‘వారందరికి అండగా నిలుస్తాం’.. కొడాలి నాని భరోసా
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకల అరాచకాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నేతలు ఘంటాపథంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో దాడులకు గురైన నేతలకు కొడాలి నాని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన మూకల అరాచకాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నేతలు ఘంటాపథంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో దాడులకు గురైన నేతలు, కార్యకర్తలకు మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని భరోసా కల్పించారు. దాడులకు గురైన వారందరికీ తాను అండగా నిలుస్తానని, వారి ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి తీసుకోవాల్సి చర్యల గురించి వివరిస్తానని చెప్పారు. కౌంటింగ్ ముగినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు, నేతలపై టీడీపీ, జనసేన మూకలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇళ్లు, కార్లు ధ్వంసం చేసి పైశాచికానందాన్ని పొందుతున్నారని, తమ పార్టీ నేతలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు.
పోలీసుల సహకారంతోనే
వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు పోలీసుల సహకారం కూడా ఉందని కొడాలి నాని ఆరోపించారు. దాడులను అసలు పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నారని, దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లో చూస్తూ ఉంటున్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం రవ్వంతైనా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని. టీడీపీ, జనసేన అల్లరి మూకలు పెట్రేగిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులపై తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, ఈ దాడులపై న్యాయ పోరాటం చేస్తామని, ఎంత కాలమైనా దాడులకు గురైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పుకొచ్చారు.
‘డీజేపీ ఆదేశాల మేరకే పోలీసులు’
పోలింగ్ పూర్తయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మూకలు మారణహోమం సృష్టిస్తున్నాయని, ఇంత జరుగుతున్నా వారిపై ఎటువంటి కేసులు నమోదు కాలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అందుకు డీజీపీ ఆదేశాలే కారణమని, టీడీపీ మూకలపై కేసులు పెట్టొద్దని డీజేపీనే ఆదేశించారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా ఉన్న ఆంధ్రను టీడీపీ.. యూపీ, బీహార్ లాంటి మరో హింసా రాష్ట్రంగా మారుస్తోందని, దానిని ఆపాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. మే 13న జరిగిన కౌంటింగ్ రోజునే బందర్‌లో టీడీపీ మూకలు చెలరేగిపోయి దాడులు చేశాయని, వారిపై ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు కేసులు నమోదు చేసుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను టీడీపీ పతనావస్థకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దాడులు వాళ్లు చేస్తూ వైసీపీ వాళ్లే దాడులు చేస్తున్నారని కబుర్లు చెప్తున్నారని విమర్శించారు.