ఏపీకి ‘ఫ్లాష్‌ ఫ్లడ్‌’ ముప్పు

ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో పలు జిల్లాలకు ’ఫ్లాష్‌ ఫ్లడ్‌’ ముప్పు ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.;

Update: 2025-08-15 12:20 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరం ఇప్పటికే అతలాకుతలం అవువుతోంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరో వైపు రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఫ్లాష్‌ ప్లడ్స్‌ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలతో పాటు యానాం ప్రాంతాలకు కూడా ఆకస్మిక వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) సంభవించే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రమాదం తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా యానాంలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించడంతో ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

మరో వైపు భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీని వల్ల విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులు దాటుతుండటంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ సూచించారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్లవద్దని హెచ్చరించారు. చేపల వేట కోసం నదిలోకి ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా కళింగపట్నం,విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు.
ప్రస్తుత అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర–ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
Tags:    

Similar News