పింఛన్‌దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ.. ఆశలు నెరవేరేనా!

ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చడమే తమ ప్రభుత్వ ప్రథాన ధ్యేయమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అదనపు పింఛన్‌ను ఒకటో తేదీ నుంచి అందిస్తామని చెప్పారు.

Update: 2024-06-29 05:49 GMT

ఒకటో తేదీ వచ్చేస్తోంది. పింఛన్ తమ ఇంటికి వస్తుందా.. ఖాతాలో పడుతుందా అని పింఛన్‌దారులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దానికి తోడు పింఛన్‌‌ను రూ.4వేలకు పెంచనున్నామని, ఈ పెరిగిన పింఛన్ ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని కూడా టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. జూలై 1వ తేదీన మూడు నెలలు అందాల్సిన అదనపు పింఛన్‌ను కూడా అందిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జూలై 1వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పింఛన్‌దారుల్లో ఆత్రుత, ఉత్సాహం అధికం అవుతున్నాయి. దాంతో పాటుగా పింఛన్ తమ ఇంటికి వస్తుందా లేకుంటే ఖాతాల్లో జమవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇంకా రెండు రోజుల్లో పింఛన్ లబ్దిదారులకు ఎలా అందుతుందో అని అంతా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. లబ్దిదారులకు పింఛన్‌ను ఇంటి దగ్గరే అందిస్తామని వెల్లడించారు.

అదే ప్రభుత్వ కర్తవ్యం

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు చంద్రబాబు. ‘‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం అందించే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయింది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను పెంచి అందిస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. పింఛన్‌లను ఎలా అందిస్తామని అంతా చర్చించుకుంటున్నారు. ఆ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. పింఛన్‌లను లబ్దిదారుల ఇంటి దగ్గరే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్నా, ప్రజా సంక్షేమం కోసం ఒకటో తేదీ నుంచి నిర్ణయాలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు తన లేఖలో చెప్పుకొచ్చారు.

ప్రభుత్వానికి అధిక భారం

పింఛన్ల పెంపకంతో ప్రభుత్వంపై రూ.819 కోట్ల అదనపు భారం పడనుందని చంద్రబాబు వివరించారు. ‘‘గత ప్రభుత్వం పింఛన్‌దారులను ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మూడు నెలల పాటు మీరు పడిన కష్టాలు చూసి ఎంతో చలించిపోయాను. మండుటెండల్లో, వడగాలులు మధ్య మీరు పడిన అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఎందరో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కష్టాలు మా పాలనలో రావు. ఆ దిశగా చర్చలు తీసుకుంటున్నాం. ఏప్రిల్ నెల నుంచే లబ్దిదారులకు పెంచిన పింఛన్ అందిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట మేరకు పింఛన్ పెంపును ఏప్రిల్, మే, జూన్ నెలలకూ వర్తింపజేస్తాం’’ అని లేఖలో చెప్పారు చంద్రబాబు.

పింఛన్ ఒక్కరోజులో అందుతుందా!

పెంచిన పింఛన్‌ను లబ్దిదారులకు ఇంటి దగ్గరే అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందుకోసం తాము సచివాలయం ఉద్యోగులను రంగంలోకి దించనున్నట్లు చంద్రబాబు గతంలో పలుమార్లు చెప్పారు. సచివాలయ సిబ్బంది సహా ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది సహాయం కూడా ప్రభుత్వం తీసుకోనుందని తెలుస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీతో పింఛన్‌ దారులు స్వాంతన పొందుతున్నారు. కానీ ఎన్నికల సమయంలో పింఛన్ అందించడంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. వాలంటీర్లు అందుబాటులో లేనందున తాము ఇంటి దగ్గరే పింఛన్‌ను అందించలేకున్నామని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు అనేకమంది అన్నారు. ఆ సమయంలో పింఛన్ పంపిణీకి వైసీపీ ప్రభుత్వం సచివాలయ సిబ్బంది సహాయం ఎందుకు తీసుకోలేదని అనేక మంది టీడీపీ నేతలు, మేధావులు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది సహాయంతో మూడు రోజుల్లో పింఛన్‌ను ఇంటి దగ్గరకే అందించవచ్చని చెప్పారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తాము సచివాలయ సిబ్బంది సహాయంతోనే పింఛన్‌ను ఇంటి దగ్గర అందిస్తామని చెప్తున్నారు. మరి పింఛన్ పంపిణీ ఒక్కరోజులో పూర్తవుతుందా లేకుంటా గతంలో వారు అన్నట్లే మూడు రోజుల సమయం పడుతుందా అనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News