మళ్లీ వెలుగులోకి ఏపీ శాసనమండలి..

ఇప్పుడు అందరి చూపూ శాసనమండలి వైపే..

Update: 2025-09-26 02:40 GMT

సుదీర్గ కాలం తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలకు పూర్వవైభవం వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో మండలిలో మేథావులు, తలపండిన రాజకీయవేత్తలు, ఉద్దండ పిండాల్లాంటి ప్రముఖులు, విద్యావేత్తలు ఉండే వారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజర్గాల నుంచి ఎన్నికయ్యే వారు.. మంచి సమాచారంతో వచ్చే వారు. పలు అంశాలపై సమగ్రమైన, అర్థవంతమైన చర్చ జరిగేది. అయితే బయట ప్రంపంచానికి పెద్దగా తెలిసేది కాదు. శాసనసభ సమావేశాలు అంటారే కాని శాసన మండలి సమావేశాలు అనే విషయం పెద్దగా ప్రస్తావనకు రాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. ముఖ్యమంత్రులు సైతం మండలిలో కూర్చుని ఆసక్తిగా సభ్యులు చెప్పే అంశాలను ఆలకించేవారు. అప్పుడింత రాజకీయ రొంపి, కంపు ఉండేది కాదు.
ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతి దాన్నీ రాజకీయ కోణం నుంచి చూడడం వల్ల మంచి మంచి సమస్యలు కూడా ప్రజల దృష్టికి రాకుండా పోతున్నాయి. బిల్లులు నెగ్గించుకోవడమే ప్రధాన అజెండాగా మారింది.
అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి శాసన మండలిలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఓటమి పాలైన పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉండడమే సమస్యగా మారింది. అంశాల ప్రాతిపదికన చర్చ సాగే అవకాశం లేకపోతోంది. ఫలితంగా శాసన మండలి ఆరోవేలిగా మారింది.
ప్రస్తుతం కూడా ఓటమి పాలైన వైఎస్సార్సీపీకి శాసన మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ శాసన మండలిలో తమ బలం లేదని, ఇటువంటి సభ ఎందుకని రద్దు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి భంగపాటుకూ గురైంది.
సభ ఆవిర్భావం ఇలా...
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (ఏపీఎల్‌సీ) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం 1958 జూలై 1న ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక ముఖ్యమైన శాసన వ్యవస్థగా పనిచేసింది. కానీ 1985లో రద్దుకు గురైంది. 2007లో మళ్లీ పునరుద్ధరించారు. 2020లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అది పూర్తిగా అమలుకు రాలేదు.
నాడు సరదా, సమన్వయం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1956-2014)లో శాసన మండలి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండేది. ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి వచ్చే సభ్యులు మంచి సమాచారంతో, విస్తృత జ్ఞానంతో చర్చల్లో పాల్గొనేవారు. మండలి సభ్యుల సంఖ్య 90 వరకు ఉండేది. ప్రతిపక్ష బలం ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే చర్చలు ఆరోగ్యకరంగా సాగేవి. విమర్శలు ఉండేవి కానీ, వ్యక్తిగత దాడులు తక్కువ.
ఉదాహరణకు కె. రోశయ్య వంటి మంత్రులు మండలి సమావేశాల్లో చెణుకులతో సభను నవ్వులు పూయించేవారు. రోశయ్య 1968-1985 మధ్య మండలి సభ్యుడిగా, తర్వాత మంత్రిగా పనిచేశారు. ఆయన బలమైన గొంతు, సమాచార ఆధారిత ప్రసంగాలు మండలిని ఆకర్షణీయంగా చేసేవి. సభ్యులు వివిధ అంశాలపై సమగ్ర చర్చలు జరిపేవారు. ప్రజలు కూడా సభను చూడటానికి ఆసక్తి చూపేవారు. రోడ్లు, గృహనిర్మాణం, రవాణా వంటి విషయాలపై రోశయ్య చర్చలు చెప్పుకోవచ్చు. ఆ కాలంలో మండలి ఒక 'సెకండ్ ఛాంబర్'గా పనిచేసి, అసెంబ్లీ బిల్లులను మెరుగు పరిచేది. కానీ రాజకీయ కక్షలు తక్కువగా ఉండేవి. ఇది మండలిని ఒక సమన్వయ సభగా చేసింది. ఎక్కడా వాకౌట్లు, తీవ్రమైన గొడవలు ప్రధానంగా ఉండేవి కావు.
మండలిలో ప్రతిపక్ష హవా
ప్రస్తుతం (2024-2025) ఏపీ మండలి సమావేశాలు మరింత రాజకీయ రంగును సంతరించుకున్నాయి. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, మండలిలో వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సభ్యులు (32 మంది ఎమ్మెల్సీలు) ఉన్నారు. అయితే కొందరు రాజీనామా చేయగా.. మండలి స్పీకర్ వాటిని ఆమోదించలేదు. ఈ సంఖ్య కూటమి ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ ఇబ్బందులు సృష్టిస్తోంది. 2025లో వర్షాకాల సమావేశాలు (సెప్టెంబర్ 19-27), నవంబర్ 2024లో బడ్జెట్ సెషన్లలో తీవ్రమైన చర్చలు జరిగాయి.
ఇవే రుజువులు...
మెడికల్ కాలేజీల PPP మోడ్: వైఎస్సార్‌సీపీ పీపీపీ మోడ్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్‌షిప్ (PPP)లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని "ప్రజా ఆరోగ్య వ్యతిరేకం" అంటూ బొత్స సత్యనారాయణ (మండలి ప్రతిపక్ష నాయకుడు) విమర్శించారు. ఇది సభలో గందరగోళానికి దారితీసి, వాకౌట్లు జరిగాయి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దీన్ని "వయబుల్ సొల్యూషన్" అని వివరించారు. కానీ చర్చ తీవ్రంగా సాగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: వైఎస్సార్‌సీపీ సభ్యులు పలు మార్లు వాకౌట్ చేసి, ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి నారా లోకేష్ "ప్రైవేటీకరణ లేదు" అని స్పష్టం చేశారు. కానీ బొత్స దీన్ని "ప్రజలను మోసం చేసే ప్రకటన" అన్నారు. ఇది 2025 సెప్టెంబర్ చర్చల్లో హైలైట్ గా నిలిచింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు: మంత్రి లోకేష్ వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.4,000 కోట్ల బకాయిలు మిగిల్చారని విమర్శించగా, బొత్స సత్యనారాయణ తిప్పికొట్టారు. ఇది 2025 సెప్టెంబర్ 23న తీవ్రమైన వాదనకు దారితీసింది. అడ్జర్న్‌మెంట్ మోషన్ రిజెక్ట్ అయింది.
ఈ ఉదాహరణలు ప్రస్తుత మండలి చర్చలు ఎక్కువగా ఆరోపణలు, కౌంటర్ ఆరోపణలు, వాకౌట్లతో సాగుతున్నాయి. బొత్స సత్యనారాయణ వంటి నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది.
విభేదాల విశ్లేషణ...
నాటి చర్చలు సమాచారంతో ఉండేవి. సరదాగా సాగేవి (రోశయ్య చెణుకులు). నేటి చర్చలు తీవ్రమైనవి, కక్షలతో నిండినవి. PPP, స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో వ్యక్తిగత విమర్శలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ, సమన్వయం ఉండేది. నేటి వైఎస్సార్‌సీపీ మండలిని 'చుక్కెదురు' సాధనంగా వాడుతోంది. ఫలితంగా సభలు అంతరాయాలతో సాగుతున్నాయి. నాటి మండలి తక్కువ పబ్లిసిటీ కలిగి ఉండేది. కానీ నేటి సమావేశాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది రాజకీయ దుమారాన్నిసృష్టిస్తోంది.
మండలి ఎప్పుడూ 'సెకండ్ థాట్' సభగా పనిచేస్తుంది. కానీ నాటి సమన్వయం నుంచి నేటి ఘర్షణలకు మార్పు రాజకీయ పరిణామాలు. రాష్ట్ర విభజన, పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏపీ మండలి సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం. కానీ నాటి ఆరోగ్యకర చర్చల నుంచి నేటి కక్షలకు మార్పు సవాలుగా మారింది. భవిష్యత్తులో సమన్వయం పెరిగితే, మండలి మరింత ప్రభావవంతం అవుతుంది.
Tags:    

Similar News