లేని పలు కులాలకు బలిజ అన్న పదాన్ని చివర తగిలించి బలిజ కుల ఔచిత్యాన్ని, విశిష్టతను ప్రశ్నార్ధకంగా మార్చారని ఇక దీనిని ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.
ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా చేయడం వల్ల దొమ్మర్లకూ అన్యాయమే...
దొమ్మర్లను గిరి బలిజల్లో కలపడం వల్ల వాస్తవ దొమ్మర్లకూ నష్టం జరిగే అవకాశం ఉందని కర్నూలు నగర బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి మండ్లెం రవికుమార్, ఉపాధ్యక్షులు పసులపాటి అమర్నాథ్ అన్నారు. రాయలసీమ జిల్లాలలో కొంతమంది రెడ్ల కుల ధ్రువీకరణ పత్రాలలో కాపు అని ఉండడం వలన కాపు కార్పొరేషన్ లోన్లను పొందినట్లు రుజువులు ఉన్నాయని, ఆ విధంగా ఇప్పటికే బలిజ లకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఇలా దొమ్మర కులం పేరులో బలిజ చేర్చడం వలన భవిష్యత్తులో దొంగ సర్టిఫికెట్లతో దొమ్మరి కులస్తుల అవకాశాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుందన్నారు. రాయలసీమలో బలిజలు ఓ.సి. లుగా ఉన్నారని, బలిజలకు ఏ మాత్రం సంబంధం లేని పలు బి.సి. కులాలకు పేరు మార్పు అనే వంకతో వారి కులాల చివర బలిజ అన్న పదం చేర్చడం ద్వారా బలిజ కులస్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని, దొమ్మర కులానికి కొత్తగా పెట్టిన పేరు గిరి బలిజ నుండి బలిజ అన్న పదాన్ని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
త్వరలోనే అన్ని మండల కేంద్రాలు, కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన తెలియచేసి మెమోరాండం ఇస్తామని, అప్పటికి ప్రభుత్వం దిగి రాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఒక కులం పేరుని ఇంకో కులానికి పెడతారని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై దృష్టి సారించి వెంటనే ఉపశమన చర్యలకు ఉపక్రమించాలని మహా బలిజ సమ్మేళనం నాయకులు ఈశ్వర్ కుమార్, శైలేష్ భాను, ప్రకాష్, శేషు, వంశీకృష్ణ, మురళి మోహన్, మధుబాబు డిమాండ్ చేశారు.

దొమ్మర కులానికి “గిరి బలిజ” అనే కొత్త పేరు ఇవ్వడం వలన ఒక వర్గానికి గౌరవం లభించినా, మరో వర్గానికి అవమానంగా మారింది. ప్రభుత్వ ఉద్దేశం సామాజిక అవమానం తొలగించడమే అయినా, దీని ప్రభావం ఇప్పుడు కాపు–బలిజ వర్గాలపై పడింది.
ఈ రెండు వర్గాల విశ్వాసాన్ని ఎలా నిలబెడుతున్నది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలైన సవాల్.
Tags:    

Similar News