మీసం మెలేసి చెప్పండి, ఇవన్నీ మనవే!
అబ్బబ్బా.. ఆంధ్ర స్పెషల్స్ ఇన్ని ఉన్నాయా!;
By : The Federal
Update: 2025-08-13 12:21 GMT
భారతదేశంలో భౌగోళిక గుర్తింపు హక్కులున్న (GI – Geographical Indications) ఉత్పత్తుల 643కి చేరింది. ఇవన్నీ ఆయా రాష్ట్రాల సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థిక ప్రత్యేకతకు ప్రతీకలు. ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 19 జీఐ ఉత్పత్తులు అధికారిక గుర్తింపు పొందాయి. వీటిలో 4 వ్యవసాయ ఉత్పత్తులు, 1 ఆహారోత్పత్తి, 11 హస్తకళాకృతులు, 3 మానుఫ్యాక్చర్డ్–నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది నిజంగా గర్వపడదగ్గ అంశమని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
హస్తకళాకృతుల సువర్ణభాండారం..
ఆంధ్రప్రదేశ్ హస్తకళలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినవి. శ్రీకాళహస్తి కలంకారీ చిత్రలేఖనం తన దార్ఢ్యం, మైథాలజికల్ థీమ్స్‌తో ప్రత్యేకతను చాటుకుంటుంది. కొండపల్లి బొమ్మలు చెక్కతో చేసే సున్నితమైన శిల్పకళ, మచిలీపట్నం కలంకారీ ముద్రణా పద్ధతులు, బుడితి బెల్ – బ్రాస్ క్రాఫ్ట్ లోహకళా నైపుణ్యం, ఏపీ లెదర్ పప్పెట్రీ చరిత్రను మలచిన చాయాచిత్రాలు— ఇవన్నీ ఆంధ్ర ప్రదేశానికి ప్రత్యేకమైన ముద్రలు.
ఉప్పాడ జాందాని చీరలు, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు–వస్త్రాలు, ధర్మవరం పట్టు చీరలు–పాపడాలు మహిళల ఆభరణం లాంటి సంప్రదాయ చేనేత కృతి. బొబ్బిలి వీణ సంగీతసాధనలో గర్వకారణం. ఉదయగిరి వుడెన్ కట్లెరీ, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఏటికొప్పాక బొమ్మలు, ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్స్ వంటివి చెక్క, రాతి నైపుణ్యానికి చిరునామాలు.
వ్యవసాయ ఉత్పత్తులు...
గుంటూరు సన్న మిరప కారం తిన్నవారికి గుర్తుండే రుచి, బనగానపల్లి మామిడి మాధుర్యం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించాయి.
అరకు వ్యాలీ అరబిక కాఫీ పరిమళం కాఫీ ప్రియులకు తప్పనిసరి అనుభవం.
భక్తి, ముక్తి కలయిక..
తిరుపతి లడ్డు – లడ్డూ కేవలం ప్రసాదం కాదు, అది కోట్లాది భక్తుల భక్తి ప్రతీక. అలాగే బందరు లడ్డు ప్రత్యేకమైన రుచితో మిఠాయి ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
ఆర్థిక, సాంస్కృతిక ప్రాధాన్యం
జీఐ గుర్తింపు ఉత్పత్తికి ప్రత్యేకమైన మార్కెట్ విలువను అందించడంతో పాటు, దానిని తయారు చేసే కళాకారులు, రైతులకు ఆర్థిక బలం ఇస్తుంది. ఈ ఉత్పత్తులు కేవలం వాణిజ్యపరమైనవి కాదు; ఇవి రాష్ట్ర చరిత్ర, సంప్రదాయం, జీవనశైలిని ప్రతిబింబించే గుర్తులు.
ఆంధ్రప్రదేశ్ జీఐ ఉత్పత్తులు ఒకవైపు సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుతుంటే, మరోవైపు ఆధునిక మార్కెట్లో తమ స్థానాన్ని బలపరుస్తున్నాయి. కళ, రుచి, నైపుణ్యం, భక్తి— ఇవన్నీ కలసి ఈ భూమి ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతున్నాయి.
మొత్తం జాబితా ఇదీ...
ఆంధ్రప్రదేశ్ జీఐ ఉత్పత్తులు: శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, బుడితి బెల్ – బ్రాస్ క్రాఫ్ట్, ఏపీ లెదర్ పప్పెట్రీ, ఉప్పాడ జాందాని చీరలు, తిరుపతి లడ్డు, గుంటూరు సన్న మిరప, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు–వస్త్రాలు, ధర్మవరం చేనేత పట్టు చీరలు– పాపడాలు, బందరు లడ్డు, ఉదయగిరి వుడెన్ కట్లెరీ, బనగానపల్లి మామిడి, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఏటికొప్పాక బొమ్మలు, ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్స్, అరకు వ్యాలీ అరబిక కాఫీ.