ఆంధ్రా లిక్కర్ పాలసీ: రాబడి మీద దృష్టి పెట్టింది, సంక్షేమం మరిచింది

ఇఎఎస్ శర్మ: ఎన్నికల ప్రణాళికను మర్చిపోకుండా యువత, మహిళల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకుని కొన్ని మార్పులు చేయాలి

Update: 2024-10-03 10:56 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మూడు రోజుల క్రింద ప్రవేశపెట్టిన 2024-26 ఎక్సైజ్ పాలసీ ( Excise Policy) కి ఆధారం, కేవలం, రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల సాధించడమే అని స్పష్టంగా తెలుస్తున్నది. టీడీపీ-జనసేన 2024 ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం యువత, మహిళా సంక్షేమానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ లో కనిపించక పోవడం బాధాకరమైన విషయం.

మన రాష్ట్రంలో, గ్రామాల్లో, నగరాలలో, మద్యపానం ఒక శాపం గా మారింది. కేంద్ర సమాజ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2019 లో చేసిన సర్వే ప్రకారం, మన రాష్ట్ర జనాభాలో 6% ప్రజలు మద్యానికి పూర్తిగా బానిసలుగా మారి, వ్యాధిగ్రస్థులు అవ్వడం కారణంగా, జాతీయ స్థాయిలో అధికంగా మద్యపానానికి ప్రభావితమైన రాష్ట్రాల్లో, మన రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉంది.

ఒకవైపు, రాష్ట్ర ఆదాయం పెరిగినా, మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది చిన్నకారు కుటుంబాలు నష్టపోతున్నాయి. కుటుంబాలలో, పురుషులు మద్యపానానికి గురి అవ్వడం వలన, మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి. కుటుంబ ఆదాయం తగ్గి, పిల్లల చదువులకు అంతరాయం కలుగుతున్నది. నేను కొన్ని గ్రామాల్లో 50% కన్నా అధికంగా పురుషులు, మద్యపానం కారణంగా వ్యాధిగ్రస్తులు అయి, ఉపాధులు పోగొట్టుకోవడం చూసాను.

ఆ పరిస్థితి కారణంగానే, మన రాష్ట్రంలో 1994 కు ముందు మహిళా సంఘాలు ఏకకంఠంతో మద్యపాన నిషేధం చేయాలని ఉద్యమాలు చేసి, మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శకులుగా అవ్వడాన్ని మీకు ( ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు) గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వ 2024 ఎక్సయిజు పాలసీ మీద, రాష్ట్రంలో మహిళాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేసి, ప్రజలను మద్యపానం నుంచి దూరంచేసే దిశలో పోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

GOMs No 211 లో 20 వ పేరాలో, మద్యపానం కారణంగా, ప్రజల ఆరోగ్యానికి, సమాజ సంక్షేమానికి కలిగే నష్టాల మీద ప్రజలలో అవగాహన కలుగజేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించడాన్ని స్వాగతిస్తున్నాను. ఆ నేపథ్యంలో, ఎక్సయిజ్ ఆదాయంలో కనీసం 2-3% నిధులు, అటువంటి అవగాహన కార్యక్రమం కోసం ఉపయోగించాలనే నిబంధనను ప్రవేశపెట్టాలి. అటువంటి కార్యక్రమం వివరాల గురించి, ప్రభుత్వం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, మద్యపాన నిషేధం మీద కృషి చేస్తున్న స్వచ్చంధ సంస్థల, మహిళా సంఘాల, నిపుణుల సలహాలు తీసుకోవాలి.

ఎక్సైజ్ పాలసీ లక్ష్యం, రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాలలో, మద్యం, ముఖ్యంగా IMFL అమ్మకాల్లో, కనీసం 30% తగ్గుదల దిశలో ఉండాలి. లిక్కర్ షాపులలో మద్యం అమ్మినప్పుడు, వ్యక్తిగతంగా పరిమితి ని ప్రవేశ పెట్టాలి. లిక్కర్ షాపులు వివిధ మతాల ప్రజల పవిత్ర స్థలాలకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలి. 2024-26 లో GOMs No 211 క్రింద అనుమతించిన 3736 రిటైల్ లిక్కర్ షాపులలో, గీత కార్మికులకు 340 షాప్ లను కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాను.

మన రాష్ట్రంలో, లక్షకుపైగా కుటుంబాలు, కల్లు సేకరించే వృత్తిలో ఉన్నారు. 4,000 కు పైగా కల్లు షాపులు ఉన్నాయి. ఆ కుటుంబాల సంక్షేమం కోసం, ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయం అందించాలి. అదే కాకుండా, పక్క రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా, ఆధునిక తీరులో, "నీరా" వంటి పానీయాలు స్టార్ హోటళ్లలో ప్రవేశపెడితే, కల్లు వృత్తి మీద ఆధారపడి ఉన్న కుటుంబాల ఉపాధులు, జీవితాలు మెరుగు పడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎక్సయిజు పాలసీ గాంధీ జయంతి ముందు ప్రవేశపెట్టారు. మద్యపానం గురించి, గాంధీ గారు అన్నమాట:

"నాకు చిన్న కారు కార్మికుల కష్ట నష్టాల మీద అవగాహన ఉంది. మద్యపానానికి గురి అయిన కార్మికుల కుటుంబాలకు మద్యం అపారమైన హానిని కలిగించింది. మద్యం వారికి అందుబాటులో లేకపోతే, వారు మద్యాన్ని ముట్టుకునేవారుకారు. వారే ప్రభుత్వంలో ఉండి ఉంటే, మద్యపాన నిషేధాన్ని అమలు చేసేవారు" 

రాజ్యాంగంలో 47 వ ఆర్టికల్ క్రింద, మద్యపాన నిషేధాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని మీరు గుర్తించాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎక్సయిజు పాలసీ లో తగిన మార్పులు ప్రవేశపెడతారని ఆశిస్తున్నాను

(ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ రాసిన లేఖ)

Tags:    

Similar News