దివాళా అంచున ఏపీ ఫైబర్‌నెట్‌

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు గత ప్రభుత్వం రూ. 2.10 కోట్లు అక్రమంగా చెల్లించింది.

By :  Admin
Update: 2024-12-19 09:01 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) పరిస్థితి బాగా లేదని, ప్రస్తుతం దివాళా అంచున ఉందని, దీనికి గత జగన్‌ ప్రభుత్వం తీరే కారణమని ఆ సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఇంటర్నెట్‌ సేవలు, టీవీ చానల్స్‌ అందించేందుకు దీనిని 2016లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు. గత టీడీపీ హయాంలో 2019 నాటికి 24వేల కిమీ మేర కేబుల్‌ లైన్లు వేసి 10లక్షల కనెక్షన్లు ఇచ్చారని తెలిపారు. అయితే తర్వాత కనెక్షన్ల సంఖ్య దారుణంగా పడిపోయిందని, దాదాపు 5లక్షల కనెక్షన్లకు పడిపోయిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, ప్రస్తుతం దీనిపైన విజిలెన్స్‌ విచారణ జరుగుతోందన్నారు.

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కేబుల్‌ ఆపరేటర్లను కూడా విధింపులకు గురి చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎండీగా పని చేసిన మధుసూదన్‌ అక్రమాలపైనా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారని, కీలక ఫైళ్లను కూడా మర్చేశారని, కీలకమైన అనేక డాక్యుమెంట్లను వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారని ఆరోపించారు. అయితే ఆ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించామని తెలిపారు. వ్యూహం సినిమాను ఫైబర్‌నెట్‌లో టెలికాస్ట్‌ చేసి, ఆ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వ్యూహం సినిమాకు 18లక్షల వ్యూస్‌ వస్తే రూ. 2లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఏకంగా రూ. 2.10 కోట్లు అక్రమంగా అధికారులు చెల్లించారని ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News