ఏపీ లిక్కర్ స్కాం:ఆ దేవుడే కాపాడుతాడు అంటున్న నారాయణస్వామి
మా నాన్న చాలా మంచోడంటున్న కూతురు కృపాలక్ష్మి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-23 14:33 GMT
"నేను ఏ తప్పు చేయలేదు. ఆ భగవంతుడే కాపాడుతాడు. తప్పు చేసి ఉంటే శిక్షిస్తాడు" అని ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామి దేవుడిపై భారం వేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే స్కాంకు ఎక్కడ ఆస్కారం ఉంది అని నారాయణస్వామి ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్థలకు నాపై ఇంత కక్ష, కార్పణ్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు నన్ను ప్రలోభ పెట్టాలని చూశారని నారాయణస్వామి ఘాటు ఆరోపణ చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం జరగలేదు. ఇది పూర్తిగా టిడిపి ప్రభుత్వం, మీడియా వల్లే జరుగుతోందని వైసిపి డిప్యూటీ మాజీ సీఎం కళతూరు నారాయణస్వామి వ్యాఖ్యానించారు. సిట్ అధికారుల విచారణకు సహకరించాను. దీనిపై మీడియా కథనాల వల్ల రాత్రి నిద్రకు దూరమయ్యాను అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివారం నుంచి నగదు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారనడం ఎంతమాత్రం వాస్తవం కాదని ఆయన వివరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కీలక నాయకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి, గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి పుత్తూరులోని నివాసంలో( special investigative team SIT) అధికారులు తనిఖీ, మీడియా కథనాలపై ఆయన సీరియస్ గా స్పందించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కే. నారాయణస్వామి, ఆయన కూతురు కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు.
"సిట్ విచారణలో అధికారులకు నేను సహకరించాను. వారు నాకు సహకరించారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను" అని నారాయణ స్వామి చెప్పారు.
"ఇందులో నా పాత్ర ఏమీ లేదు అంతా పైవాళ్లు చేయించారు" అనే మాట నేను ఎక్కడా వాడలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
"సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. విచారణకు పిలిచినప్పుడు రావాలి" అని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. జరిగింది ఇది అయితే.. మీడియా ఇష్టానుసారంగా తనపై కథనాలు రాసిందని నిరసన వ్యక్తం చేశారు.
"మీడియాకు నాపై ఇంత కక్ష, కార్పణ్యాలు ఎందుకు? " అని కూడా ఆయన ప్రశ్నించారు.
"ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు అన్ని పారదర్శకంగానే జరుగుతాయి. ప్రైవేటుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తేనే కదా అవినీతికి ఆస్కారం ఉంటుంది" అని నారాయణస్వామి అన్నారు. సమితి అధ్యక్షుడిగా, సత్యవేడు ఆ తర్వాత జీడీ. నెల్లూరు ఎమ్మెల్యేగా తాను విశేషమైన సేవలు ప్రజలకు అందించానని నారాయణస్వామి తన వ్యక్తిగత చరిత్రను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
గంగాధర నెల్లూరులో 175 పల్లెల్లో పాఠశాలలో నిర్మించాను. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జూనియర్, డిగ్రీ కళాశాల తోపాటు ప్రాథమిక విద్యకు కూడా పెద్దపీట వేశానంటూ ఆయన చేసిన పనులను గుర్తు చేశారు. మీడియా సమావేశంలో నారాయణస్వామిని కొన్ని ప్రశ్నలు అడగడానికి చేసిన ప్రయత్నానికి ఆయన కుమార్తె కృపాలక్ష్మి అడ్డుపడ్డారు.
2024 ఎన్నికల్లో తండ్రి నారాయణ స్వామికి బదులు వైసీపీ టికెట్ దక్కించుకున్న కృపాలక్ష్మి జీడీ. నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
"మా నాన్న చాలా మంచివారు. అవినీతికి పాల్పడలేదు. మంచి పనులే చేశారు. లిక్కర్ స్కామ్ అనేది లేదు" అని కృపాలక్ష్మి క్లీన్ చిట్ఇచ్చారు.
"మా ఇంటి నుంచి సిట్ అధికారులు, నగదు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసున్నారనడం అవాస్తవం. మా నాన్న నారాయణస్వామికి ల్యాప్ టాప్ ఎలా వాడాలనేది కూడా తెలియని అమాయకుడు" అని కృపాలక్ష్మి వివరించారు.
బాబు ఆఫర్ ఇచ్చారు..
"వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు నన్ను ప్రలోభ పెట్టాలని చూశారు. పదవులు, డబ్బు కోసం ఎప్పుడూ నేను దిగజారలేదు" అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
"రాజకీయాల్లో వైఎస్ కుటుంబం నాకు అవకాశం కల్పించింది. వారికి విశ్వాసపాత్రుడుగానే ఉంటా" అని వైఎస్ జగన్ నాయకత్వంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి తన పదవీకాలంలో జరిగిన వ్యవహారంపై ప్రశ్నించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మీడియా సమావేశం మొత్తం సిట్ అధికారులు తనను విచారణ చేసిన అంశంకే పరిమితం అయ్యారు. మినహా డిజిటల్ పేమెంట్లు కాకుండా నగదు లావాదేవీలపై ఆయన వివరణ కోరేందుకు ప్రశ్నలు అడగగానికి కూడా నారాయణస్వామి అవకాశం ఇవ్వకుండా, మీడియాపై నిరసన, హితవు చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు.