ఏపీ, కర్నాటక ‘ట్వీట్’ రగడ!

బ్లాక్‌బక్ సీఈవో పోస్ట్ చుట్టూ ఏపీ, కర్నాటక మధ్య రాష్ట్రీయ రగడ, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాటల యుద్ధం.

Update: 2025-09-20 07:28 GMT
కర్నాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్

ఒక్క ట్వీట్... రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీసింది. కర్నాటకలోని బ్లాక్‌బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ బెంగళూరు రోడ్ల సమస్యలపై చేసిన పోస్ట్, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్‌ను విశాఖపట్నం ఆహ్వానానికి ప్రేరేపించింది. అయితే ఇది కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మింగుడు పడక, 'బ్లాక్‌మెయిల్' అంటూ ఘాటుగా స్పందించారు. దీనికి లోకేష్ కూడా షార్ప్ కౌంటర్ ఇచ్చారు. ఫలితంగా ఈ సంఘటన రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులు, అభివృద్ధి, రాజకీయ పోటీలను మరోసారి బట్టబయలు చేసింది. ఇది కేవలం రోడ్ల సమస్య కాదు, రాష్ట్రాల మధ్య పోటీతత్వానికి అద్దం పట్టిన రాజకీయ డ్రామా.

ట్వీట్ నుంచి ట్విస్ట్ వరకు

బ్లాక్‌బక్ సీఈవో రాజేశ్ యాబాజీ బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ (బెల్లండూరు)లోని గుంతలు, ధూళి, ట్రాఫిక్ సమస్యలపై సెప్టెంబర్ 17న X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. "గత 9 ఏళ్లుగా ఇక్కడే మా ఆఫీసు, హోమ్... కానీ ఇక సాధ్యం కావట్లేదు. మా కాలేజీలు 1.5 గంటలకు మించి కమ్యూట్ చేస్తున్నారు. రోడ్లు గుంతలతో నిండి, మరమ్మతులకు ఎలాంటి ఇంటెంట్ లేదు" అంటూ ఫిర్యాదు చేశారు. దీన్ని గమనించిన ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి, "విశాఖపట్నం వచ్చేయండి. మా సిటీ టాప్-5 క్లీనెస్ట్ సిటీల్లో ఒకటి. బెస్ట్ ఇన్‌ఫ్రా, మహిళలకు సేఫెస్ట్" అంటూ ఆహ్వానించారు.

కర్నాటకలో కలకలం

ఇది కర్నాటకలో కలకలం రేపింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియా ముందు స్పందిస్తూ "ఇటువంటి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లకు మా ప్రభుత్వం లొంగదు. వారు ఎక్కడికైనా వెళ్లవచ్చు. బెంగళూరులో ప్రపంచస్థాయి కంపెనీలు ఉన్నాయి. రూ.1,100 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టాం. నవంబర్ వరకు డెడ్‌లైన్ విధించాం" అని వ్యాఖ్యానించారు. దీనికి లోకేష్ మరో ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు. "మా ఏపీని మిగతా రాష్ట్రాల నుంచి వేరు చేసేది ఇదే. ప్రజల జెన్యూన్ గ్రీవెన్సెస్‌ను 'బ్లాక్‌మెయిల్' అని డిస్‌మిస్ చేయం. వాటిని డిగ్నిటీ, సీరియస్‌నెస్‌తో ట్రీట్ చేస్తాం." అయితే రాజేశ్ యాబాజీ తర్వాత క్లారిఫై చేస్తూ, "బెంగళూరు మా హోమ్. సిటీ నుంచి వెళ్లడం లేదు, మరో ప్రాంతానికి మాత్రమే షిఫ్ట్ అవుతున్నాం" అని చెప్పారు.

పెట్టుబడుల పోటీలో రాష్ట్రీయ రంగు

ఈ సంఘటనను రాజకీయ కోణంలో చూస్తే... ఇది దక్షిణ భారత రాష్ట్రాల మధ్య పెరుగుతున్న పెట్టుబడి పోటీకి నిదర్శనం. కర్నాటక స్టేట్ బెంగళూరును ఐటీ హబ్‌గా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టారు. ఇటీవల లండన్ పర్యటనలో లోకేష్ పలు కంపెనీలతో చర్చలు జరిపారు. విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ఈ ట్వీట్‌ను అవకాశంగా మలచుకున్నారు. ఇది కేవలం ఆహ్వానం కాదు, కర్నాటక ప్రభుత్వం ఇన్‌ఫ్రా సమస్యలను పట్టించుకోకపోవడంపై వ్యంగ్యాస్త్రం కూడా అని చెప్పొచ్చు.

బ్లాక్ మెయిల్ పదంతో బూమర్

మరోవైపు డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్నాటక ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసేలా ఉన్నాయి. కానీ 'బ్లాక్‌మెయిల్' అన్న పదం రాజకీయంగా బూమరాంగ్ అయింది. ఇది ప్రజల సమస్యలను తక్కువ చేసినట్టు కనిపించి, లోకేష్‌కు కౌంటర్ ఇచ్చే అవకాశం ఇచ్చింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది రెండు రాష్ట్రాల మధ్య సమాఖ్య టెన్షన్‌లను హైలైట్ చేస్తుంది. కర్నాటకలో వర్షాలు, రోడ్ల సమస్యలు జాతీయ చర్చగా మారుతుండగా, ఏపీ ప్రభుత్వం దాన్ని తమ ప్రచారానికి వాడుకుంటోంది. ఇది బీజేపీ-కాంగ్రెస్ మధ్య రాజకీయ పోటీని కూడా ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే లోకేష్ బీజేపీ కూటమి భాగస్వామి. డీకే కాంగ్రెస్ నేత.

అయితే ఈ రగడ రాజకీయ లాభాల కోసమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెంగళూరు రోడ్ల సమస్య దీర్ఘకాలికమైనది. కానీ ప్రభుత్వాలు దాన్ని రాజకీయంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి. లోకేష్ కౌంటర్ ఏపీని 'ప్రజాస్నేహపూర్వకం'గా చూపించే ప్రయత్నం. కానీ కర్నాటకలోని ఐటీ ఇండస్ట్రీని దెబ్బతీయాలన్న ఉద్దేశ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ రాష్ట్రాల మధ్య పెట్టుబడి యుద్ధాలు ఎలా సోషల్ మీడియా ద్వారా రగిలిపోతున్నాయో చూపిస్తుంది.

రాజకీయం కాదు... సమస్య పరిష్కారం కావాలి

ఈ రాజకీయ వార్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయన్న విమర్శలను రేకెత్తిస్తోంది. బెంగళూరు రోడ్లు మెరుగుపరచాలి, విశాఖను అభివృద్ధి చేయాలి. కానీ ట్వీట్‌లతో రచ్చ చేయడం కాదు. ఇది దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్. సోషల్ మీడియా రాజకీయం, పెట్టుబడి పోటీల మధ్య సమస్యలు మరుగున పడుతున్నాయి. రెండు ప్రభుత్వాలు ఇకనైనా గ్రౌండ్ రియాల్టీపై ఫోకస్ పెట్టాలి. లేకుంటే ఇటువంటి 'బ్లాక్‌మెయిల్' డ్రామాలు మరిన్ని రగడలకు దారి తీస్తాయి.

Tags:    

Similar News